48:1

(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము;

48:2

అల్లాహ్‌! నీ పూర్వపు మరియు భావి కాలపు తప్పులను క్షమించటానికి మరియు నీపై తన అనుగ్రహాన్ని పూర్తిచేయ టానికి మరియు నీకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయటానికి;

48:3

మరియు అల్లాహ్‌! నీకు గొప్ప సహకారంతో సహాయపడటానికి.

48:4

ఆయనే, విశ్వాసుల హృదయాలలో శాంతిని అవతరింపజేశాడు, వారి విశ్వాసంలో మరింత విశ్వాసాన్ని అధికం చేసేందుకు. మరియు ఆకాశాలలోని భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్‌ అధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

48:5

విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను క్రిందసెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేసేందుకు, అందులో వారు శాశ్వతంగా ఉండేందుకు మరియు వారి పాపాలను తొలగించేందుకూను. మరియు అల్లాహ్‌ దృష్టిలో ఇది ఒక గొప్ప విజయం.

48:6

మరియు కపట విశ్వాసులు (మునాఫిఖీన్‌) అయిన పురుషులను మరియు కపట విశ్వాసులైన స్త్రీలను; మరియు బహుదైవారాధకులైన పురుషులను మరియు బహుదైవారాధకులైన స్త్రీలను; అల్లాహ్‌ను గురించి చెడుభావనలు, భావించే వారందరినీ శిక్షించేందుకు. వారిపై చెడు అన్నివైపుల నుండి ఆవరించి ఉంటుంది. మరియు అల్లాహ్‌ యొక్క ఆగ్రహం వారిపై విరుచుకుపడుతుంది. మరియు ఆయన వారిని శపించాడు (బహిష్కరించాడు); మరియు వారికొరకు నరకాన్ని సిధ్ధపరచి ఉంచాడు. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం!

48:7

ఆకాశాలలోని మరియు భూమిలోని సైన్యాలన్నీ అల్లాహ్‌ అధీనంలోనే ఉన్నాయి. మరియు అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

48:8

నిశ్చయంగా, (ఓ ము'హమ్మద్‌!) మేము నిన్ను సాక్షిగా, శుభవార్తలు అందజేసేవానిగా మరియు హెచ్చరించేవానిగానూ చేసి పంపాము.

48:9

ఎందుకంటే (ఓ ముస్లింలారా!) మీరు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించాలనీ మరియు మీరు అతనితో (ప్రవక్తతో) సహకరించాలనీ మరియు అతనిని గౌరవించాలనీ మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన (అల్లాహ్‌) పవిత్రతను కొనియాడాలనీ!

48:10

(ఓ ము'హమ్మద్‌!) నిశ్చయంగా, (నీ చేతిలో చేయివేసి) నీతో శపథం చేసేవారు, వాస్తవానికి అల్లాహ్‌తో శపథం చేస్తున్నారు. అల్లాహ్‌ చెయ్యి వారి చేతుల మీద ఉంది. ఇక ఎవడు (తన శపథాన్ని) భంగంచేస్తాడో, వాస్తవానికి అతడు తన నష్టం కొరకే తన శపథాన్ని భంగం చేస్తాడు. మరియు ఎవడు తన వాగ్దానాన్ని పూర్తి చేస్తాడో, అల్లాహ్‌ అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు.

48:11

వెనుక ఉండిపోయిన ఎడారివాసులు (బద్దూలు) నీతో ఇలా అంటారు: "మా ఆస్తిపాస్తుల మరియు మా ఆలుబిడ్డల చింత మాకు తీరికలేకుండా చేశాయి. కావున మా క్షమాపణకై ప్రార్థించండి!" వారు తమ హృదయాలలో లేనిది తమ నాలుకలతో పలుకుతున్నారు. వారితో ఇలా అను: "ఒకవేళ అల్లాహ్‌ మీకు నష్టం చేయదలిస్తే, లేదా లాభం చేయదలిస్తే, ఆయన నుండి మిమ్మల్ని తప్పించగల శక్తి ఎవరికుంది? వాస్తవానికి మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును!

48:12

"అలాకాదు! ప్రవక్త మరియు విశ్వాసులు ఎన్నటికీ – తమ ఆలుబిడ్డల వద్దకు – తిరిగి రాలేరని మీరుభావించారు; మరియు ఇది (ఈఆలోచన) మీ హృదయాలకు చాలా నచ్చింది మరియు మీరు చాలా చెడ్డ తలంపులు చేశారు మరియు మీరు అధోగతికి చెందినవారు."

