47:1

ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ఇతరు లను) అల్లాహ్‌మార్గంనుండి నిరోధించారో, వారి కర్మలను ఆయన(అల్లాహ్‌)నిష్ఫలంచేశాడు.

47:2

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ – ముహమ్మద్‌ మీద అవతరింపజేయ బడిన దానిని – తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని నమ్మారో! వారి పాపాలను ఆయన తుడిచి వేశాడు మరియు వారి స్థితిని బాగుపరిచాడు.

47:3

ఇలా ఎందుకు జరిగిందంటే! వాస్తవానికి అవిశ్వాసులు అసత్యాన్ని అనుసరించారు మరియు విశ్వసించినవారు తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఈ విధంగా అల్లాహ్‌! ప్రజలకు ఉదాహరణల ద్వారా (వారి స్థానం) తెలియజేస్తున్నాడు.

47:4

కావున మీరు సత్యతిరస్కారులను (యుద్ధంలో) ఎదుర్కొన్నప్పుడు, వారిపై ప్రాబల్యం పొందేవరకు, వారి మెడలపై కొట్టండి. ఆ తరువాత వారిని గట్టిగా బంధించండి, (యుధ్ధం ముగిసిన) తరువాత వారిని కనికరించి వదలి పెట్టండి, లేదా పరిహారధనం తీసుకొని వదలి పెట్టండి. (మీతో) యుధ్ధం చేసేవారు తమ ఆయుధాలను పడవేసే వరకు (వారితో పోరాడండి). ఇది మీరు చేయవలసిన పని. అల్లాహ్‌ తలుచుకుంటే ఆయన వారికి ప్రతీకారం చేసేవాడు, కాని మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి (ఆయన ఇలా చేశాడు). మరియు ఎవరైతే అల్లాహ్‌ మార్గంలో చంపబడ్డారో, అలాంటి వారి కర్మలను ఆయన వ్యర్థం చేయడు.

47:5

ఆయన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు మరియు వారి స్థితిని చక్కబరుస్తాడు.

47:6

మరియు వారికి తెలియజేసియున్న, స్వర్గంలోకి వారిని ప్రవేశింపజేస్తాడు.

47:7

ఓ విశ్వాసులారా! ఒకవేళ మీరు అల్లాహ్‌కు (ఆయన మార్గంలో) సహాయపడితే, ఆయన మీకు సహాయం చేస్తాడు మరియు మీ పాదాలను స్థిరపరుస్తాడు.

47:8

ఇకపోతే సత్యాన్ని తిరస్కరించిన వారికి వినాశం తప్పదు. మరియు (అల్లాహ్‌) వారి కర్మలు వ్యర్థం చేస్తాడు.

47:9

ఇది ఎందుకంటే వాస్తవానికి, వారు అల్లాహ్‌ అవతరింపజేసిన దానిని అసహ్యించు కున్నారు, కాబట్టి ఆయన వారి కర్మలను విఫలంచేశాడు. (1/4)

47:10

ఏమీ? వారు భూమిలో సంచరించి చూడలేదా? వారికి పూర్వం గతించిన వారి పర్యవసానం ఏమయిందో? అల్లాహ్‌ వారిని నిర్మూలించాడు. మరియు సత్యతిరస్కారులకు అలాంటి గతే పట్టబోతోంది.

47:11

ఇది ఎందుకంటే! నిశ్చయంగా, విశ్వసించిన వారి సంరక్షకుడు అల్లాహ్‌! మరియు నిశ్చయంగా, సత్యతిరస్కారులకు సంరక్షకుడు ఎవ్వడూ లేడు.

47:12

నిశ్చయంగా, అల్లాహ్‌! విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు సత్యాన్ని తిరస్కరించి భోగభాగ్యాలలో మునిగి ఉండి పశువుల మాదిరిగా తింటున్నవారి నివాసం నరకాగ్నియే అవుతుంది.

47:13

మరియు (ఓ ము'హమ్మద్‌!) నిన్ను బహిష్కరించిన నగరంకంటే బలమైన ఎన్నో నగరాలను మేము నాశనం చేశాము వారికి సహాయపడే వాడెవ్వడూ లేకపోయాడు.

47:14

ఏమీ? తన ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన మార్గం మీద ఉన్నవాడు, తమ దుష్కార్యాలను మనోహరమైనవిగా భావించి, తమ మనోవాంఛలను అనుసరించే వారితో సమానుడు కాగలడా?

