5:1

ఓ విశ్వాసులారా! ఒప్పందాలను పాటించండి. మీ కొరకు పచ్చిక మేసే చతుష్పాద పశువులన్నీ (తినటానికి) ధర్మ సమ్మతం ('హలాల్) చేయబడ్డాయి; మీకు తెలుపబడిన పశువులు తప్ప! మీరు ఇ'హ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడటం మీకు ధర్మసమ్మతం కాదు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరింది శాసిస్తాడు.

5:2

ఓ విశ్వాసులారా! అల్లాహ్ (నియ మించిన) చిహ్నాలను మరియు నిషిధ్ధ మాసాన్ని ఉల్లం ఘించకండి. మరియు బలి పశువులకు మరియు మెడలలో పట్టీ ఉన్న పశువులకు (హాని చేయకండి). మరియు తమ ప్రభువు అనుగ్రహాన్ని మరియు ప్రీతిని కోరుతూ పవిత్ర గృహానికి (క'అబహ్ కు) పోయే వారిని (ఆటంక పరచకండి). కానీ ఇ'హ్రామ్ స్థితి ముగిసిన తరువాత మీరు వేటాడవచ్చు. మిమ్మల్ని పవిత్ర మస్జిద్ (మస్జిద్ అల్-'హరామ్)ను సందర్శించ కుండా నిరోధించిన వారిపట్ల గల విరోధం వలన వారితో హద్దులు మీరి ప్రవర్తించకండి. మరియు పుణ్యకార్యాలు మరియు దైవభీతి విషయాలలో, ఒకరికొకరు తోడ్పడండి. మరియు పాపకార్యా లలో గానీ, దౌర్జన్యాలలో గానీ తోడ్పడకండి. అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగిఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించటంలో చాల కఠినుడు.

5:3

(సహజంగా) మరణించింది, రక్తం, పంది మాంసం మరియు అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేరుతో) వధింప బడినది (జి'బ్'హ్ చేయబడినది), గొంతు పిసికి ఊపిరాడక, దెబ్బతగిలి, ఎత్తునుండి పడి, కొమ్ముతగిలి మరియు క్రూరమృగం నోటపడి చచ్చిన (పశువు / పక్షి) అన్నీ, మీకు తినటానికి నిషిధ్ధం ('హరామ్) చేయ బడ్డాయి. కాని (క్రూరమృగం నోట పడిన దానిని) చావక ముందే మీరు జి'బ్'హ్ చేసినట్లైతే అది నిషిధ్ధం కాదు. మరియు బలిపీఠం మీద వధించబడినది, మరియు బాణాల ద్వారా శకునం చూడటం నిషేధింప బడ్డాయి. ఇవన్నీ ఘోర పాపాలు (ఫిస్ఖున్). ఈనాడు సత్యతిరస్కారులు, మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదలు కున్నారు. కనుక మీరు వారికి భయ పడకండి, నాకే భయపడండి. ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను మరియు మీ కొరకు అల్లాహ్కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. ఎవడైనా ఆకలికి ఓర్చుకోలేక, పాపానికి పూనుకోక, (నిషిధ్ధమైన వస్తువులను తిన్నట్లైతే)! నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

5:4

వారు (ప్రజలు) తమ కొరకు ఏది ధర్మ సమ్మతం ('హలాల్) అని నిన్ను అడుగు తున్నారు. నీవు ఇలా అను: ''పరిశుధ్ధ వస్తువులన్నీ మీ కొరకు ధర్మసమ్మతం ('హలాల్) చేయబడ్డాయి. మరియు మీకు అల్లాహ్ నేర్పిన విధంగా మీరు వేట శిక్షణ ఇచ్చిన జంతువులు మీ కొరకు పట్టినవి కూడా! కావున అవి మీ కొరకు పట్టుకున్న వాటిని మీరు తినండి కాని దానిపై అల్లాహ్ పేరును ఉచ్చరించండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగిఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ లెక్కతీసు కోవటంలో అతిశీఘ్రుడు.''

5:5

ఈ నాడు మీ కొరకు పరిశుధ్ధమైన వస్తువు లన్నీ ధర్మసమ్మతం ('హలాల్) చేయబడ్డాయి. మరియు గ్రంథప్రజల ఆహారం మీకు ధర్మ సమ్మతమైనది. మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మత మైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథప్రజల స్త్రీలు గానీ, మీరు వారికి వారి మహ్ర్ చెల్లించి, న్యాయ బద్ధంగా వారితో వివాహజీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగచాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి. ఎవడు విశ్వాసమార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు.

5:6

ఓ విశ్వాసులారా! మీరు నమా'జ్కు లేచినపుడు, మీ ముఖాలను, మరియు మీ చేతులను మోచేతుల వరకు కడుక్కోండి. మరియు మీ తలలను (తడి చేతులతో) తుడుచుకోండి. మరియు మీ కాళ్ళను చీలమండల వరకు కడుక్కోండి. మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబ్) అయి ఉంటే, స్నానం ('గుస్ల్) చేయండి. మరియు మీరు అస్వస్థులై ఉన్నా, లేక ప్రయాణంలో ఉన్నా, లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని ఉన్నా, లేక మీరు స్త్రీలతో కలిసి (సంభోగం చేసి) ఉన్నా, అప్పుడు మీకు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో తయమ్మమ్ చేయండి. అంటే, మీ ముఖాలను మరియు మీ చేతులను, దానితో (పరిశుభ్రమైన మట్టిపై స్పర్శించిన చేతులతో), రుద్దుకోండి. మిమ్మల్ని కష్ట పెట్టాలనేది అల్లాహ్ అభిమతం కాదు. మీరు కృతజ్ఞులు కావాలని ఆయన, మిమ్మల్ని శుద్ధపరచి మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయ గోరుతున్నాడు.

5:7

మరియు మీకు అల్లాహ్ చేసిన అను గ్రహాన్ని మరియు ఆయన మీ నుండి తీసు కున్న దృఢమైన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసు కోండి. అప్పుడు మీరు: ''మేము విన్నాము మరియు విధేయుల మయ్యాము.'' అని అన్నారు. మరియు అల్లాహ్ యందు భయ భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, హృద యాలలో ఉన్నదంతా అల్లాహ్కుబాగా తెలుసు.

5:8

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు న్యాయంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. ఇతరుల పట్ల మీకున్న ద్వేషానికిలోనై, మీరు న్యాయాన్ని త్యజించ కండి. న్యాయం చేయండి, అది దైవభక్తికి సమీపమైనది. మరియు అల్లాహ్ యందు భయ భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును.

5:9

మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నాయని అల్లాహ్ వాగ్దానం చేశాడు.

5:10

మరియు ఎవరైతే సత్యతిరస్కారానికి పాల్పడి, మా సూచనలను అబద్ధాలని తిరస్కరిస్తారో! అలాంటి వారు భగభగ మండే నరకాగ్ని వాసులవుతారు.

5:11

ఓ విశ్వాసులారా! ఒక జాతి వారు (మీకు హానిచేయ సంకల్పించి) తమ చేతులను మీ వైపునకు చాచినపుడు, అల్లాహ్ వారి చేతులను మీనుండి తొలగించి మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞప్తికితెచ్చుకోండి. అల్లాహ్యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు విశ్వాసులు అల్లాహ్పైననే నమ్మక ముంచుకుంటారు.(3/8)

5:12

* మరియు వాస్తవానికి అల్లాహ్ ఇస్రా'యీలు సంతతి వారి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. మరియు మేము వారిలో నుండి పన్నెండు మందిని (కనాన్కు) పోవటానికి నాయకులుగా నియమించాము. మరియు అల్లాహ్ వారితో ఇలా అన్నాడు: ''ఒకవేళ మీరు నమా'జ్ స్థిరంగా సలుపుతూ, విధిదానం ('జకాత్) చెల్లిస్తూ మరియు నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడుతూ, అల్లాహ్కు మంచి రుణాన్ని ఇస్తూవుంటే! నిశ్చయంగా, నేను మీకు తోడుగా ఉంటాను. మరియు నిశ్చయంగా, నేను మీ నుండి మీ పాపాలను తొలగిస్తాను మరియు నిశ్చయంగా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాను. కానీ, దీని తరువాత మీలో ఎవడు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తాడో! అతడు వాస్తవంగా, సరైన మార్గం నుండి తప్పిపోయిన వాడే!''