48:13

మరియు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించని సత్యతిరస్కారుల కొరకు మేము నిశ్చయంగా, భగభగ మండే అగ్ని జ్వాలలను సిధ్ధపరచి ఉంచాము.

48:14

మరియు భూమ్యాకాశాలపై సామ్రా జ్యాధిపత్యం అల్లాహ్‌దే! ఆయన తాను కోరినవారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్‌ సదా క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

48:15

ఇక మీరు విజయధనాన్ని తీసుకోవ టానికి పోయినప్పుడు, వెనుక ఉండి్పోయిన వారు ఇలా అంటారు: "మమ్మల్ని కూడా మీ వెంట రానివ్వండి." వారు అల్లాహ్‌ ఉత్తరు వును మార్చగోరుతున్నారు. వారితో అను: "మీరు మ వెంట రాజాలరు; మీ గురించి అల్లాహ్‌ ముందే ఈవిధంగా చెప్పాడు." అప్పుడు వారు ఇలా అంటారు: "అది కాదు! మీరు మా మీద అసూయపడుతున్నారు." అలా కాదు! వారు వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగేది చాలా తక్కువ.

48:16

వెనుక ఉండిపోయిన ఎడారివాసులతో (బద్దూలతో) ఇలా అను: "ఇకమీద చాలా కఠినంగా పోరాడేవారికి విరుద్ధంగా (యుధ్ధం చేసేందుకు) మీరు పిలువబడతారు. అప్పుడు (మీరు చనిపోయేవరకూ) వారితో యుద్ధం చేయవలసి ఉంటుంది, లేదా వారు లొంగిపోయే వరకు. ఒకవేళ మీరు ఆజ్ఞాపాలన చేస్తే, అల్లాహ్‌ మీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ మీరు ఇంతకు ముందు మరలిపోయినట్లు, మరలిపోతే ఆయన మీకు అత్యంత బాధాకరమైన శిక్ష విధించగలడు."

48:17

కాని గ్రుడ్డివానిపై ఎలాంటి నిందలేదు మరియు కుంటివానిపై కూడా ఎలాంటి నింద లేదు మరియు అదేవిధంగా వ్యాధిగ్రస్తునిపై కూడా ఎలాంటి నిందలేదు. అల్లాహ్‌ మరియు ఆయనప్రవక్తకు విధేయత చూపేవారిని, ఆయన క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. మరియు వెనుదిరిగిన వానికి ఆయన బాధాకరమైన శిక్ష విధిస్తాడు. (1/2)

48:18

వాస్తవానికి విశ్వాసులు చెట్టు క్రింద నీతో చేసిన శపథం చూసి అల్లాహ్‌ సంతో షించాడు; మరియు వారి హృదయాల స్థితి ఆయనకు తెలిసిందే. కావున ఆయన వారి మీద శాంతిని అవతరింపజేశాడు. మరియు బహు మానంగా వారికి సమీప విజయాన్ని ప్రసాదించాడు.

48:19

మరియు అందులో వారు చాలా విజయ ధనాన్ని కూడా పొందుతారు. మరియు అల్లాహ్‌ సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.

48:20

మరియు అల్లాహ్‌ మీకు ఇంకా చాలా విజయధనాల వాగ్దానం చేశాడు. మీరు వాటిని పొందుతారు. కావున మీకు వాటిని త్వరగా ప్రసాదిస్తాడు. మరియు ఆయన ప్రజల చేతులను మీ నుండి ఆపాడు. ఇది విశ్వాసులకు ఒక సూచనగా ఉండేందుకు మరియు ఆయన మీకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేసేందుకూను.

48:21

ఇంకా ఇతర (విజయాలు) కూడా! వాటిని మీరింకా సాధించలేదు. వాస్తవానికి, అల్లాహ్‌ వాటిని ఆవరించి ఉన్నాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.

48:22

మరియు ఒకవేళ సత్యతిరస్కారులు మీతో యుధ్ధానికి దిగివుంటే, వారు తప్పక వెన్నుచూపి పారిపోయేవారు, అప్పుడు వారు ఏ రక్షకుడినిగానీ లేదా సహాయకుడినిగానీ పొందేవారు కాదు.

48:23

ఇది మొదటి నుంచే వస్తూ ఉన్న అల్లాహ్‌ సంప్రదాయం. నీవు అల్లాహ్‌ సంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు.

