ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్న సమస్తం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడు తుంటాయి. మరియు ఆయనే సర్వశక్తి మంతుడు, మహా వివేకవంతుడు.
ఆకాశాలపై మరియు భూమిపై సామ్రాజ్యాధి పత్యం ఆయనదే. ఆయనే జీవన మిచ్చేవాడు మరియు మరణమిచ్చే వాడు. మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు.
ఆయనే ప్రథమం మరియు ఆయనే అంతం మరియు ఆయనే ప్రత్యక్షుడు మరియు ఆయనే పరోక్షుడు. మరియు ఆయనే ప్రతిదాని గురించి జ్ఞానం గలవాడు.
ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్‌లలో) సృష్టించిన వాడు, తరువాత ఆయన సింహాసనాన్ని ('అర్ష్‌ను) అధిష్టించాడు. భూమిలోకి పోయేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి ఎక్కేది అంతా ఆయనకు తెలుసు. మరియు మీరెక్కడున్నా ఆయన మీతోపాటు ఉంటాడు. మరియు అల్లాహ్‌ మీరు చేసేదంతా చూస్తున్నాడు.
ఆకాశాలపై మరియు భూమిపై సామ్రాజ్యాధిపత్యం ఆయనదే మరియు అన్ని వ్యవహారాలు (నిర్ణయానికై) అల్లాహ్‌ వైపునకే తీసుకుపోబడతాయి.
ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింప జేస్తాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేస్తాడు. మరియు ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు.
అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి, ఆయన మిమ్మల్ని ఉత్తరాధి కారులుగా చేసిన వాటి నుండి (దానంగా) ఖర్చు పెట్టండి. మీలో ఎవరైతే విశ్వసించి తమ ధనాన్ని (దానముగా) ఖర్చుచేస్తారో, వారికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది.
మరియు మీకేమయింది? మీరు (వాస్తవానికి) విశ్వాసులే అయితే? మీరెందుకు అల్లాహ్‌ను విశ్వసించరు? మరియు ప్రవక్త, మిమ్మల్ని మీ ప్రభువును విశ్వసించండని పిలుస్తున్నాడు మరియు వాస్తవానికి మీచేత ప్రమాణం కూడా చేయించుకున్నాడు.
తన దాసుని (ము'హమ్మద్‌)పై స్పష్టమైన ఆయాత్‌ (సూచనలు) అవతరింపజేసేవాడు ఆయనే! అతను వాటి ద్వారా మిమ్మల్ని అంధ కారం నుండి వెలుతురులోకి తీసుకు రావటానికి. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ మిమ్మల్ని ఎంతో కనికరించేవాడు, అపార కరుణాప్రదాత.
మరియు మీకేమయింది? మీరెందుకు అల్లాహ్‌ మార్గంలో ఖర్చుపెట్టడం లేదు? ఆకాశాలు మరియు భూమి యొక్క వారసత్వం అల్లాహ్‌కే చెందుతుంది. (మక్కా) విజయానికి ముందు (అల్లాహ్‌ మార్గంలో) ఖర్చుపెట్టిన వారితో మరియు పోరాడినవారితో, (మక్కా విజయం తరువాత పోరాడినవారు మరియు ఖర్చుపెట్టినవారు) సమానులు కాజాలరు! అలాంటివారి స్థానం (విజయం తరువాత అల్లాహ్‌ మార్గంలో) ఖర్చుపెట్టిన మరియు పోరాడిన వారికంటే గొప్పది. కాని వారందరికీ అల్లాహ్‌ ఉత్తమమైన (ప్రతిఫలం) వాగ్దానం చేశాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును.
అల్లాహ్‌కు ఉత్తమమైన అప్పు ఇచ్చేవాడు ఎవడు? ఆయన దానిని ఎన్నోరెట్లు హెచ్చించి తిరిగి అతనికి ఇస్తాడు మరియు అతనికి శ్రేష్ఠమైన ప్రతిఫలం (స్వర్గం) ఉంటుంది.
ఆ దినమున నీవు విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను చూస్తే, వారి వెలుగు, వారి ముందు నుండి మరియు వారి కుడివైపు నుండి పరిగెత్తుతూ ఉంటుంది. (వారితో ఇలా అనబడుతుంది): "ఈ రోజు మీకు క్రింద సెలయేర్లు ప్రవహించే స్వర్గవనాల శుభవార్త ఇవ్వబడుతోంది, మీరందులో శాశ్వతంగా ఉంటారు! ఇదే ఆ గొప్ప విజయం."