5:13

ఆ పిదప వారు తాము చేసిన ఒడంబడికను భంగం చేసినందుకు, మేము వారిని శపించాము (బహిష్కరించాము) మరియు వారి హృదయాలను కఠినం చేశాము. వారు పదాలను తారుమారుచేసి వాటి అర్థాన్ని, సందర్భాన్ని పూర్తిగా మార్చి వేసేవారు. వారికి ఇవ్వబడిన బోధనలలో అధికభాగాన్ని మరచిపోయారు. అనుదినం వారిలో ఏ కొందరో తప్ప, పలువురు చేసే ద్రోహాన్ని గురించి నీకు తెలుస్తూనే ఉంది. కనుక వారిని మన్నించు మరియు వారి చేష్టలను ఉపేక్షించు. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.

5:14

''మేము క్రైస్తవులము.'' అని అనే వారి నుంచి కూడా మేము దృఢమైన ప్రమాణం తీసు కున్నాము; కాని వారు తమకు ఇవ్వబడిన బోధనలలో అధిక భాగాన్ని మరచిపోయారు; కావున తీర్పుదినం వరకు వారి మధ్య విరో ధాన్నిమరియు ద్వేషాన్ని కల్గించాము. మరియు త్వరలోనే అల్లాహ్ వారు చేస్తూ వచ్చిన కర్మలను గురించి వారికి తెలియజేస్తాడు.

5:15

ఓ గ్రంథ ప్రజలారా! వాస్తవంగా మా ప్రవక్త (ము'హమ్మద్) మీ వద్దకు వచ్చి వున్నాడు; మీరు కప్పిపుచ్చుతూ ఉన్న గ్రంథం (బైబిల్) లోని ఎన్నో విషయాలను అతను మీకు బహిర్గతం చేస్తున్నాడు; మరియు ఎన్నో విషయాలను ఉపేక్షి స్తున్నాడు. వాస్తవంగా మీ కొరకు అల్లాహ్ తరఫు నుండి ఒక జ్యోతి మరియు ఒక స్పష్టమైన గ్రంథం (ఈ ఖుర్ఆన్) వచ్చివున్నది.

5:16

దాని ద్వారా అల్లాహ్! తన ప్రీతిని పొందగోరే వారికి శాంతిపథాలను చూపుతాడు మరియు తన ఆజ్ఞతో వారిని అంధకారం నుండి వెలుగులోకి తెచ్చి వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.

5:17

''నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన మసీ'హ్ (క్రీస్తు) యే అల్లాహ్!'' అని అనే వారు నిస్సందేహంగా! సత్యతిరస్కారులు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: ''అల్లాహ్ గనక మర్యమ్ కుమారుడైన మసీ'హ్ (క్రీస్తు) ను అతని తల్లి మరియు భూమిపై ఉన్న వారందరినీ, నాశనం చేయగోరితే, ఆయనను ఆపగల శక్తి ఎవరికి ఉంది? మరియు ఆకాశాలలోను, భూమిలోను మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద ఆధిపత్యం అల్లాహ్దే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయ గల సమర్థుడు.''

5:18

మరియు యూదులు మరియు క్రైస్తవులు ఇలా అంటారు: ''మేము అల్లాహ్ సంతానం మరియు ఆయనకు ప్రియమైన వారము.'' (వారితో)ఇలా అను: ''అయితే, ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? అలాకాదు, మీరు కూడ ఆయన పుట్టించిన మానవులలో ఒకరు మాత్రమే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు ఆకాశాలలో, భూమిలో మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద సామ్రాజ్యాధి పత్యం అల్లాహ్దే. మరియు ఆయన వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది.''

5:19

ఓ గ్రంథప్రజలారా! ప్రవక్తలు రావటం, ఆగిపోయిన కొంతకాలం తరువాత, మీకు అంతా స్పష్టంగా తెలుపటానికి, వాస్తవంగా మా సందేశహరుడు (ము'హమ్మద్) మీ వద్దకు వచ్చాడు. మీరు: ''మా వద్దకు శుభ వార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరి కలు చేసేవాడు ఎవ్వడూ రాలేదు.'' అని అన కూడదని. నిస్సందేహంగా ఇప్పుడు మీకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చ రికలు చేసేవాడు వచ్చివున్నాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.

5:20

మరియు మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): ''నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీకు చేసిన అను గ్రహాలను జ్ఞాపకంచేసుకోండి; ఆయన మీలో నుండి ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు మరియు మిమ్మల్ని సార్వభౌములుగా చేశాడు. మరియు (ఆ కాలంలో) ప్రపంచంలో ఎవ్వరికీ ప్రసాదించని వాటిని (అనుగ్రహాలను) మీకు ప్రసాదించాడు.

5:21

''నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీ కొరకు వ్రాసి ఉంచిన పవిత్రభూమి (ఫలస్తీన్) లో ప్రవేశించండి. వెనుకకు మరలిరాకండి, అలా చేస్తే నష్టపడి తిరిగి రాగలరు.''

5:22

(అప్పుడు) వారన్నారు: ''ఓ మూసా! నిశ్చయంగా, అందులో బలిష్ఠులైన ప్రజలు (అమాలేకీయులు) ఉన్నారు. మరియు వారు అక్కడి నుండి వెళ్ళిపోనంత వరకు, మేము అందులో ఏ మాత్రమూ ప్రవే శించము; ఒక వేళ వారు వెళ్ళిపోతే మేము తప్పక ప్రవేశిస్తాము.''

5:23

(అప్పుడు) భయపడేవారిలో నుండి అల్లాహ్ అనుగ్రహం పొందిన ఇద్దరు వ్యక్తులు అన్నారు: ''ద్వారం నుండి పోయి వారిపై దాడిచేయండి. మీరు లోనికి ప్రవేశించా రంటే నిశ్చయంగా, విజయం మీదే! మీరు వాస్తవానికి విశ్వసించినవారే అయితే! అల్లాహ్పైననే నమ్మకం ఉంచుకోండి.''

5:24

వారన్నారు: ''ఓ మూసా! వారు అందు ఉన్నంత వరకు మేము అందులో ఎన్నటికీ ప్రవేశించము. కావున నీవు మరియు నీ ప్రభువు పోయి పోరాడండి, మేము నిశ్చయంగా, ఇక్కడే కూర్చుని ఉంటాము.''

5:25

(దానికి మూసా) అన్నాడు: ''ఓ నా ప్రభూ! నాకు నాపై మరియు నా సోదరునిపై మాత్రమే అధికారం గలదు. కావున నీవు మా మధ్య మరియు ఈ అవిధేయుల మధ్య తీర్పుచేయి (మమ్మల్ని ఈ అవిధేయుల నుండి దూరం చేయి).''

5:26

(అల్లాహ్) అన్నాడు: ''ఇక నిశ్చయంగా ఆ భూమి వారి కొరకు నలభై సంవత్సరాల వరకు నిషేధింపబడింది. వారు దేశదిమ్మరులై ఈ భూమిలో తిరుగుతూ ఉంటారు. కావున అవిధేయులైన జనులను గురించి నీవు చింతించకు.'' (1/2)

5:27

మరియు వారికి ఆదమ్ యొక్క ఇద్దరు కుమారులు (హాబిల్ మరియు ఖాబిల్ల) యథార్థకథను వినిపించు. వారిద్దరు (అల్లాహ్కు) బలి (ఖుర్బాని) ఇచ్చి నప్పుడు ఒకని (హాబీల్) బలి స్వీకరించ బడింది మరియు రెండవ వాని (ఖాబీల్) బలి స్వీకరించ బడలేదు. (ఖాబీల్) అన్నాడు: ''నిశ్చయంగా నేను నిన్ను చంపు తాను.'' (దానికి హాబీల్) అన్నాడు: ''నిశ్చయంగా, అల్లాహ్ భయ భక్తులు గలవారి (బలినే) స్వీకరిస్తాడు.