47:15

భయభక్తులు గల వారికి వాగ్దానం చేయబడిన స్వర్గం యొక్క ఉదాహరణ ఇలా వుంది: అందులో వాసన మరియు రంగు మారని నీటి సెలయేళ్ళు ఉంటాయి మరియు రుచిమారని పాల కాలువలు ఉంటాయి మరియు అందులో త్రాగేవారికి మధురంగా వుండే మద్యపానపు కాలువలు ఉంటాయి మరియు అందులో శుధ్ధమైన తేనె కాలువ లుంటాయి. మరియు వారి కొరకు అందులో అన్నిరకాల మంచి ఫలాలు మరియు వారి ప్రభువు నుండి క్షమాపణ కూడా వుంటాయి. ఇలాంటివాడు – నరకాగ్నిలో శాశ్వతంగాఉండి సలసలకాగే నీటిని త్రాగేందుకు ఇవ్వబడి, దానితో ప్రేగులు కోయబడినట్లు బాధపడేవానితో – సమానుడు కాగలడా?

47:16

మరియు (ఓ ము'హమ్మద్‌!) వారిలో (కపటవిశ్వాసులలో) నీ మాటలను చెవియొగ్గి వినేవారు కొందరున్నారు. కాని వారు నీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తరువాత, జ్ఞానవంతులను ఇలా ప్రశ్నిస్తారు: "అతను చెప్పినదేమిటీ?" వీరే! అల్లాహ్‌ హృదయాల మీద ముద్రవేసినవారు మరియు వీరే తమ మనోవాంఛలను అనుసరించే వారు.

47:17

మరియు మార్గదర్శకత్వం పొందిన వారికి ఆయన (అల్లాహ్‌) ఇంకా ఎక్కువగా సన్మార్గం చూపుతాడు మరియు వారి దైవభీతిని వృద్ధిచేస్తాడు.

47:18

ఏమీ? ఇప్పుడు వారు అంతిమ ఘడియ అకస్మాత్తుగా రావాలని ఎదురు చూస్తున్నారా? వాస్తవానికి, దానిచిహ్నాలు కూడా వచ్చేశాయి. అది వచ్చిపడితే, ఇక వారికి హితోపదేశం స్వీకరించే అవకాశం ఎక్కడ ఉంటుంది?

47:19

కావున (ఓ ము'హమ్మద్‌) తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్‌ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. కావున నీ పాపాలకు మరియు విశ్వాస స్త్రీలకొరకు మరియు విశ్వాస పురుషుల కొరకు కూడా క్షమాపణ వేడుకో! మరియు అల్లాహ్‌కు మీ కార్యకలాపాలు మరియు మీ (అంతిమ) నివాసం కూడా తెలుసు.

47:20

మరియు విశ్వసించిన వారు ఇలా అంటున్నారు: "(యుధ్ధం చేయమని ఆదేశిస్తూ) ఒక సూరహ్‌ ఎందుకు అవతరింపజేయబడ లేదు?" కాని ఇప్పుడు యుధ్ధం చేయమని నిర్దేశిస్తూ ఒక సూరహ్‌ అవతరింపజేయబడితే తమ హృదయాలలో వ్యాధి ఉన్నవారు, మరణం ఆవహించిన వారివలే నీ వైపునకు చూడటాన్ని, నీవు గమనిస్తావు. కాని అది వారికే మేలైనదై ఉండేది.

47:21

ఆజ్ఞాపాలన చేయటం మరియు మంచి మాటలు పలుకటం. ఒకవేళ (జిహాద్‌ కొరకు) దృఢమైన నిర్ణయం తీసుకోబడినప్పుడు, వారు అల్లాహ్‌ విషయంలో సత్యవంతులుగా ఉన్నట్లయితే వారికే మేలు జరిగేది.

47:22

(వారితో ఇలా అను): "ఏమీ? మీరు (అల్లాహ్‌) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభంరేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?"

47:23

ఇలాంటి వారినే అల్లాహ్‌ శపించాడు (బహిష్కరించాడు). వారిని చెవిటివారిగా చేశాడు మరియు వారి కండ్లను గ్రుడ్డి చేశాడు.

47:24

వారు ఈ ఖుర్‌ఆన్‌ను గురించి యోచించరా? లేదా వారి హృదయాల మీద తాళాలు పడివున్నాయా?

47:25

మార్గదర్శకత్వం స్పష్టమైన తర్వాత కూడా, ఎవరైతే తమ వీపులు త్రిప్పుకొని మరలి పోయారో! నిశ్చయంగా, షై'తాన్‌ (వారి చేష్టను) వారికి మంచివిగా చూపాడు మరియు (అల్లాహ్‌) వారికి వ్యవధినిచ్చాడు.

47:26

ఇది ఎందుకంటే, వాస్తవానికి వారు, అల్లాహ్‌ అవతరింపజేసిన దానిని అసహ్యించు కునే వారితో ఇలా అన్నందుకు: "మేము కొన్ని విషయాలలో మిమ్మల్ని అనుసరిస్తాము." మరియు అల్లాహ్‌కు వారి రహస్య సమాలో చనలను గురించి బాగా తెలుసు.