48:24

మరియు మక్కా లోయలో మీకు వారి మీద ప్రాబల్యం ఇచ్చిన తర్వాత, ఆయనే వారి చేతులను మీపై పడకుండా మరియు మీ చేతులు వారిపై పడకుండా చేశాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ చూస్తున్నాడు.

48:25

(వాస్తవానికి) సత్యాన్ని తిరస్కరించి, మిమ్మల్ని మస్జిద్‌ అల్‌-'హరామ్‌కు పోకుండా నిరోధించి, బలి (ఖుర్బానీ) జంతువులను వాటిని బలి చేసే స్థలానికి చేరనివ్వకుండా ఆపింది వారే కదా! ఒకవేళ వారిలో విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు లేకుంటే – ఎవరిని గురించైతే మీకు తెలియదో – వారిని మీరు త్రొక్కివేసి ఉండేవారు. దాని వలన మీరు – మీకు తెలియకుండానే – పాపానికి గురి అయ్యేవారు. అల్లాహ్‌ తాను కోరినవారిని తన కారుణ్యంలోనికి తీసుకుంటాడు. ఒకవేళ వారు (విశ్వాసులు) వారి నుండి వేరుగా ఉండి ఉంటే, మేము తప్పక వారిలోని సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష విధించి ఉండేవారము.

48:26

సత్యాన్ని తిరస్కరించినవారు, తమ హృదయాలలోని మూఢ అభిమానం వల్ల, మూర్ఖపు పట్టు వహించినప్పుడు, అల్లాహ్‌! తన సందేశహరుని మీద మరియు విశ్వాసుల మీద, శాంతిని అవతరింపజేశాడు. మరియు వారిలో దైవభీతిని స్థిరపరచాడు మరియు వారే దానికి హక్కుదారులు మరియు అర్హులు కూడాను. మరియు అల్లాహ్‌కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.

48:27

వాస్తవానికి అల్లాహ్‌ తన ప్రవక్తకు, అతని స్వప్నాన్ని, నిజంచేసి చూపాడు. అల్లాహ్‌ కోరితే, మీరు తప్పక శాంతి యుతంగా, మీ తలలను పూర్తిగా గొరిగించు కొని లేదా తల వెంట్రుకలను కత్తిరించుకొని, మస్జిద్‌అల్‌-'హరామ్‌లోకి భయపడకుండా ప్రవేశించేవారు. మీకు తెలియనిది ఆయనకు తెలుసు, ఇక ఇదేకాక సమీపంలోనే మీకు మరొక విజయాన్ని కూడా ప్రసాదించ బోతున్నాడు.

48:28

ఆయనే, తన ప్రవక్తను మార్గదర్శ కత్వంతో మరియు సత్యధర్మంతో అన్ని ధర్మాలపై అది ఆధిక్యత కలిగివుండేలా చేసి పంపాడు. మరియు సాక్షిగా అల్లాహ్‌యే చాలు.

48:29

ము'హమ్మద్‌ అల్లాహ్‌ యొక్క సందేశహరుడు. మరియు అతని వెంట ఉన్నవారు, సత్యతిరస్కారుల పట్ల కఠినులు మరియు పరస్పరం కరుణామయులు. నీవు వారిని (అల్లాహ్‌ ముందు) వంగుతూ (రుకూ'ఉ చేస్తూ), సాష్టాంగాలు (సజ్దా) చేస్తూ ఉండటం చూస్తున్నావు. వారు అల్లాహ్‌ అనుగ్రహాన్ని మరియు ప్రసన్నతను అర్థిస్తూ ఉంటారు. వారి ముఖాల మీద సాష్టాంగం (సజ్దా) చేయటం వల్ల వచ్చిన గుర్తులుంటాయి. వారి ఈ ఉపమానం తౌరాత్‌లో కూడా ఇవ్వబడింది. మరియు ఇంజీల్‌లో వారు ఒక పైరుతో పోల్చబడ్డారు: మొదట (బీజం నుండి) ఒక మొలక అంకురిస్తుంది, తరువాత ఆయన దానిని బలపరుస్తాడు, తరువాత దానిని లావుగా చేస్తాడు. ఆ తరువాత అది తన కాండం మీద నిటారుగా నిలబడి రైతులను ఆనందపరిచి సత్యతిరస్కారులకు క్రోధావేశాలు కలిగిస్తుంది. విశ్వసించి, సత్కార్యాలు చేసేవారికి క్షమాపణ మరియు గొప్పప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్‌ వాగ్దానంచేశాడు. (5/8)


**********