5:28

ఒకవేళ నీవు నన్ను చంపటానికి నీ చేయి నా వైపుకు ఎత్తినా! నేను నిన్ను చంప టానికి నాచేయి నీ వైపుకు ఎత్తను. (ఎందు కంటే) నిశ్చయంగా, నేను సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్కు భయపడుతున్నాను.

5:29

నీవు నీ పాపంతో సహా, నా పాపాన్ని కూడా భరించి నరకవాసులలో ఒకడవు కావాలని నా కోరిక. మరియు ఇదే దుర్మార్గుల ప్రతిఫలం.''

5:30

చివరికి అతడి మనస్సు అతడిని (తన సోదరుని) హత్యకు పురికొల్పింది, కావున అతడు తన సోదరుణ్ణి (హాబిల్ను) చంపి నష్టం పొందిన వారిలో చేరిపోయాడు.

5:31

అప్పుడు అల్లాహ్ ఒక కాకిని పంపాడు; అది నేలను త్రవ్వి అతని సోదరుని శవాన్ని ఎలా దాచాలో చూపించింది. అతడు (ఖాబిల్): ''అయ్యో, నా పాడుగాను! నేను ఈ కాకి పాటి వాణ్ణి కూడా కాలేకపోయాను! నా సోదరుని శవాన్ని దాచే (ఉపాయం) వెతకలేక పోయాను కదా!'' అని వాపోయాడు. అప్పుడతడు పశ్చాత్తాపపడే వారిలో చేరి పోయాడు.

5:32

ఈ కారణం వల్లనే మేము ఇస్రా'యీల్ సంతతి వారికి ఈ ఉత్తరువు ఇచ్చాము: ''నిశ్చయంగా – ఒక వ్యక్తి (హత్యకు) బదులుగా గానీ లేదా భూమిలో కల్లోలం వ్యాపింపజేసి నందుకు గానీ, గాక – ఎవడైనా ఒక వ్యక్తిని (అన్యాయంగా) చంపితే, అతడు సర్వ మానవజాతిని చంపినట్లే. మరియు ఎవడైనా ఒక మానవుని ప్రాణాన్ని కాపాడితే, అతడు సర్వ మానవజాతి ప్రాణాలను కాపాడి నట్లే!'' మరియు వాస్తవానికి, వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మా ప్రవక్తలు వచ్చారు, అయినా వాస్తవానికి వారిలో పలువురు భూమిలో అక్రమాలు చేసేవారు.

5:33

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్తో మరియు ఆయన ప్రవక్తతో పోరాడుతారో మరియు ధరణిలో కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారికి మరణ శిక్ష విధించాలి; లేదా శిలువపై ఎక్కించాలి; లేదా వారి అభిముఖ పక్షాల కాళ్ళు-చేతులను నరికించాలి; లేదా వారిని దేశ బహిష్క్రుతుల్ని చేయాలి. ఇది వారికి ఇహలోకంలో గల అవమానం. మరియు వారికి పరలోకంలో కూడా ఘోరశిక్ష ఉంటుంది –

5:34

మీరు స్వాధీనపరచుకోక ముందు పశ్చాత్తాపపడేవారు తప్ప! కావున మీరు నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత, అని తెలుసుకోండి.

5:35

ఓ విశ్వాసులారా! అల్లాహ్యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి. మరియు ఆయన మార్గంలో నిరంతరం కృషిచేస్తే మీరు సాఫల్యం పొందవచ్చు!

5:36

నిశ్చయంగా, సత్యతిరస్కారులైన వారు తీర్పుదినాన గల శిక్ష నుండి తప్పించు కోవటానికి – వారివద్ద ఉంటే – భూమిలో ఉన్న సమస్తాన్ని దానితో పాటు మరి అంత (ధనాన్ని) కూడా, విమోచనా ధనంగా ఇవ్వగోరుతారు కాని అది స్వీకరించబడదు. మరియు వారికి అతి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

5:37

వారు నరకాగ్నినుండి బయటికి రాగోరుతారు, కాని వారు దానినుండి బయటికి రాజాలరు. మరియు వారికి ఎడతెగని శిక్ష ఉంటుంది.

5:38

మరియు పురుషుడు దొంగ అయినా, లేదా స్త్రీ దొంగ అయినా, వారి చేతులను నరికి వేయండి. ఇది వారి కర్మలకు గుణ పాఠంగా, అల్లాహ్ నిర్ణయించిన ప్రతిఫలం (శిక్ష). మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.

5:39

ఎవడు నేరం చేసిన తరువాత పశ్చాత్తాపపడి తనను తాను సవరించు కుంటాడో! నిశ్చయంగా, అల్లాహ్ అలాంటి వాని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

5:40

ఏమీ? నిశ్చయంగా, భూమ్యాకాశాలపై ఆధిపత్యం అల్లాహ్దేనని నీకు తెలియదా? ఆయన తాను కోరిన వారిని శిక్షిస్తాడు మరియు తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. (5/8)

5:41

ఓ ప్రవక్తా! సత్యతిరస్కారంలోకి పరుగులు తీసేవారివల్ల నీవు దుఃఖపడకు. అలాంటి వారు: ''మేము విశ్వసించాము.'' అని తమ నోటితో మాత్రమే అంటారు, కాని వారి హృదయాలు విశ్వసించలేదు. మరియు యూదులలో కొందరు అసత్యాలను కుతూ హలంతో వినే వారున్నారు మరియు నీ వద్దకు ఎన్నడూ రాని ఇతర ప్రజలకు (అంద జేయ టానికి) మీ మాటలు వినే వారున్నారు. వారు పదాల అర్థాలను మార్చి, వాటి సందర్భాలకు భిన్నంగా తీసుకుని ఇలా అంటారు: ''మీకు ఈ విధమైన (సందేశం) ఇస్తేనే స్వీకరించండి మరియు ఇలాంటిది ఇవ్వక పోతే, జాగ్రత్త పడండి!'' మరియు అల్లాహ్ ఎవరిని పరీక్షించ దలచాడో (తప్పు దారిలో వదల దలచాడో) వారిని అల్లాహ్నుండి తప్పించటానికి నీవు ఏమీ చేయలేవు. ఎవరి హృదయాలను అల్లాహ్ పరి శుధ్ధ పరచగోరలేదో అలాంటి వారు వీరే. వారికి ఇహ లోకంలో అవమానం ఉంటుంది. మరియు వారికి పరలోకంలో ఘోరశిక్ష ఉంటుంది.

5:42

వారు అబద్ధాన్ని వినేవారు మరియు నిషిధ్ధమైన దానిని తినేవారు. కావున వారు నీ వద్దకు (న్యాయానికి) వస్తే, నీవు (ఇష్టపడితే) వారి మధ్య తీర్పుచేయి, లేదా ముఖం త్రిప్పుకో. నీవు వారి నుండి విముఖుడవైతే వారు నీకేమీ హాని చేయ లేరు. నీవు వారిమధ్య తీర్పుచేస్తే, న్యాయంగా మాత్రమే తీర్పుచేయి. నిశ్చయంగా, అల్లాహ్ న్యాయబద్ధులైన వారిని ప్రేమిస్తాడు.

5:43

మరియు – అల్లాహ్ ఉత్తరువులు ఉన్న తౌరాత్ గ్రంథం వారివద్ద ఉన్నప్పటికీ – వారు తీర్పుకొరకు, నీ వద్దకు ఎందుకు వస్తున్నారు? ఆ తరువాత కూడా వారు దాని నుండి తిరిగిపోతున్నారు. మరియు ఇలాంటి వారు (నిజానికి) విశ్వసించిన వారు కారు.

