అల్‌-ఫత్‌'హ్‌: విజయం. ఈ సమూహపు 3 సూరాహ్‌లలో ఇది 2వది. ఇది 'హుదైబియా ఒప్పందం తరువాత 6వ హిజ్రీ (క్రీ.శ.628)లో అవతరింపజేయబడిన మదీనహ్ సూరహ్‌. ఇందులో 29 ఆయతులు ఉన్నాయి. దీని పేరు మొదటి ఆయత్‌లో ఉంది. జు'ల్‌-ఖాఇదహ్‌ 6వ హిజ్రీలో దైవప్రవక్త ('స'అస), దాదాపు 1400 అనుచరులతో ఇ'హ్రామ్‌ ధరించి 'ఉమ్రా కొరకు బయలుదేరుతారు. అది విని, మక్కహ్ ముష్రిక్‌లు, వారి దారికి, అడ్డుపోతారు. అది తెలుసుకొని దైవప్రవక్త ('స'అస) బీర్‌-'ఉస్ఫాన్‌ నుండి తమ త్రోవను మార్చి 'హుదైబియా అనే ప్రాంతం వైపునకు వెళ్ళి అక్కడ ఆగుతారు. 'హూదైబియా, జిద్దహ్-మక్కహ్ ల మధ్య 'హరం సరిహద్దు దగ్గర ఉంది. అక్కడి నుండి తమను 'ఉమ్రా చేసుకోవటానికి అనుమతి అడగటానికి రాయబారిగా 'ఉస్మాన్‌ బిన్‌ 'అప్ఫాన్‌ (ర'ది.'అ.)ను మక్కహ్ కు పంపుతారు. అతనిని చంపారని, శత్రువులు వదంతిలేపుతారు. అది విని దైవప్రవక్త ('స'అస) తమ అనుచరులతో (ర'ది. 'అన్హుమ్‌) వాగ్దానం తీసుకుంటారు. దీనినే బై'అతు ర్రి'ద్వాన్‌ అంటారు. ఆ తరువాత 'ఉస్మాన్‌ (ర'ది.'అ.) తిరిగి వస్తారు. తరువాత మక్కహ్ ముష్రికులతో ఒప్పందం జరుగుతుంది. అందులో: (i) పది సంవత్సరాల వరకు వారి మధ్య ఎలాంటి యుద్ధం జరగకూడదు. (ii) ఇరువురు, ఇతర తెగలవారితో, ఎవరితోనైనా స్నేహం చేసుకోవచ్చు. (iii) ఒక ఖురైషుడు తన పెద్దవారి అనుమతి లేనిదే ఇస్లాం స్వీకరించి మదీనహ్ వెళ్ళితే, ఆ పెద్దవారు అడిగితే, అతనిని వారికి అప్పగించాలి. కాని ఎవడైనా ఇస్లాం వదలి మక్కహ్ వెళ్ళితే వారు అతనిని ముస్లింలకు అప్పగించే అవసరంలేదు. (iv) ఆ సంవత్సరం వారు 'ఉమ్రా చేయకుండా తిరిగి వెళ్ళిపోవాలి. వచ్చే సంవత్సరం వారికి 3 రోజుల కొరకు 'ఉమ్రా చేయటానికి మక్కహ్ లోకి వచ్చే అనుమతి ఇవ్వబడుతుంది, మొదలైనవి... మొదట ఈ ఒప్పందం అనుచరుల (ర'ది.'అన్హుమ్‌) దృష్టిలో మక్కహ్ ముష్రిక్‌లకు లాభదాయకరమైనదిగా కనిపించినా! చివరకు, అది మక్కహ్ ముష్రిక్‌లకే దుర్భరమవుతుంది. ఈ ఒప్పందం తరువాత రెండు సంవత్సరాలలోనే ఖురైషులతో స్నేహ సంబంధాలుగల బనీ-బక్ర్‌ తెగవారు, ముస్లింలతో స్నేహంగల బనీ-'ఖు'జా'అ తెగవారి కొందరు వ్యక్తులను మక్కహ్ లో చంపుతారు. దాని ఫలితంగా 8వ హిజ్రీలో దైవప్రవక్త ('స'అస) పదివేల మందితో మక్కహ్ ఆక్రమణకు బయలుదేరి, మక్కహ్ ను ఆక్రమించుకుంటారు. 19 సంవత్సరాలలో చాలా తక్కువ మంది, దాదాపు 3000, మాత్రమే ముస్లింలు అవుతారు. కాని ఈ ఒప్పందం తరువాత ప్రజలు వేలసంఖ్యలలో ముస్లింలవుతారు. 8వ హిజ్రీలో 10వేల యుద్ధ నిపుణులు తయారవుతారు. మరియు 10వ హిజ్రీలో లక్షమంది ముస్లింలు దైవప్రవక్త ('స'అస)తో 'హజ్జ్‌ కొరకు పోతారు. మొదట ముస్లింలకు అనుకూలమైనదిగా లేక పోయనా, ఈ ఒప్పందం ముస్లింలకు గొప్ప విజయాన్నిస్తుంది. అందుకనే, ఈ సూరహ్‌కు అల్‌-ఫ'త్హ్ (విజయం) అనే పేరు ఇచ్చారు.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 48:1

إِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُّبِينًا ١

(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము;


  • 48:2

لِّيَغْفِرَ لَكَ اللَّـهُ مَا تَقَدَّمَ مِن ذَنبِكَ وَمَا تَأَخَّرَ وَيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكَ وَيَهْدِيَكَ صِرَاطًا مُّسْتَقِيمًا ٢

అల్లాహ్‌! నీ పూర్వపు మరియు భావి కాలపు తప్పులను క్షమించటానికి మరియు నీపై తన అనుగ్రహాన్ని పూర్తిచేయటానికి మరియు నీకు ఋజు-మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయటానికి;


  • 48:3

وَيَنصُرَكَ اللَّـهُ نَصْرًا عَزِيزًا ٣

మరియు అల్లాహ్‌! నీకు గొప్ప సహకారంతో సహాయపడటానికి.


  • 48:4

هُوَ الَّذِي أَنزَلَ السَّكِينَةَ فِي قُلُوبِ الْمُؤْمِنِينَ لِيَزْدَادُوا إِيمَانًا مَّعَ إِيمَانِهِمْ ۗ وَلِلَّـهِ جُنُودُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّـهُ عَلِيمًا حَكِيمًا ٤

ఆయనే, విశ్వాసుల హృదయాలలో శాంతిని అవతరింపజేశాడు, వారి విశ్వాసంలో మరింత విశ్వాసాన్ని అధికం చేసేందుకు. మరియు ఆకాశాలలోని, భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్‌ ఆధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.


  • 48:5

لِّيُدْخِلَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَيُكَفِّرَ عَنْهُمْ سَيِّئَاتِهِمْ ۚ وَكَانَ ذَٰلِكَ عِندَ اللَّـهِ فَوْزًا عَظِيمًا ٥

విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేసేందుకు, అందులో వారు శాశ్వతంగా ఉండేందుకు మరియు వారి పాపాలను తొలగించేందుకూను. మరియు అల్లాహ్‌ దృష్టిలో ఇది ఒకగొప్ప విజయం.


  • 48:6

وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ الظَّانِّينَ بِاللَّـهِ ظَنَّ السَّوْءِ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۖ وَغَضِبَ اللَّـهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا ٦

మరియు కపట-విశ్వాసులు (మునాఫిఖీన్‌) అయిన పురుషులను మరియు కపటవిశ్వాసులు అయిన స్త్రీలను; మరియు బహుదైవారాధకులైన పురుషులను మరియు బహుదైవారాధకులైన స్త్రీలను; అల్లాహ్‌ను గురించి చెడు భావనలు, భావించే వారందరినీ శిక్షించేందుకు. వారిపై చెడు అన్ని వైపుల నుండి ఆవరించి ఉంటుంది. మరియు అల్లాహ్‌ యొక్క ఆగ్రహం వారిపై విరుచుకుపడుతుంది. మరియు ఆయన వారిని శపించాడు (బహిష్కరించాడు); మరియు వారి కొరకు నరకాన్ని సిధ్ధపరచి ఉంచాడు. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం!


