55:1

అనంత కరుణామయుడు (అల్లాహ్‌)!

55:2

ఆయనే ఈ ఖుర్‌ఆన్‌ను నేర్పాడు.

55:3

ఆయనే మానవుణ్ణి సృష్టించాడు.

55:4

ఆయనే అతనికి మాట్లాడటం నేర్పాడు.

55:5

సూర్యుడు మరియు చంద్రుడు ఒక నియమిత గమనాన్ని (నియమిత పరిధిలో) అనుసరిస్తున్నారు.

55:6

మరియు నక్షత్రాలు మరియు వృక్షాలు అన్నీ ఆయనకు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటాయి.

55:7

మరియు ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు.

55:8

తద్వారా మీరు తూకంలో మోసానికి పాల్పడకూడదని!

55:9

మరియు న్యాయంగా తూకం చేయండి మరియు తూకంలో తగ్గించకండి.

55:10

మరియు ఆయన, భూమిని సకల జీవరాసులకొరకు ఉంచాడు.

55:11

అందులో రకరకాల ఫలాలు మరియు పొరలలో (పుష్పకోశాలలో) ఉండే ఖర్జూర పండ్లు ఉన్నాయి.

55:12

మరియు దంట్లపై (పొరలలో చుట్టబడి) ఉన్న ధాన్యం మరియు సుగంధ పుష్పాలు కూడా!

55:13

అయితే మీరిరువురు (మానవులు మరియు జిన్నాతులు) మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:14

ఆయన మానవుణ్ణి పెంకులాంటి శబ్ద మిచ్చే మట్టితో సృష్టించాడు.

55:15

మరియు జిన్నాతులను అగ్నిజ్వాలలతో సృష్టించాడు.

55:16

అయితే మీరివురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:17

ఆయనే రెండు తూర్పు(దిక్కు)లకు మరియు రెండు పడమర(దిక్కు)లకు ప్రభువు.

55:18

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:19

ఆయనే రెండు సముద్రాలను కలుసు కోవటానికి వదలిపెట్టాడు.

55:20

ఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డుతెర వుంది.

55:21

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:22

ఆ రెండింటి నుండి ముత్యాలు మరియు పగడాలు వస్తాయి.

55:23

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:24

మరియు ఎత్తైన కొండలవలే సముద్రంలో పయనించే ఓడలు ఆయనకు చెందినవే!

55:25

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:26

దానిపై (భూమిపై) నున్నది ప్రతిదీ నశిస్తుంది.

55:27

మరియు మిగిలివుండేది, కేవలం మహిమాన్వితుడు మరియు పరమదాత అయిన నీ ప్రభువు ముఖం (ఉనికి) మాత్రమే!

55:28

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:29

భూమిలో మరియు ఆకాశాలలోనున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి క్షణం (రోజు) ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు.

55:30

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:31

భారాలనుమోసే మీరిద్దరు! త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము.

55:32

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:33

ఓ జిన్నాతుల మరియు మానవ జాతి వారలారా! ఒకవేళ మీరు ఆకాశాల మరియు భూమి యొక్క సరిహద్దుల నుండి బయటికి వెళ్ళి పోగలిగితే, వెళ్ళిపొండి! ఆయన (అల్లాహ్‌) యొక్క సెలవులేనిదే మీరు వాటినుండి వెళ్లిపోలేరు.

55:34

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:35

మీ ఇద్దరిపైకి అగ్నిజ్వాలలు మరియు పొగ పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కో లేరు(మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు).

55:36

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:37

మరియు ఆకాశం ప్రేలిపోయినప్పుడు అది మండేనూనెగా ఎర్రగా మారిపోతుంది.

55:38

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:39

ఇక, ఆ రోజు ఏ మానవునితో గానీ, లేక ఏ జిన్నాతునితో గానీ అతని పాపాలను గురించి అడగడం జరుగదు.

55:40

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:41

ఈ నేరస్తులు వారివారి ముఖ చిహ్నాలతోనే గుర్తింపబడతారు. అప్పుడు వారు, వారి ముంగురులు మరియు కాళ్ళు పట్టి లాగబడతారు.

55:42

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:43

ఈ నేరస్తులు అసత్యమని తిరస్కరిస్తూ వుండిన నరకం ఇదే!

55:44

వారు దానిలో (ఆ నరకంలో) మరియు సలసల కాగే నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.

55:45

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:46

మరియు ఎవడైతే తన ప్రభువు సన్నిధిలో హాజరుకావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గవనా లుంటాయి.

55:47

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:48

అవి రెండూ అనేక శాఖల (వృక్షాల)తో నిండి ఉంటాయి.

55:49

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:50

ఆ రెండింటిలో రెండు సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.

55:51

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:52

ఆ రెండింటిలో ప్రతి ఫలం జోడుగా (రెండు రకాలుగా) ఉంటుంది.

55:53

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:54

వారు జరీపని అస్తరుగల పట్టు తివాచీల మీద ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు ఆ రెండు స్వర్గవనాల ఫలాలు దగ్గరగా అందు బాటులో ఉంటాయి.

55:55

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:56

అందులో తమ దృష్టి ఎల్లపుడూ క్రిందికి వంచి ఉంచే నిర్మల కన్యలుంటారు. వారిని ఇంతకు పూర్వం ఏ మానవుడు గానీ, ఏ జిన్నాతు గానీ తాకిఉండడు.

55:57

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:58

వారు కెంపులను (మాణిక్యాలను) మరియు పగడాలను పోలి ఉంటారు.

55:59

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:60

సత్కార్యానికి మంచి ప్రతిఫలం తప్ప మరేమైనా ఉంటుందా?

55:61

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:62

మరియు ఆ రెండేకాక ఇంకా రెండు స్వర్గవనాలుంటాయి.

55:63

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:64

అవి దట్టంగా ముదురుపచ్చగా ఉంటాయి.

55:65

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:66

ఆ రెండు తోటలలో పొంగిప్రవహించే రెండు చెలమలుంటాయి.

55:67

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:68

ఆ రెండింటిలో ఫలాలు, ఖర్జూరాలు మరియు దానిమ్మలు ఉంటాయి.

55:69

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:70

వాటిలో గుణవంతులు, సౌందర్య వతులైన స్త్రీలు ఉంటారు.

55:71

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:72

నిర్మలమైన, శీలవతులైన స్త్రీలు (హూర్‌) డేరాలలో ఉంటారు.

55:73

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:74

ఆ స్త్రీలను ఇంతకుముందు ఏ మానవుడు కాని, ఏ జిన్నాతు కాని తాకి ఉండడు.

55:75

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:76

వారు అందమైన తివాచీల మీద ఆకుపచ్చని దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.

55:77

అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

55:78

మహిమాన్వితుడు మరియు పరమ దాత అయిన నీ ప్రభువు పేరే సర్వ శ్రేష్ఠమైనది. (5/8)

**********