5:44

నిశ్చయంగా, మేము తౌరాత్ను (మూసాపై) అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి. అల్లాహ్కు విధేయులైన (ముస్లింలైన) ప్రవక్తలు దానిని అనుసరించి, యూదుల మధ్య తీర్పుచేస్తూ ఉండేవారు. అదే విధంగా ధర్మ వేత్తలు (రబ్బానియ్యూన్) మరియు యూద మతాచారులు (అ'హ్బార్లు) కూడా (తీర్పు చేస్తూ ఉండేవారు). ఎందుకంటే వారు అల్లాహ్ గ్రంథానికి రక్షకులుగా మరియు దానికి సాక్షులుగా నియమింపబడి ఉండేవారు. కావున మీరు (యూదులారా) మానవులకు భయపడ కండి. నాకే భయపడండి. నా సూక్తులను (ఆయాత్లను) స్వల్ప లాభాలకు అమ్ముకో కండి. మరియు ఎవరు అల్లాహ్ అవతరింప జేసిన (శాసనం) ప్రకారం తీర్పు చేయరో, అలాంటి వారే సత్య తిరస్కారులు.

5:45

మరియు ఆ గ్రంథం (తౌరాత్)లో వారికి మేము: ''ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పన్నుకు బదులు పన్ను మరియు గాయాలకు బదులుగా సరిసమాన మైన ప్రతీకారం వ్రాశాము.'' కాని ఎవరైనా దానిని క్షమిస్తే, అది అతనికి పాపపరిహారం (కఫ్ఫారా)! మరియు ఎవరు అల్లాహ్ అవతరింప జేసిన శాసనం ప్రకారం తీర్పు చేయరో అలాంటి వారు! వారే దుర్మార్గులు.

5:46

మరియు మేము వారి (ఆ ప్రవక్తల) అడుగుజాడలను (ఆసా'రిహిమ్) అనుస రించే వాడు మరియు తౌరాత్లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరచే వాడయిన, మర్యమ్ కుమారుడు 'ఈసా (ఏసు)ను పంపాము. మేము అతనికి ఇంజీల్ గ్రంథాన్ని ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి మరియు అది తౌరాత్లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీక రిస్తుంది మరియు దైవభీతి గలవారికి మార్గ దర్శకత్వం మరియు హితోపదేశం కూడా!

5:47

మరియు ఇంజీల్ గ్రంథప్రజలను, అల్లాహ్! ఆ గ్రంథంలో అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పుచేయమను. మరియు ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పుచేయరో అలాంటివారు, వారే అవిధేయులు (దుష్టులు).

5:48

మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీ పై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వగ్రంథాలలో మిగిలిఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిష్కరిస్తుంది. కావున నీవు, అల్లాహ్ అవతరింపజేసిన ఈ శాసనం ప్రకారం వారిమధ్య తీర్పుచెయ్యి. మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని విడిచి వారి కోరికలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్క సంఘానికి ఒక ధర్మశాసనాన్ని మరియు ఒక జీవనమార్గాన్ని నియమించి ఉన్నాము. ఒకవేళ అల్లాహ్ తలుచుకుంటే, మిమ్మల్ని అంతా ఒకే ఒక సంఘంగా రూపొందించి ఉండేవాడు. కాని మీకు ఇచ్చిన దానితో (ధర్మంతో) మిమ్మల్ని పరీక్షించ టానికి (ఇలా చేశాడు). కావున మీరు మంచిపనులు చేయటంలో ఒకరితోనొకరు పోటీపడండి. అల్లాహ్వద్దకే మీరందరూ మరలిపోవలసి వుంది. అప్పుడు ఆయన మీకున్న భేదాభి ప్రాయాలను గురించి మీకు తెలియజేస్తాడు.

5:49

మరియు (ఓ ప్రవక్తా!) నీవు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం వారి మధ్య తీర్పుచెయ్యి మరియు వారి వ్యర్థ కోరికలను అనుసరించకు. అల్లాహ్ నీపై అవతరింప జేసిన కొన్ని శాసనాల నుండి వారు నిన్ను తప్పించకుండా జాగ్రత్తగా ఉండు. ఒకవేళ వారు వెనుదిరిగి పోతే, అల్లాహ్ వారిని, వారి కొన్ని పాపాలకు శిక్షించదలచాడని తెలుసుకో. మరియు నిశ్చయంగా, ప్రజలలో అనేకులు అవిధేయతకు పాల్పడే వారున్నారు.

5:50

ఏమీ? వారు అజ్ఞానకాలపు తీర్పును కోరుతున్నారా? కాని ఆయన (అల్లాహ్)పై నమ్మకం గలవారికి అల్లాహ్కంటే మంచి తీర్పు చేయగలవాడెవడు? (3/4)

5:51

ఓ విశ్వాసులారా! యూదులను మరియు క్రైస్తవులను మిత్రులుగా చేసుకో కండి. వారు ఒకరి కొకరు స్నేహితులు. మీలో ఎవడు వారితో స్నేహం చేస్తాడో వాస్తవానికి అతడు వారిలో చేరిన వాడవుతాడు. నిశ్చయంగా, అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు.

5:52

కావున ఎవరి హృదయాలలో రోగం (కాపట్యం) ఉందో వారు, వారి సాంగత్యం కొరకు పోటీపడుతున్నది నీవు చూస్తున్నావు. వారు: ''మాపై ఏదైనా ఆపద రాగలదని మేము భయపడుతున్నాము.'' అని అంటారు. బహుశా అల్లాహ్ (విశ్వాసులకు) విజయాన్ని గానీ, లేదా తనదిక్కు నుండి ఏదైనా అవకాశాన్ని గానీ కలిగించవచ్చు! అప్పుడు వారు తమ మనస్సులలో దాచి ఉంచిన దానికి పశ్చాత్తాపపడతారు.

5:53

మరియు విశ్వాసులు (పరస్పరం ఇలా అనుకుంటారు): ''ఏమీ? వాస్తవానికి మేము మీతోనే ఉన్నామని, అల్లాహ్ పేరుతో కఠోర ప్రమాణాలుచేసి, నమ్మకం కలిగించే వారు వీరేనా?'' వారి (కపటవిశ్వాసుల) కర్మలన్నీ వ్యర్థమై, వారు నష్టపడిన వారవుతారు!

5:54

ఓ విశ్వాసులారా! మీలో ఎవడైనా తన ధర్మం (ఇస్లాం) నుండి వైదొలగితే, అల్లాహ్ త్వరలోనే ఇతర ప్రజలను తేగలడు. ఆయన వారిని ప్రేమిస్తాడు మరియు వారు ఆయన (అల్లాహ్) ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగా, సత్య తిరస్కారుల పట్ల కఠినంగా ప్రవర్తించే వారునూ, అల్లాహ్మార్గంలో ధర్మ పోరాటం చేసే వారునూ మరియు నిందించే వారి నిందలకు భయ పడని వారునూ, అయి ఉంటారు. ఇది అల్లాహ్ అనుగ్రహం, ఆయన దానిని తాను కోరినవారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సర్వోపగతుడు (సర్వవ్యాప్తి), సర్వజ్ఞుడు.

5:55

నిశ్చయంగా, మీ స్నేహితులు, అల్లాహ్! ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారు: ఎవరైతే నమా'జ్ స్థాపిస్తారో, విధిదానం ('జకాత్) ఇస్తూ ఉంటారో మరియు వారు (అల్లాహ్ ముందు) వంగుతూ (రుకూ'ఉ చేస్తూ) ఉంటారో;

5:56

మరియు ఎవరు అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారి వైపునకు మరలు తారో! నిశ్చయంగా, వారే అల్లాహ్ పక్షానికి చెందిన వారు, వారే విజయం సాధించేవారు.

5:57

ఓ విశ్వాసులారా! మీ ధర్మాన్ని ఎగతాళిగా నవ్వులాటగా పరిగణించేవారు పూర్వగ్రంథ ప్రజలైనా, లేదా సత్య తిరస్కారు లైనా, వారిని మీ స్నేహితులుగా చేసుకో కండి. మరియు మీరు విశ్వాసులే అయితే అల్లాహ్యందు భయభక్తులు కలిగి ఉండండి.