ఆ రోజు కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు విశ్వాసులతో ఇలా అంటారు: "మీరు మా కొరకు కొంచెం వేచి ఉండండి, మేము మీ వెలుగు నుండి కొంచెం తీసుకుంటాము." వారితో ఇలాఅనబడు తుంది: "మీరు వెనుకకు మరలి పొండి, తరువాత వెలుగు కొరకు వెదకండి!" అప్పుడు వారి మధ్య ఒక గోడ నిలబెట్టబడుతుంది. దానికి ఒక ద్వారముంటుంది, దాని లోపలి వైపు కారుణ్యముంటుంది మరియు దాని బయట వైపు శిక్ష ఉంటుంది.
(బయటనున్న కపట విశ్వాసులు) ఇలా అరుస్తారు: "ఏమీ? మేము మీతో పాటు ఉండే వాళ్ళం కాదా?" (విశ్వాసులు)ఇలా జవాబిస్తారు: "ఎందుకు ఉండలేదు? కానీ వాస్తవానికి మిమ్మల్ని మీరు స్వయంగా పరీక్షకు గురిచేసు కున్నారు. మీరు మా (నాశనం కోసం) వేచి ఉన్నారు. మరియు మీరు (పునరు త్థానాన్ని) సందేహిస్తూ ఉన్నారు మరియు మీ తుచ్ఛమైన కోరికలు మిమ్మల్ని మోస పుచ్చాయి. చివరకు అల్లాహ్‌ నిర్ణయం వచ్చింది. మరియు ఆ మోసగాడు (షై'తాన్‌) మిమ్మల్ని అల్లాహ్‌ విషయంలో మోసపుచ్చాడు.
కావున ఈ రోజు మీ నుండి ఏ విధమైన పరిహారం తీసుకోబడదు. మరియు సత్య తిరస్కారుల నుండి కూడా తీసుకోబడదు. మీ నివాసం నరకమే, అదే మీ ఆశ్రయం. ఎంత చెడ్డ గమ్యస్థానం!" (7/8)
* ఏమీ? విశ్వాసుల హృదయాలు అల్లాహ్‌ ప్రస్తావవనతో కృంగిపోయి, ఆయన అవతరింప జేసిన సత్యానికి విధేయులయ్యే సమయం ఇంకా రాలేదా? పూర్వగ్రంథ ప్రజల్లాగా వారు కూడా మారిపోకూడదు. ఎందుకంటే చాలా కాలం గడిచిపోయినందుకు వారి హృదయాలు కఠినమైపోయాయి. మరియు వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్‌) ఉన్నారు.
బాగా తెలుసుకోండి! నిశ్చయంగా అల్లాహ్‌, భూమి చనిపోయిన తరువాత, దానికి మళ్ళీ జీవం పోస్తాడు. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టంగా తెలుపు తున్నాము, బహుశా మీరు అర్థం చేసుకుంటారని.
నిశ్చయంగా, విధి దానం ('జకాత్‌) చేసే పురుషులు మరియు విధి దానం చేసే స్త్రీలు మరియు అల్లాహ్‌కు మంచి అప్పు ఇచ్చేవారికి, ఆయన దానిని ఎన్నోరెట్లు పెంచి (తిరిగి) ఇస్తాడు. మరియు వారికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది.
మరియు ఎవరైతే అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసిస్తారో, అలాంటివారే సత్యసంధులైన (విశ్వాసులు). మరియు వారే తమ ప్రభువు వద్ద అమరవీరులు. వారికి వారి ప్రతిఫలం మరియు జ్యోతి లభిస్తాయి. కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో మరియు మా ఆయతులను అబద్ధాలని అంటారో, అలాంటి వారు తప్పక భగభగ మండే నరకాగ్ని వాసులవుతారు.
బాగా తెలుసుకోండి! నిశ్చయంగా, ఇహలోక జీవితం, ఒక ఆట మరియు ఒక వినోదం మరియు ఒక శృంగారం మరియు మీరు పరస్పరం గొప్పలు చెప్పుకోవడం మరియు సంపద మరియు సంతానం విషయంలో ఆధిక్యత పొందటానికి ప్రయత్నించడం మాత్రమే. దాని దృష్టాంతం ఆ వర్షంవలే ఉంది: దాని (వర్షం) వల్ల పెరిగే పైరు రైతులకు ఆనందం కలిగిస్తుంది. ఆ పిదప అది ఎండిపోయి పసుపుపచ్చగా మారిపోతుంది. ఆ పిదప అది పొట్టుగా మారిపోతుంది. కాని పరలోక జీవితంలో మాత్రం (దుష్టులకు) బాధాకరమైన శిక్ష మరియు (సత్పురుషులకు) అల్లాహ్‌ నుండి క్షమాపణ మరియు ఆయన ప్రసన్నత ఉంటాయి. కావున ఇహలోక జీవితం కేవలం మోసగించే బోగభాగ్యాలు మాత్రమే.