  • 48:7

وَلِلَّـهِ جُنُودُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّـهُ عَزِيزًا حَكِيمًا ٧

ఆకాశాలలోని మరియు భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.


  • 48:8

إِنَّا أَرْسَلْنَاكَ شَاهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا ٨

నిశ్చయంగా, (ఓ ము'హమ్మద్‌!) మేము నిన్ను సాక్షిగా, శుభవార్తలు అందజేసేవానిగా మరియు హెచ్చరించేవానిగానూ చేసి పంపాము.


  • 48:9

لِّتُؤْمِنُوا بِاللَّـهِ وَرَسُولِهِ وَتُعَزِّرُوهُ وَتُوَقِّرُوهُ وَتُسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلًا ٩

ఎందుకంటే (ఓ ముస్లింలారా!) మీరు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించాలనీ మరియు మీరు అతనితో (ప్రవక్తతో) సహకరించాలనీ మరియు అతనిని గౌరవించాలనీ మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన (అల్లాహ్‌) పవిత్రతను కొనియాడాలనీ!


  • 48:10

إِنَّ الَّذِينَ يُبَايِعُونَكَ إِنَّمَا يُبَايِعُونَ اللَّـهَ يَدُ اللَّـهِ فَوْقَ أَيْدِيهِمْ ۚ فَمَن نَّكَثَ فَإِنَّمَا يَنكُثُ عَلَىٰ نَفْسِهِ ۖ وَمَنْ أَوْفَىٰ بِمَا عَاهَدَ عَلَيْهُ اللَّـهَ فَسَيُؤْتِيهِ أَجْرًا عَظِيمًا ١٠

(ఓ ము'హమ్మద్‌!) నిశ్చయంగా (నీ చేతిలో చేయివేసి) నీతో శపథం చేసేవారు, వాస్తవానికి అల్లాహ్‌తో శపథం చేస్తున్నారు. 1 అల్లాహ్‌ చెయ్యి వారి చేతులమీద ఉంది. ఇక ఎవడు (తన శపథాన్ని) భంగంచేస్తాడో, వాస్తవానికి అతడు తన నష్టం కొరకే తన శపథాన్ని భంగం చేస్తాడు. మరియు ఎవడు తన వాగ్దానాన్ని పూర్తిచేస్తాడో, అల్లాహ్‌ అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు.


  • 48:11

سَيَقُولُ لَكَ الْمُخَلَّفُونَ مِنَ الْأَعْرَابِ شَغَلَتْنَا أَمْوَالُنَا وَأَهْلُونَا فَاسْتَغْفِرْ لَنَا ۚ يَقُولُونَ بِأَلْسِنَتِهِم مَّا لَيْسَ فِي قُلُوبِهِمْ ۚ قُلْ فَمَن يَمْلِكُ لَكُم مِّنَ اللَّـهِ شَيْئًا إِنْ أَرَادَ بِكُمْ ضَرًّا أَوْ أَرَادَ بِكُمْ نَفْعًا ۚ بَلْ كَانَ اللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرًا ١١

వెనుక ఉండిపోయిన ఎడారివాసులు (బద్దూలు) 2 నీతో ఇలా అంటారు: "మా ఆస్తిపాస్తుల మరియు మా ఆలు-బిడ్డల చింత మాకు తీరికలేకుండా చేశాయి. కావున మా క్షమాపణకై ప్రార్థించండి!" వారు తమ హృదయాలలో లేనిది తమ నాలుకలతో పలుకు తున్నారు. వారితో ఇలా అను: "ఒకవేళ అల్లాహ్‌ మీకు నష్టం చేయదలిస్తే, లేదా లాభం చేయదలిస్తే, ఆయన నుండి మిమ్మల్ని తప్పించగల శక్తి ఎవరికుంది? వాస్తవానికి మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును!