5:58

మరియు మీరు నమా'జ్ కొరకు పిలుపు (అజా'న్) ఇస్తే, వారు దానిని ఎగతాళిగా నవ్వులాటగా తీసుకుంటారు. అది ఎందుకంటే వాస్తవానికి వారు బుధ్ధిహీను లైన జనులు!

5:59

వారితో ఇలా అను: ''ఓ గ్రంథ ప్రజలారా! ఏమీ? మేము అల్లాహ్ను మరియు ఆయన మాపై అవతరింపజేసిన మరియు మాకు పూర్వం అవతరింపజేసిన (గ్రంథాలను) విశ్వ సించామనే, మీరు మమ్మల్ని పీడిస్తున్నారా? మరియు నిశ్చయంగా, మీలో చాలా మంది అవిధేయులు (దుష్టులు) ఉన్నారు!''

5:60

ఇలా అను: ''ఏమీ? అల్లాహ్ తరఫు నుండి ఎవరికి, దీనికంటే, హీనకరమైన ప్రతిఫలం దొరుకుతుందో మీకు తెలుపనా? వారే, ఎవరినైతే అల్లాహ్ శపించాడో (బహిష్క రించాడో) మరియు ఎవరైతే ఆయన ఆగ్ర హానికి గురి అయ్యారో! మరియు వారిలో కొందరు, ఎవరినైతే ఆయన కోతులుగా మరియు పందులుగా మార్చాడో! మరియు వారు ఎవరైతే కల్పితదైవాల (తాగూత్ల) దాస్యం చేస్తారో. అలాంటి వారు (పునరుత్థాన దినమున) ఎంతో హీనస్థితిలో ఉంటారు మరియు వారు ఋజుమార్గం నుండి చాలా దూరం వెళ్లిపోయిన వారే!''

5:61

మరియు వారు (కపటవిశ్వాసులు) నీ వద్దకు వచ్చినపుడు: ''మేము విశ్వ సించాము.'' అని అంటారు. కాని వాస్తవానికి వారు సత్యతిరస్కారంతోనే వస్తారు మరియు దాని (సత్యతిరస్కారం) తోనే తిరిగి పోతారు కూడాను. మరియు వారు ఏమి దాస్తున్నారో అల్లాహ్కు బాగా తెలుసు.

5:62

మరియు వారిలో అనేకులను పాపం మరియు దౌర్జన్యం చేయటానికి మరియు నిషిధ్ధమైనవి తినటానికి చురుకుగా పాల్గొనటాన్ని నీవు చూస్తావు. వారు చేస్తున్న పనులు ఎంత నీచమైనవి!

5:63

వారి ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్) మరియు మతాచారులు (అ'హబార్) వారిని, పాపపు మాటలు పలకటం నుండి మరియు నిషిధ్ధమైన వాటిని తినటం నుండి ఎందుకు వారించరు? వారు చేసే కార్యాలు ఎంత నీచమైనవి!

5:64

మరియు యూదులు: ''అల్లాహ్ చేతులకు సంకెళ్ళు పడిఉన్నాయి.'' అని అంటారు. వారి చేతులకే సంకెళ్ళు వేయ బడు గాక! మరియు వారు పలికిన దానికి వారు శపించబడుగాక! వాస్తవానికి ఆయన (అల్లాహ్) రెండుచేతులు విస్తరింపబడి ఉన్నాయి; ఆయన (తన అనుగ్రహాలను) తాను కోరినట్లు ఖర్చుచేస్తాడు. మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు తరఫు నుండి నీపై అవత రింపజేయబడినది (ఈ గ్రంథం) నిశ్చయంగా, వారిలో చాలా మందికి తలబిరుసుతనం మరియు సత్యతిర స్కారాన్ని మాత్రమే పెంచుతున్నది. మరియు మేము వారిమధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని, తీర్పుదినం వరకు ఉండేటట్లు చేశాము. వారు యుద్ధ జ్వాల లను ప్రజ్వలింప జేసినపుడల్లా, అల్లాహ్ దానిని చల్లార్చాడు. మరియు వారు భూమిలో కల్లోలం రేకెత్తించటానికి పాటు పడుతున్నారు. మరియు అల్లాహ్ కల్లోలం రేకెత్తించేవారిని ప్రేమించడు.

5:65

మరియు వాస్తవానికి గ్రంథప్రజలు విశ్వసించి, దైవభీతి కలిగివుంటే! నిశ్చయంగా, మేము వారి పాపాలను తొలగించి, వారిని శ్రేష్ఠమైన స్వర్గవనాలలో ప్రవేశింపజేసి ఉండేవారము.

5:66

మరియు వాస్తవానికి వారు తౌరాత్ను, ఇంజీల్ను మరియు వారి ప్రభువు తరఫునుండి వారిపై (ఇప్పుడు) అవతరింప జేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ను) ఆచరించి ఉండినట్లైతే, వారి కొరకు వారిపై (ఆకాశం) నుండి మరియు కాళ్ళ క్రింది నుండి (భూమినుండి) జీవనోపాధి పొందేవారు. వారిలో కొందరు సరైన మార్గాన్ని అవలంబించే వారున్నారు. కాని వారిలో అనేకులు చేసేవి చెడు (పాప) కార్యాలే! (7/8)

5:67

ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని తెలియజేయి. మరియు నీవట్లు చేయక పోతే, ఆయన సందేశాన్ని పూర్తిగా తెలియ జేయని వాడవవుతావు. మరియు అల్లాహ్ మానవుల నుండి నిన్ను కాపాడుతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులైన ప్రజలకు మార్గదర్శకత్వం చేయడు.

5:68

ఇలా అను: ''ఓ గ్రంథప్రజలారా! మీరు తౌరాత్ను, ఇంజీల్ను మరియు మీ ప్రభువు తరఫు నుండి మీపై అవతరింపజేయ బడిన దానిని (ఈ ఖుర్ఆన్ను) ఆచరించనంత వరకు, మీరు అసలు దేని (ఏ సత్యమార్గం) మీద కూడా ఉండనట్లే!'' మరియు నీ ప్రభువు తరఫునుండి నీపై అవతరింపజేయ బడిన (ఈ గ్రంథం) వాస్తవానికి వారిలోని అనేకుల తల బిరుసుతనాన్ని మరియు సత్యతిర స్కారాన్ని మాత్రమే పెంచుతుంది. కావున నీవు సత్యతిరస్కార ప్రజలను గురించి విచారించకు.

5:69

నిశ్చయంగా, ఈ(గ్రంథాన్ని)విశ్వ సించిన వారు (ముస్లింలు) మరియు యూదులు మరియు 'సాబియూ'లు మరియు క్రైస్తవులు, ఎవరైనా సరే అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించి, సత్కార్యాలు చేస్తే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా.

5:70

వాస్తవానికి మేము ఇస్రాయీ'ల్ సంతతి వారినుండి ఒక గట్టి ప్రమాణాన్ని తీసు కున్నాము మరియు వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కాని ఏ ప్రవక్త అయినా వారి మనోవాంఛలకు వ్యతిరేకమైన దానిని తెచ్చి నపుడల్లా, వారు కొందరిని అసత్య వాదులని తిరస్కరించారు, మరి కొందరిని హత్యచేశారు.

5:71

మరియు తమకెలాంటి శిక్ష (ఫిత్నా) పడదని తలచి, వారు గ్రుడ్డివారుగా, చెవిటి వారుగా అయిపోయారు. ఆ పిదప అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. ఆ తరు వాత కూడ వారిలో అనేకులు తిరిగి గ్రుడ్డి వారుగా, చెవిటివారుగా అయిపోయారు. మరియు వారు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు.