మీ ప్రభువు క్షమాపణ వైపునకు మరియు ఆకాశం మరియు భూమి యొక్క వైశాల్యమంతటి విశాలమైన స్వర్గం వైపునకు పరుగెత్తండి. అది అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించేవారి కొరకు సిద్ధపరచబడి ఉంది. ఇది అల్లాహ్‌ అనుగ్రహం, ఆయన తాను కోరిన వారికి దానిని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్‌ అనుగ్రహశాలి, సర్వోత్తముడు.
భూమి మీదగానీ లేదా స్వయంగా మీ మీదగానీ విరుచుకుపడే ఏ ఆపద అయినా సరే! మేము దానిని సంభవింపజేయకముందే గ్రంథంలో వ్రాయబడకుండాలేదు. నిశ్చయంగా, ఇది అల్లాహ్‌కు ఎంతో సులభం.
ఇదంతా మీరు పోయినదానికి నిరాశ చెందకూడదని మరియు మీకు ఇచ్చినదానికి సంతోషంతో ఉప్పొంగి పోరాదని. మరియు అల్లాహ్‌ బడాయీలు చెప్పుకునేవారూ, గర్వించే వారూ అంటే ఇష్టపడడు.
ఎవరైతే స్వయంగా లోభత్వం చూపుతూ ఇతరులను కూడా లోభత్వానికి పురికొలుపుతారో మరియు ఎవడైతే (సత్యం నుండి) వెనుదిరుగుతాడో, వాడు (తెలుసు కోవాలి) నిశ్చయంగా, అల్లాహ్‌ స్వయం సమృధ్ధుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడని!
వాస్తవానికి, మేము మా సందేశ హరులను స్పష్టమైన సూచనలనిచ్చి పంపాము. మరియు వారితోబాటు గ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు మానవులు న్యాయశీలురుగా మెలగటానికి త్రాసును కూడా పంపాము మరియు ఇనుమును కూడా ప్రసాదించాము. అందులో గొప్ప శక్తి ఉంది, మరియు మానవులకు ఎన్నో ప్రయోజనా లున్నాయి. మరియు (ఇదంతా) అల్లాహ్‌ అగోచరుడైన తనకు మరియు తన ప్రవక్తలకు ఎవడు సహాయకుడవుతాడో చూడటానికి చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ మహాబలశాలి, సర్వశక్తిమంతుడు.
మరియు వాస్తవంగా మేము నూ'హ్‌ను మరియు ఇబ్రాహీమ్‌ను పంపాము. మరియు వారిద్దరి సంతానంలో ప్రవక్త పదవినీ మరియు గ్రంథాన్ని ఉంచాము. కాని వారి సంతతిలో కొందరు మార్గదర్శకత్వం మీద ఉన్నారు, కాని వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్‌) ఉన్నారు.
ఆ తరువాత చాలా మంది ప్రవక్తలను మేము వారి తరువాత పంపాము. మరియు మర్యమ్‌ కుమారుడు ఈసాను కూడా పంపాము మరియు అతనికి ఇంజీల్‌ను ప్రసాదించాము. మరియు అతనిని అనుసరించేవారి హృదయాలలో మేము జాలిని, కరుణను కలిగించాము, కాని సన్యాసాన్ని వారే స్వయంగా కల్పించుకున్నారు. మేము దానిని వారిపై విధించలేదు, కాని అల్లాహ్‌ ప్రసన్నతను పొందగోరి వారే దానిని విధించుకున్నారు, కాని వారు దానిని పాటించవలసిన విధంగా నిజాయితీతో పాటించలేదు. కావున వారిలో విశ్వసించినవారికి వారి ప్రతిఫలాన్ని ప్రసాదించాము. కాని వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్‌) ఉన్నారు.
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి, మరియు ఆయన సందేశహరుణ్ణి విశ్వసించండి, ఆయన (అల్లాహ్‌) మీకు రెట్టింపు కరుణను ప్రసాదిస్తాడు మరియు వెలుగును ప్రసాదిస్తాడు, మీరు అందులో నడుస్తారు మరియు ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. మరియు అల్లాహ్‌ ఎంతో క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
అల్లాహ్‌ అనుగ్రహం మీద తమకు ఎలాంటి అధికారంలేదని మరియు నిశ్చయంగా, అనుగ్రహం కేవలం అల్లాహ్‌చేతిలో ఉందని మరియు ఆయన తాను కోరినవారికి దానిని ప్రసాదిస్తాడని, పూర్వగ్రంథప్రజలు తెలుసు కోవాలి. మరియు అల్లాహ్‌ అనుగ్రహశాలి, సర్వోత్తముడు.


**********