  • 48:12

بَلْ ظَنَنتُمْ أَن لَّن يَنقَلِبَ الرَّسُولُ وَالْمُؤْمِنُونَ إِلَىٰ أَهْلِيهِمْ أَبَدًا وَزُيِّنَ ذَٰلِكَ فِي قُلُوبِكُمْ وَظَنَنتُمْ ظَنَّ السَّوْءِ وَكُنتُمْ قَوْمًا بُورًا ١٢

"అలాకాదు! ప్రవక్త మరియు విశ్వాసులు ఎన్నటికీ – తమ ఆలు-బిడ్డల వద్దకు – తిరిగి రాలేరని మీరు భావించారు; మరియు ఇది (ఈ ఆలోచన) మీ హృదయాలకు చాలా నచ్చింది మరియు మీరు చాలా చెడ్డ తలంపులు చేశారు మరియు మీరు అధోగతికి చెందినవారు."


  • 48:13

وَمَن لَّمْ يُؤْمِن بِاللَّـهِ وَرَسُولِهِ فَإِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَعِيرًا ١٣

మరియు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించని సత్య-తిరస్కారుల కొరకు మేము నిశ్చయంగా, భగభగ మండే అగ్ని జ్వాలలను సిధ్ధపరచి ఉంచాము.


  • 48:14

وَلِلَّـهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَكَانَ اللَّـهُ غَفُورًا رَّحِيمًا ١٤

మరియు భూమ్యాకాశాలపై సామ్రాజ్యాధి పత్యం అల్లాహ్‌దే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్‌ సదా క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.


  • 48:15

سَيَقُولُ الْمُخَلَّفُونَ إِذَا انطَلَقْتُمْ إِلَىٰ مَغَانِمَ لِتَأْخُذُوهَا ذَرُونَا نَتَّبِعْكُمْ ۖ يُرِيدُونَ أَن يُبَدِّلُوا كَلَامَ اللَّـهِ ۚ قُل لَّن تَتَّبِعُونَا كَذَٰلِكُمْ قَالَ اللَّـهُ مِن قَبْلُ ۖ فَسَيَقُولُونَ بَلْ تَحْسُدُونَنَا ۚ بَلْ كَانُوا لَا يَفْقَهُونَ إِلَّا قَلِيلًا ١٥

ఇక మీరు విజయధనాన్ని తీసుకోవటానికి పోయినప్పుడు, వెనుక ఉండిపోయినవారు ఇలా అంటారు: "మమ్మల్ని కూడా మీ వెంట రానివ్వండి." 3 వారు అల్లాహ్‌ ఉత్తరువును మార్చగోరుతున్నారు. 4 వారితో అను: "మీరు మా వెంట రాజాలరు; మీ గురించి అల్లాహ్‌ ముందే ఈ విధంగా చెప్పాడు." అప్పుడు వారు ఇలా అంటారు: "అది కాదు! మీరు మా మీద అసూయపడుతున్నారు." అలాకాదు! వారు వాస్తవాన్ని అర్థంచేసుకోగలిగేది చాలా తక్కువ.


  • 48:16

قُل لِّلْمُخَلَّفِينَ مِنَ الْأَعْرَابِ سَتُدْعَوْنَ إِلَىٰ قَوْمٍ أُولِي بَأْسٍ شَدِيدٍ تُقَاتِلُونَهُمْ أَوْ يُسْلِمُونَ ۖ فَإِن تُطِيعُوا يُؤْتِكُمُ اللَّـهُ أَجْرًا حَسَنًا ۖ وَإِن تَتَوَلَّوْا كَمَا تَوَلَّيْتُم مِّن قَبْلُ يُعَذِّبْكُمْ عَذَابًا أَلِيمًا ١٦

వెనుక ఉండి పోయిన ఎడారి వాసులతో (బద్దూలతో) ఇలా అను: "ఇక మీద చాలా కఠినంగా పోరాడే వారికి విరుద్ధంగా (యుధ్ధం చేసేందుకు) మీరు పిలువబడతారు. అప్పుడు (మీరు చనిపోయే వరకూ) వారితో యుద్ధం చేయవలసి ఉంటుంది, లేదా వారు లొంగిపోయే వరకు. ఒక వేళ మీరు ఆజ్ఞాపాలనచేస్తే, అల్లాహ్‌ మీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ మీరు ఇంతకు ముందు మరలిపోయినట్లు, మరలిపోతే ఆయన మీకు అత్యంత బాధాకరమైన శిక్ష విధించగలడు."