5:72

''నిశ్చయంగా, మర్యమ్ కుమారుడు మసీ'హ్ (క్రీస్తు) యే అల్లాహ్!'' అని పలికే వారు వాస్తవంగా సత్యతిరస్కారులు! మరియు మసీ'హ్ (క్రీస్తు) ఇలా అన్నాడు: ''ఓ ఇస్రా'యీల్ సంతతివారలారా! నా ప్రభువు మరియు మీ ప్రభువైన అల్లాహ్నే ఆరాధిం చండి.'' వాస్తవానికి, ఇతరులను అల్లాహ్కు భాగస్వాములుగా చేసే వారికి, నిశ్చయంగా, అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే! మరియు దుర్మా ర్గులకు సహాయంచేసేవారు ఎవ్వరూ ఉండరు.

5:73

''నిశ్చయంగా, అల్లాహ్ ముగ్గురిలో మూడవవాడు!'' అని అనేవారు వాస్తవానికి సత్య-తిరస్కారులే. మరియు ఒకేఒక్క ఆరాధ్యదేవుడు (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. మరియు వారు తమ ఈ మాటలను మానుకోకపోతే, వారిలో సత్య తిరస్కారులైన వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది.

5:74

వారెందుకు అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలి ఆయనను క్షమాభిక్ష కొరకు వేడుకోరు? మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

5:75

మర్యమ్ కుమారుడు మసీ'హ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి ('సిద్దీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు. చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! ఏవిధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యంనుండి మరలింపబడుతున్నారో)!

5:76

ఇలా అను: ''ఏమీ? మీరు అల్లాహ్ను వదిలి, మీకు నష్టంగానీ, లాభం గానీ చేసే అధికారంలేని దానిని ఆరాధిస్తారా? మరియు కేవలం అల్లాహ్ మాత్రమే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.''

5:77

(ఇంకా) ఇలా అను: ''ఓ గ్రంథ ప్రజలారా! మీ ధర్మం విషయంలో మీరు అధర్మంగా హద్దులుమీరి ప్రవర్తించకండి. మరియు ఇంతకు పూర్వం మార్గభ్రష్టులైన వారి కోరికలను అనుసరించకండి. వారు అనేక ఇతరులను కూడా మార్గభ్రష్టులుగా చేశారు మరియు వారు కూడ ఋజుమార్గం నుండి తప్పిపోయారు.''

5:78

ఇస్రాయీ'ల్ సంతతి వారిలో అవిశ్వాస మార్గం అవలంబించినవారు, దావూద్ మరియు మర్యమ్ కుమారుడు 'ఈసా (ఏసు) నాలుకతో (నోటితో) శపించబడ్డారు. ఇది వారు అవిధేయులై హద్దులు మీరి ప్రవర్తించిన దాని ఫలితం.

5:79

వారు, తాము చేసే, అసభ్యకరమైన కార్యాల నుండి ఒకరినొకరు నిరోధించు కోలేదు. వారు చేసే పనులన్నీ ఎంతో నీచమైనవి.

5:80

వారిలో అనేకులు సత్యతిరస్కారులతో మైత్రి చేసుకోవటాన్ని, నీవు చూస్తున్నావు. వారు తమకొరకు ముందుగా చేసి పంపుకున్న నీచకర్మల వలన అల్లాహ్కు వారిపై కోపం కలిగింది మరియు వారు నరకబాధలో శాశ్వతంగా ఉంటారు.

5:81

ఒకవేళ వారు అల్లాహ్నూ, ప్రవక్తనూ మరియు అతనిపై అవతరింపజేయబడిన దానిని (నిజంగానే) విశ్వసించి ఉంటే! వారిని (సత్యతిరస్కారులను) తమ మిత్రులుగా చేసుకొని ఉండేవారు కాదు, కాని వారిలో అనేకులు అవిధేయులున్నారు.

5:82

నిశ్చయంగా, విశ్వాసుల పట్ల (ముస్లింల పట్ల) విరోధ విషయంలో నీవు యూదులను మరియు బహుదైవా రాధకులను (ముష్రికీన్లను), అందరి కంటే కఠినులుగా కనుగొంటావు. మరియు విశ్వాసుల పట్ల మైత్రి విషయంలో: ''నిశ్చయంగా, మేము క్రైస్తవులము.'' అని, అన్న వారిని అత్యంత సన్నిహితులుగా పొందుతావు. ఇది ఎందుకంటే వారిలో మతగురువులు / విద్వాంసులు (ఖిస్సీసీన్) మరియు మునులు (రుహ్బాన్) ఉన్నారు మరియు నిశ్చయంగా, వారు గర్వించరు.

5:83

మరియు వారు (కొందరు క్రైస్తవులు) ప్రవక్తపై అవతరింపజేయబడిన దానిని (ఈ గ్రంథాన్ని) విన్నప్పుడు, సత్యాన్ని తెలుసు కున్నందుకు, వారి కళ్ళ నుండి కన్నీళ్ళు కారటం నీవు చూస్తావు. వారు ఇలా అంటారు: ''ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము. కావున మమ్మల్ని సాక్ష్యం ఇచ్చేవారిలో వ్రాసుకో!

5:84

''మరియు మేము అల్లాహ్ను మరియు మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండటానికి మాకేమైంది? మా ప్రభువు మమ్మల్ని సద్వర్తనులతో చేర్చాలని మేము కోరుకుంటున్నాము.''

5:85

కావున వారు పలికిన దానికి ఫలితంగా, అల్లాహ్ వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదించాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. మరియు సజ్జనులకు లభించే ప్రతిఫలం ఇదే!

5:86

మరియు ఎవరైతే సత్యతిరస్కారులై మా సూచనలను (ఆయాత్లను) అబద్ధా లన్నారో, అలాంటివారు భగభగమండే నరకాగ్ని వాసులవుతారు.

5:87

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీకు ధర్మసమ్మతం చేసిన పరిశుధ్ధ వస్తువులను నిషిధ్ధం చేసుకోకండి మరియు హద్దులు మీరకండి. నిశ్చయంగా, అల్లాహ్ హద్దులు మీరిపోయేవారిని ప్రేమించడు.

5:88

మరియు అల్లాహ్ మీకు జీవనో పాధిగా ప్రసాదించినవాటిలో ధర్మసమ్మతమైన, పరిశుద్ధ మైన పదార్థాలను తినండి. మీరు విశ్వసించిన అల్లాహ్యందు భయభక్తులు కలిగి ఉండండి.

5:89

మీరు ఉద్దేశం లేకుండానే చేసిన ప్రమా ణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుధ్ధిర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని (తప్పకుండా) పట్టుకుంటాడు. కావున దానికి (ఇలాంటి ప్రమాణ భంగానికి) పరిహారంగా మీరు మీ ఇంటి వారికి పెట్టే, మధ్యరకమైన ఆహారం పదిమంది పేదలకు పెట్టాలి. లేదా వారికి వస్త్రాలు ఇవ్వాలి. లేదా ఒక బానిసకు స్వాతంత్ర్యం ఇప్పించాలి. ఎవడికి ఈ శక్తిలేదో! అతడు మూడు దినాలు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే, ఇది దానికి పరిహారం (కఫ్ఫారా). మీ ప్రమాణాలను కాపాడుకోండి. మీరు కృతజ్ఞులై ఉండటానికి అల్లాహ్ తన ఆజ్ఞలను ఈ విధంగా మీకు విశదపరుస్తున్నాడు.

5:90

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మద్య పానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అ'న్సాబ్) మరియు శకునానికై బాణాల ప్రయోగం (అ'జ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్య కరమైన షై'తాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి.

5:91

నిశ్చయంగా, షై'తాన్ మద్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని మరియు మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరియు నమా'జ్ నుండి తొలగించాలని కోరు తున్నాడు. అయితే మీరిప్పుడైనా మానుకోరా?