47:27

అయితే దేవదూతలు వారి ఆత్మలను వశపరచుకొని, వారి ముఖాల మీద మరియు వీపుల మీద కొడుతూ వారిని తీసుకు వెళ్ళేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది?

47:28

ఇది వాస్తవానికి, వారు అల్లాహ్‌కు ఆగ్రహం కలిగించే విధానాన్ని అనుసరించి నందుకు మరియు ఆయన సమ్మతించే మార్గాన్ని అసహ్యించుకున్నందుకు! కావున ఆయన వారి కర్మలను వృథా చేశాడు.

47:29

ఏమీ? తమ హృదయాలలో వ్యాధి ఉన్నవారు, అల్లాహ్‌ వారి ద్వేషాన్ని బయట పెట్టడని భావిస్తున్నారా?

47:30

మరియు మేము తలచుకుంటే, వారిని నీకు చూపేవారం; వారి లక్షణాలను బట్టి నీవు వారిని తెలుసుకోగలవు. మరియు వారు మాట్లాడే రీతిని బట్టి, వారిని నీవు తప్పక తెలుసుకోగలవు. మరియు అల్లాహ్‌కు మీ కర్మలు బాగా తెలుసు.

47:31

మరియు నిశ్చయంగా మీలో ధర్మ యుధ్ధం చేసేవారెవరో మరియు సహనం వహించేవారెవరో! చూచేవరకు మేము మిమ్మల్ని తప్పక పరీక్షిస్తాము. మరియు మేము మీ ప్రజ్ఞావచనాలను కూడా పరీక్షిస్తాము.

47:32

నిశ్చయంగా, మార్గదర్శకత్వం స్పష్టంగా తెలిసిన తర్వాతకూడా, సత్యాన్నితిరస్కరించి, ప్రజలను అల్లాహ్‌ మార్గం నుండి నిరోధిస్తూ, ప్రవక్తతో విరోధం కలిగివున్న వారు, అల్లాహ్‌కు ఏ మాత్రం నష్టం కలిగించలేరు. కాని ఆయన వారి కర్మలను నిష్ఫలం చేయగలడు. (3/8)

47:33

ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు అల్లాహ్‌కు విధేయులై ఉండండి మరియు ప్రవక్తను అనుసరించండి మరియు మీ కర్మలను వ్యర్థం చేసుకోకండి.

47:34

నిశ్చయంగా, సత్యాన్ని తిరస్కరిస్తూ ప్రజలను అల్లాహ్‌ మార్గం నుండి నిరోధిస్తూ వుండి, సత్యతిరస్కారులుగానే మరణించిన వారిని అల్లాహ్‌ ఎంత మాత్రం క్షమించడు.

47:35

కావున మీరు (ధర్మయుధ్ధంలో) ధైర్యాన్ని వీడకండి మరియు సంధికొరకు అడగకండి మరియు మీరేప్రాబల్యం వహిస్తారు. మరియు అల్లాహ్‌ మీకు తోడుగా ఉన్నాడు మరియు ఆయన మీకర్మలను వృథాకానివ్వడు.

47:36

నిశ్చయంగా, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట మరియు కాలక్షేపం మాత్రమే. ఒకవేళ మీరు విశ్వసించి దైవభీతి కలిగి ఉన్నట్లయితే, ఆయన మీకు మీ ప్రతిఫలం ఇస్తాడు. మరియు మీ నుండి ధనాన్ని కూడా అడగడు.

47:37

ఒకవేళ ఆయన దానిని (ధనాన్నే) అడిగితే మరియు దాని కొరకు గట్టిపట్టుపట్టితే, మీరు పిసినారితనం చూపితే, ఆయన మీ ద్వేషాన్ని బయటపెట్టేవాడు.

47:38

ఇదిగో చూడండి! వారు మీరే! అల్లాహ్‌ మార్గంలో ఖర్చుచేయండని పిలువబడు తున్నవారు. కాని మీలో కొందరు పిసినారితనం వహిస్తున్నారు. మరియు ఎవడు పిసినారితనం వహిస్తున్నాడో, అతడు నిజానికి తన సొంత విషయంలోనే పిసినారితనం వహిస్తున్నాడు. మరియు అల్లాహ్‌ స్వయం సమృద్ధుడు మరియు మీరే కొరతగల (పేద) వారు. మరియు మీరు విముఖులైతే ఆయన మీకు బదులుగా ఇతర జాతిని మీ స్థానంలో తేగలడు, అప్పుడు వారు మీలాంటివారై ఉండరు.


**********