  • 48:17

لَّيْسَ عَلَى الْأَعْمَىٰ حَرَجٌ وَلَا عَلَى الْأَعْرَجِ حَرَجٌ وَلَا عَلَى الْمَرِيضِ حَرَجٌ ۗ وَمَن يُطِعِ اللَّـهَ وَرَسُولَهُ يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَمَن يَتَوَلَّ يُعَذِّبْهُ عَذَابًا أَلِيمًا ١٧

కాని గ్రుడ్డివానిపై ఎలాంటి నిందలేదు మరియు కుంటివానిపై కూడా ఎలాంటి నిందలేదు మరియు అదేవిధంగా వ్యాధిగ్రస్తునిపై కూడా ఎలాంటి నిందలేదు. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపేవారిని, ఆయన క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. మరియు వెనుదిరిగిన వానికి ఆయన బాధాకరమైన శిక్ష విధిస్తాడు. (1/2)


  • 48:18

لَّقَدْ رَضِيَ اللَّـهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ فَأَنزَلَ السَّكِينَةَ عَلَيْهِمْ وَأَثَابَهُمْ فَتْحًا قَرِيبًا ١٨

* వాస్తవానికి విశ్వాసులు చెట్టుక్రింద నీతో చేసిన శపథం 5 చూసి అల్లాహ్‌ సంతోషించాడు; మరియు వారి హృదయాల స్థితి ఆయనకు తెలిసిందే. కావున ఆయన వారిమీద శాంతిని అవతరింపజేశాడు. మరియు బహుమానంగా వారికి సమీప విజయాన్ని ప్రసాదించాడు. 6


  • 48:19

وَمَغَانِمَ كَثِيرَةً يَأْخُذُونَهَا ۗ وَكَانَ اللَّـهُ عَزِيزًا حَكِيمًا ١٩

మరియు అందులో వారు చాలా విజయ ధనాన్ని కూడా పొందుతారు. మరియు అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.


  • 48:20

وَعَدَكُمُ اللَّـهُ مَغَانِمَ كَثِيرَةً تَأْخُذُونَهَا فَعَجَّلَ لَكُمْ هَـٰذِهِ وَكَفَّ أَيْدِيَ النَّاسِ عَنكُمْ وَلِتَكُونَ آيَةً لِّلْمُؤْمِنِينَ وَيَهْدِيَكُمْ صِرَاطًا مُّسْتَقِيمًا ٢٠

మరియు అల్లాహ్‌ మీకు ఇంకా చాలా విజయధనాల వాగ్దానం చేశాడు. మీరు వాటిని పొందుతారు. కావున మీకు వాటిని త్వరగా ప్రసాదిస్తాడు. మరియు ఆయన ప్రజల చేతులను మీ నుండి ఆపాడు. ఇది విశ్వాసులకు ఒక సూచనగా ఉండేందుకు మరియు ఆయన మీకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేసేందుకూను. 7


  • 48:21

وَأُخْرَىٰ لَمْ تَقْدِرُوا عَلَيْهَا قَدْ أَحَاطَ اللَّـهُ بِهَا ۚ وَكَانَ اللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرًا ٢١

ఇంకా ఇతర (విజయాలు) కూడా! వాటిని మీరింకా సాధించలేదు. వాస్తవానికి, అల్లాహ్‌ వాటిని ఆవరించి ఉన్నాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.