5:92

మరియు మీరు అల్లాహ్కు విధేయులై ఉండండి మరియు ప్రవక్తను అనుసరించండి. జాగ్రత్త! మీరు ఒకవేళ తిరిగిపోతే! నిశ్చయంగా, మా ప్రవక్త బాధ్యత కేవలం (మా ఆజ్ఞను) మీకు స్పష్టంగా అందజేయటం మాత్రమే అని తెలుసుకోండి.

5:93

విశ్వసించి సత్కార్యాలు చేసే వారిపై, (ఇంతకుముందు) వారు తిన్న (త్రాగిన) దాన్ని గురించి దోషంలేదు; ఒకవేళ వారు దైవభీతి కలిగిఉండి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తూఉంటే, ఇంకా దైవభీతి కలిగిఉండి విశ్వాసులైతే, ఇంకా దైవభీతి కలిగిఉండి సజ్జనులైతే! మరియు అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.

5:94

ఓ విశ్వాసులారా! (మీరు ఇ'హ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు) – మీ ఇంద్రియాలకు అగోచరమైన అల్లాహ్కు ఎవరుభయపడతారో చూడటానికి – అల్లాహ్ మీచేతులకు మరియు మీబల్లెములకు అందుబాటులో ఉన్న కొన్ని వేట(జంతువుల) ద్వారా మిమ్మల్ని పరీక్షకు గురిచేస్తాడు. కావున ఈ (హెచ్చరిక) తరువాత కూడా ఎవడు హద్దును అతిక్ర మిస్తాడో, వాడికి బాధాకరమైనశిక్ష ఉంటుంది.

5:95

ఓ విశ్వాసులారా! మీరు ఇ'హ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి. మీలో ఎవరైనా బుధ్ధిపూర్వకంగా వేటచేస్తే, అతడు చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును పరిహారంగా సమర్పించుకోవాలి. దానిని (ఆపశువును) మీలో న్యాయ వర్తులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. పశువును ఖుర్బానీ కొరకు క'అబహ్ వద్దకు చేర్చాలి. లేదా దానికి పరిహారంగా కొందరు పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి పరిహారంగా – తాను చేసిన దాని ప్రతిఫలాన్ని చవిచూడటానికి – ఉపవాస ముండాలి. గడిచిపోయిన దానిని అల్లాహ్ మన్నించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్ అతనికి ప్రతీకారం చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వ శక్తి సంపన్నుడు, ప్రతీకారం చేయగలవాడు.

5:96

సముద్ర జంతువులను వేటాడటం మరియు వాటిని తినటం, జీవనోపాధిగా మీకూ (స్థిరనివాసులకూ) మరియు ప్రయాణీ కులకూ ధర్మసమ్మతం చేయబడింది. కానీ, మీరు ఇ'హ్రామ్ స్థితిలో ఉన్నంతవరకూ భూమిపై వేటాడటం మీకు నిషేధింపబడింది. కావున మీరు (పునరుత్థాన దినమున) ఎవరి ముందు అయితే సమావేశ పరచ బడతారో ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. (1/8)

5:97

అల్లాహ్ పవిత్ర గృహం అయిన క'అబహ్ ను మానవజాతి కొరకు, సురక్షిత మైన శాంతి నిలయంగా(బైతుల్ 'హరామ్గా) చేశాడు. మరియు పవిత్ర మాసాన్ని మరియు బలి(హద్య) పశువులను మరియు మెడలలో పట్టాలు వేసి క'అబహ్కు ఖుర్బానీ కొరకు తేబడే పశువులను (ఖలా ఇ'దలను) కూడా నియ మించాడు. ఇది ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్ ఎరుగునని, మీరు తెలుసుకోవాలని! మరియు నిశ్చయంగా అల్లాహ్కు ప్రతి ఒక్క విషయం గురించి బాగా తెలుసు.

5:98

నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించ టంలో కఠినుడని తెలుసుకోండి మరియు నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

5:99

సందేశహరుని బాధ్యత కేవలం (అల్లాహ్ సందేశాలను) మీకు అందజేయ టమే! మరియు మీరు వెలిబుచ్చేది మరియు దాచేది అంతా అల్లాహ్కు బాగా తెలుసు.

5:100

(ఓ ప్రవక్తా!) ఇలా అను: ''చెడు వస్తువుల ఆధిక్యత నీకు ఎంత నచ్చినా! చెడు మరియు మంచి వస్తువులు సరి సమానం కాజాలవు. కావున ఓ బుధ్ధిమంతులారా! మీరు సాఫల్యం పొందా లంటే అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.''

5:101

ఓ విశ్వాసులారా! వ్యక్తపరిస్తే మీకు బాధ కలిగించెడు విషయాలను గురించి, మీరు ప్రశ్నించకండి. ఖుర్ఆన్ అవతరింప జేయబడే టప్పుడు, మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే! అవి మీకు విశదపరచబడవచ్చు! వాటి కొరకు (ఇంతవరకు మీరు చేసిన ప్రశ్నల కొరకు) అల్లాహ్ మిమ్మల్ని మన్నించాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు.

5:102

వాస్తవానికి మీకు పూర్వం ఒక జాతి వారు ఇటువంటి ప్రశ్నలనే అడిగారు. తరువాత వాటి (ఆ ప్రశ్నల) కారణంగానే వారు సత్య తిరస్కారానికి గురిఅయ్యారు.

5:103

అల్లాహ్ బ'హీరహ్ను గానీ, సాయి'బహ్ను గానీ, వ'సీలహ్ను గానీ లేక 'హామ్ను గానీ నియమించలేదు. కాని సత్యతిరస్కారులు అల్లాహ్పై అబద్ధాలు కల్పిస్తున్నారు. మరియు వారిలో చాలా మంది బుద్ధిహీనులే!

5:104

మరియు వారితో: ''అల్లాహ్ అవతరింప జేసినదాని (సందేశం) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి.'' అని పిలిచినప్పుడు! వారు: ''మా తండ్రితాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన (మార్గమే) మాకు చాలు!'' అని జవాబిస్తారు. ఏమీ? వారి తండ్రితాతలకు ఏమీ తెలియకున్నా మరియు వారు సన్మార్గం మీద లేకున్నా (వారి మార్గాన్నే వీరు అనుసరిస్తారా)?

5:105

ఓ విశ్వాసులారా! మీ స్వయానికి మీరు బాధ్యత వహించండి. మీరు సన్మార్గంలో ఉంటే, మార్గభ్రష్టులైనవారు మీకు ఎలాంటి హాని చేయలేరు. మీరంతా అల్లాహ్ వైపునకే మరలి పోవలసి వుంది. అప్పుడు ఆయన మీరేమేమి చేస్తూ ఉండే వారో మీకు తెలియజేస్తాడు.

5:106

ఓ విశ్వాసులారా! మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైతే, మీరు వీలునామా వ్రాసేటప్పుడు, మీలో న్యాయ వర్తులైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా తీసుకోండి. ఒకవేళ మీరు ప్రయాణస్థితిలో ఉండి, అక్కడ మీకు మరణ ఆపద సంభవిస్తే, మీ వారు (ముస్లింలు లేకుంటే) ఇతరులను ఎవరినైనా ఇద్దరిని (సాక్షులుగా) తీసుకోవచ్చు. ఆ ఇద్దరినీ నమా'జ్ తరువాత ఆపుకోండి. మీకు సందేహముంటే, వారిద్దరూ అల్లాహ్పై ప్రమాణం చేసి ఇలా అనాలి: ''మా దగ్గరి బంధువు కొరకైనా సరే మేము స్వార్థం కొరకు మా సాక్ష్యాన్ని అమ్మము. మేము అల్లాహ్కొరకు ఇచ్చే సాక్ష్యాన్ని దాచము. మేము ఆవిధంగా చేస్తే నిశ్చయంగా, పాపాత్ములలో లెక్కింప బడుదుము గాక!''

5:107

కాని, ఆ తరువాత ఆ ఇద్దరు (సాక్షులు) పాపం చేశారని తెలిస్తే! అప్పుడు మొదటి ఇద్దరి (సాక్ష్యం) వలన హక్కును కోల్పోయిన వారి (బంధువుల)లో నుండి ఇద్దరు, మొదటి వారిద్దరికి బదులుగా నిలబడి అల్లాహ్పై శపథంచేసి ఇలా అనాలి: ''మా సాక్ష్యం వీరిరువురి సాక్ష్యం కంటే ఎక్కువ హక్కు గలది (సత్యమైనది). మరియు మేము ఏ విధమైన అక్రమానికి పాల్పడ లేదు. మేము ఆవిధంగా చేస్తే నిశ్చయంగా, అన్యాయపరులలో చేరి పోదుము గాక!''

5:108

ఇది (ఈ పద్ధతి) ప్రజలు నిజమైన సాక్ష్యం ఇవ్వటానికి లేదా వారి ప్రమాణాలను, తరువాత తీసుకొనబడే ప్రమాణాలు ఖండిస్తా యని వారిని భయపెట్టటానికి ఉత్తమ మైనది. అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండి, (ఆయనఆదేశాలను) వినండి. మరియు అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు. (1/4)

5:109

ఆ రోజు అల్లాహ్ ప్రవక్తలందరిని సమావేశపరచి: ''మీకేమి జవాబు ఇవ్వ బడింది?'' అని అడిగితే! వారు: ''మాకు యథార్థ జ్ఞానంలేదు! నిశ్చయంగా, నీవు మాత్రమే సర్వ అగోచర విషయాల జ్ఞానం గలవాడవు.'' అని పలుకుతారు.

5:110

(జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పున రుత్థాన దినమున), అల్లాహ్: ''ఓమర్యమ్ కుమా రుడా! 'ఈసా(ఏసు)నేను నీకుమరియు నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకో! నేను పరిశుద్ధాత్మ (రూ'హుల్ ఖుదుస్) ద్వారా నిన్ను బలపరిచాను, నీవు ఉయ్యాలలోనూ మరియు యుక్తవయస్సు లోనూ ప్రజలతో మాట్లాడేవాడివి. మరియు నేను గ్రంథాన్ని మరియు వివేకాన్ని, తౌరాతును మరియు ఇంజీలును నీకు నేర్పాను. మరియు నీవు నా ఆజ్ఞతో పక్షి ఆకారంగల మట్టి బొమ్మను తయారుచేసి, దానిలో ఊదినపుడు, నా ఆజ్ఞతో అది పక్షిగా మారిపోయేది. మరియు నీవు పుట్టుగ్రుడ్డిని మరియు కుష్ఠురోగిని నా ఆజ్ఞతో బాగు చేసేవాడివి. మరియు నీవు నా ఆజ్ఞతో మృతులను లేపేవాడివి. మరియు నీవు స్పష్టమైన సూచనలతో ఇస్రాయీ'లు సంతతి వారి వద్దకు వచ్చినపుడు, వారిలోని సత్య-తిరస్కారులు: 'ఇది స్పష్టమైన మాయా జాలం తప్ప మరేమీ కాదు!' '' అని అన్నారు. అప్పుడు నేను వారి కుట్ర నుండి నిన్ను కాపాడాను!

5:111

మరియు నేను, ('ఈసా) శిష్యుల ('హవారియ్యూన్ల) మనస్సులలో ఇలా మాట వేసినప్పుడు: ''నన్ను మరియు నా ప్రవక్తను విశ్వసించండి.'' వారన్నారు: ''మేము విశ్వసించాము మరియు మేము ముస్లింలము అయ్యాము అనే మాటకు సాక్షిగా ఉండు!''

5:112

(జ్ఞాపకం చేసుకోండి!) ఆ శిష్యులు ('హవారియ్యూన్): ''ఓ మర్యమ్ కుమారుడ వైన 'ఈసా (ఏసూ) ఏమీ? నీ ప్రభువు మా కొరకు ఆకాశం నుండి ఆహారంతో నిండిన ఒక పళ్ళెం దింపగలడా?'' అని అడిగారు! దానికి ('ఈసా): ''మీరు వాస్తవానికి విశ్వాసులే అయితే, అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండండి!'' అని అన్నాడు

5:113

వారు: ''వాస్తవానికి, మేము దాని నుండి తిని, మా హృదయాలను తృప్తిపరచు కోవటానికి మరియు నీవు మాతో సత్యం పలికావని తెలుసు కోవటానికి మరియు దానిని గురించి మేము సాక్షులుగా ఉండటానికి, మేమిలా కోరుతున్నాము!'' అని అన్నారు.

5:114

దానికి మర్యమ్ కుమారుడు 'ఈసా (ఏసు): ''ఓ అల్లాహ్! మా ప్రభూ! ఆకాశం నుండి ఆహారంతో నిండిన ఒక పళ్ళాన్ని మా కొరకు అవతరింపజేయి (దింపు); అది మాకు మొదటి వాని నుండి చివరి వాని వరకు పండుగగా ఉండాలి; అది నీ తరఫు నుండి ఒక సూచనగా ఉండాలి. మాకు ఆహారాన్ని ప్రసాదించు. నీవే అత్యుత్తమమైన ఉపాధి ప్రదాతవు!'' అని ప్రార్థించాడు.

5:115

(అప్పుడు)అల్లాహ్: ''నిశ్చయంగా, నేను దానిని మీపై అవతరింపజేస్తాను (దింపుతాను). కాని, దాని తరువాత కూడా మీలో ఎవడైనా సత్యతిరస్కారానికి పాల్పడితే! నిశ్చయంగా, వానికి నేను ఇంతవరకు సర్వలోకాలలో ఎవ్వడికీ విధించని శిక్షను విధిస్తాను!'' అని అన్నాడు.

5:116

మరియు (జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్: ''ఓ మర్యమ్ కుమారుడా! 'ఈసా (ఏసు) ఏమీ? నీవు ప్రజలతో: 'అల్లాహ్కు బదులుగా నన్నూ మరియు నా తల్లినీ ఆరాధ్యులుగా చేసుకోండి!' అని చెప్పావా?'' అని ప్రశ్నించగా! దానికి అతను ('ఈసా) అంటాడు: ''నీవు సర్వలోపాలకు అతీతుడవు. నాకు పలకటానికి అర్హతలేని మాటను నేను పలకటం తగినపని కాదు. ఒకవేళ నేను అలా చెప్పి ఉంటే నీకు తప్పక తెలిసి ఉండేది. నా మనస్సులో ఉన్నది నీకు తెలుసు, కాని నీ మనస్సులో ఉన్నది నాకు తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వ అగోచర విషయాలు తెలిసినవాడవు!

5:117

''నీవు ఆదేశించిందితప్ప, నేను మరేమీ వారికిచెప్పలేదు, అంటే: 'నా ప్రభువు మరియు మీ ప్రభువు అయిన అల్లాహ్నే ఆరాధించండి.' అని. నేను వారిమధ్య ఉన్నంత వరకు వారికి సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టు కుని ఉన్నావు. మరియు నీవే ప్రతి దానికి సాక్షివి!

5:118

''ఒకవేళ నీవు వారిని శిక్షించదలిస్తే వారు నీ దాసులే! మరియు నీవు వారిని క్షమించదలిస్తే! నీవు సర్వశక్తిమంతుడవు, మహా వివేచనాపరుడవు!''

5:119

అప్పుడు అల్లాహ్ ఇలా సెల విచ్చాడు: ''ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం లాభదాయకమవుతుంది. వారికి క్రింద కాలువలుప్రవహించే స్వర్గవనాలు లభిస్తాయి. అక్కడ వారు శాశ్వతంగా కలకాలముంటారు. అల్లాహ్ వారిపట్ల ప్రసన్ను డవు తాడు మరియు వారు ఆయనతో ప్రసన్నులవు తారు. ఇదే గొప్ప విజయం (సాఫల్యం)!''

5:120

ఆకాశాలపైననూ, భూమిపైననూ మరియు వాటిలో నున్న సమస్తం పైననూ, సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్దే! మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు (అన్నింటిపై అధికారం గలవాడు).


**********