  • 48:22

وَلَوْ قَاتَلَكُمُ الَّذِينَ كَفَرُوا لَوَلَّوُا الْأَدْبَارَ ثُمَّ لَا يَجِدُونَ وَلِيًّا وَلَا نَصِيرًا ٢٢

మరియు ఒకవేళ సత్య-తిరస్కారులు మీతో యుధ్ధానికి దిగివుంటే, వారు తప్పక వెన్నుచూపి పారిపోయే వారు, అప్పుడు వారు ఏ రక్షకుడిని గానీ లేదా సహాయకుడిని గానీ పొందేవారు కాదు. 8


  • 48:23

سُنَّةَ اللَّـهِ الَّتِي قَدْ خَلَتْ مِن قَبْلُ ۖ وَلَن تَجِدَ لِسُنَّةِ اللَّـهِ تَبْدِيلًا ٢٣

ఇది మొదటి నుంచే వస్తూ ఉన్న అల్లాహ్‌ సంప్రదాయం. నీవు అల్లాహ్‌ సంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు.


  • 48:24

وَهُوَ الَّذِي كَفَّ أَيْدِيَهُمْ عَنكُمْ وَأَيْدِيَكُمْ عَنْهُم بِبَطْنِ مَكَّةَ مِن بَعْدِ أَنْ أَظْفَرَكُمْ عَلَيْهِمْ ۚ وَكَانَ اللَّـهُ بِمَا تَعْمَلُونَ بَصِيرًا ٢٤

మరియు మక్కహ్ లోయలో మీకు వారి మీద ప్రాబల్యం ఇచ్చిన తర్వాత, ఆయనే వారి చేతులను మీపై పడకుండా మరియు మీచేతులు వారిపై పడకుండా చేశాడు. 9 మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ చూస్తున్నాడు.


  • 48:25

هُمُ الَّذِينَ كَفَرُوا وَصَدُّوكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَالْهَدْيَ مَعْكُوفًا أَن يَبْلُغَ مَحِلَّهُ ۚ وَلَوْلَا رِجَالٌ مُّؤْمِنُونَ وَنِسَاءٌ مُّؤْمِنَاتٌ لَّمْ تَعْلَمُوهُمْ أَن تَطَئُوهُمْ فَتُصِيبَكُم مِّنْهُم مَّعَرَّةٌ بِغَيْرِ عِلْمٍ ۖ لِّيُدْخِلَ اللَّـهُ فِي رَحْمَتِهِ مَن يَشَاءُ ۚ لَوْ تَزَيَّلُوا لَعَذَّبْنَا الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابًا أَلِيمًا ٢٥

(వాస్తవానికి) సత్యాన్ని తిరస్కరించి, మిమ్మల్ని మస్జిద్‌ అల్‌-'హరామ్‌కు పోకుండా నిరోధించి, బలి (ఖుర్బానీ) జంతువులను వాటిని బలిచేసే స్థలానికి చేరనివ్వకుండా ఆపింది వారే కదా! 10 ఒకవేళ వారిలో విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు లేకుంటే – ఎవరిని గురించైతే మీకు తెలియదో – వారిని మీరు త్రొక్కివేసి ఉండేవారు. దాని వలన మీరు – మీకు తెలియకుండానే – పాపానికి గురిఅయ్యే వారు. అల్లాహ్‌ తాను కోరినవారిని తన కారుణ్యంలోనికి తీసుకుంటాడు. ఒకవేళ వారు (విశ్వాసులు) వారి నుండి వేరుగా ఉండి ఉంటే, మేము తప్పక వారిలోని సత్య-తిరస్కారులకు బాధాకరమైన శిక్ష విధించి ఉండేవారము.


  • 48:26

إِذْ جَعَلَ الَّذِينَ كَفَرُوا فِي قُلُوبِهِمُ الْحَمِيَّةَ حَمِيَّةَ الْجَاهِلِيَّةِ فَأَنزَلَ اللَّـهُ سَكِينَتَهُ عَلَىٰ رَسُولِهِ وَعَلَى الْمُؤْمِنِينَ وَأَلْزَمَهُمْ كَلِمَةَ التَّقْوَىٰ وَكَانُوا أَحَقَّ بِهَا وَأَهْلَهَا ۚ وَكَانَ اللَّـهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا ٢٦

సత్యాన్ని తిరస్కరించిన వారు, తమ హృదయాలలోని మూఢ అభిమానం వల్ల, మూర్ఖపు పట్టు వహించినప్పుడు, అల్లాహ్‌!తన సందేశహరుని మీద మరియు విశ్వాసుల మీద, శాంతిని అవతరింపజేశాడు. మరియు వారిలో దైవభీతిని స్థిరపరచాడు మరియు వారే దానికి హక్కుదారులు మరియు అర్హులు కూడాను. మరియు అల్లాహ్‌కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.


  • 48:27

لَّقَدْ صَدَقَ اللَّـهُ رَسُولَهُ الرُّؤْيَا بِالْحَقِّ ۖ لَتَدْخُلُنَّ الْمَسْجِدَ الْحَرَامَ إِن شَاءَ اللَّـهُ آمِنِينَ مُحَلِّقِينَ رُءُوسَكُمْ وَمُقَصِّرِينَ لَا تَخَافُونَ ۖ فَعَلِمَ مَا لَمْ تَعْلَمُوا فَجَعَلَ مِن دُونِ ذَٰلِكَ فَتْحًا قَرِيبًا ٢٧

వాస్తవానికి అల్లాహ్‌ తన ప్రవక్తకు, అతని స్వప్నాన్ని, నిజంచేసి చూపాడు. 12 అల్లాహ్‌ కోరితే, మీరు తప్పక శాంతియుతంగా, మీ తలలను పూర్తిగా గొరిగించుకొని లేదా తల వెంట్రుకలను కత్తిరించుకొని, మస్జిద్‌ అల్‌-'హరామ్‌ లోకి భయపడకుండా ప్రవేశించేవారు. మీకు తెలియనిది ఆయనకు తెలుసు, ఇక ఇదేకాక సమీపంలోనే మీకు మరొక విజయాన్ని కూడా ప్రసాదించ బోతున్నాడు. 13


  • 48:28

هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ ۚ وَكَفَىٰ بِاللَّـهِ شَهِيدًا ٢٨

ఆయనే, తన ప్రవక్తను మార్గదర్శకత్వంతో మరియు సత్యధర్మంతో అన్నిధర్మాలపై అది ఆధిక్యత కలిగివుండేలా చేసి పంపాడు. మరియు సాక్షిగా అల్లాహ్‌యే చాలు. 14


  • 48:29

مُّحَمَّدٌ رَّسُولُ اللَّـهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّـهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّـهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا ٢٩

ము'హమ్మద్‌ అల్లాహ్‌ యొక్క సందేశహరుడు. మరియు అతని వెంట ఉన్న వారు, సత్య-తిరస్కారుల పట్ల కఠినులు మరియు పరస్పరం కరుణామయులు. 15 నీవు వారిని (అల్లాహ్‌ ముందు) వంగుతూ (రుకూ'ఉ చేస్తూ), సాష్టాంగాలు (సజ్దా) చేస్తూ ఉండటం చూస్తున్నావు. వారు అల్లాహ్‌ అనుగ్రహాన్ని మరియు ప్రసన్నతను అర్థిస్తూ ఉంటారు. వారి ముఖాల మీద సాష్టాంగం (సజ్దా) చేయటం వల్ల వచ్చిన గుర్తులుంటాయి. వారి ఈ ఉపమానం తౌరాత్‌లో కూడా ఇవ్వబడింది. మరియు ఇంజీల్‌లో వారు ఒక పైరుతో పోల్చబడ్డారు: మొదట (బీజం నుండి) ఒక మొలక అంకురిస్తుంది 16 తరువాత ఆయన దానిని బలపరుస్తాడు, తరువాత దానిని లావుగా చేస్తాడు. ఆ తరువాత అది తన కాండం మీద నిటారుగా నిలబడి 17 రైతులను ఆనందపరిచి సత్య-తిరస్కారులకు క్రోధావేశాలు కలిగిస్తుంది. విశ్వసించి, సత్కార్యాలు చేసేవారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్‌ వాగ్దానం చేశాడు. (5/8)