7:1

అలిఫ్-లామ్-మీమ్-'సాద్!

7:2

(ఓ ము'హమ్మద్!) ఈ గ్రంథం నీపై అవతరింపజేయబడింది. కావున దీనిని గురించి నీ హృదయంలో ఏవిధమైన సంకోచం ఉండనివ్వకు; ఇది నీవు (సన్మార్గం నుండి తప్పేవారికి) హెచ్చరిక చేయటానికి (అవతరింప జేయబడింది); మరియు ఇది విశ్వాసులకొక హితోపదేశం.

7:3

(ప్రజలారా!) మీ ప్రభువు తరఫునుండి మీ కొరకు అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ను) అనుసరించండి. మరియు ఆయన (అల్లాహ్)ను కాదని ఇతర స్నేహితులను (సహాయకులను) అనుస రించకండి. మీరు ఎంతో తక్కువగా ఈ హితబోధను స్వీకరిస్తున్నారు!

7:4

మరియు మేము ఎన్నో నగరాలను (వాటి నేరాలకుగాను) నాశనం చేశాము. వారిపై, మా శిక్ష (అకస్మాత్తుగా) రాత్రివేళలో గానీ, లేదా మధ్యాహ్నం వారు విశ్రాంతి తీసుకునే సమయంలో గానీ వచ్చిపడింది.

7:5

వారిపై మా శిక్ష పడినప్పుడు వారి రోదన: “నిశ్చయంగా, మేము అపరాధులంగా ఉండే వారం!” అని అనడం తప్ప మరేమీ లేకుండింది.

7:6

కావున మేము ఎవరి వద్దకు మా సందేశాన్ని (ప్రవక్తను) పంపామో, వారిని తప్పక ప్రశ్నిస్తాము. మరియు నిశ్చయంగా, ప్రవక్తలను కూడా ప్రశ్నిస్తాము.

7:7

అప్పుడు (జరిగిందంతా) వారికి పూర్తి జ్ఞానంతో వివరిస్తాము. ఎందుకంటే మేము (ఎక్కడనూ, ఎప్పుడునూ) లేకుండా లేము.

7:8

మరియు ఆ రోజు (కర్మల) తూకం న్యాయంగా జరుగుతుంది. కావున ఎవరి తూనికలు బరువుగా ఉంటాయో అలాంటి వారే సఫలీకృతులు.

7:9

మరియు ఎవరి తూనికలు తేలికగా ఉంటాయో, అలాంటివారే తమను తాము నష్టానికి గురిచేసుకున్నవారు. ఎందుకంటే, వారు మా సూచనలను దుర్మార్గంతో తిరస్కరిస్తూ ఉండేవారు.

7:10

మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని భూమిలో స్థిరపరచాము మరియు అందులో మీకు జీవనవసతులనుకల్పించాము.(అయినా) మీరు కృతజ్ఞత చూపేది చాలా తక్కువ.

7:11

మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని సృష్టించాము, పిదప మీ రూపాన్ని తీర్చిదిద్దాము. ఆ పిదప దైవదూతలను: “మీరు ఆదమ్‌కు సాష్టాంగం (సజ్దా) చేయండి!” అని ఆదేశించగా, ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం (సజ్దా) చేశారు, అతడు సాష్టాంగం చేసేవారిలో చేరలేదు.

7:12

(అప్పుడు అల్లాహ్) అన్నాడు: “(ఓ ఇబ్లీస్!) నేను ఆజ్ఞాపించినప్పటికీ, సాష్టాంగం చేయకుండా నిన్ను ఆపింది ఏమిటీ?” దానికి (ఇబ్లీస్): “నేను అతనికంటే శ్రేష్ఠుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని నీవు మట్టితో సృష్టించావు.” అని జవాబిచ్చాడు.

7:13

(అప్పుడు అల్లాహ్) ఆజ్ఞాపించాడు: “నీవిక్కడి నుండి దిగిపో! ఇక్కడ గర్వపడటం నీకు తగదు, కావున వెళ్ళిపో! నిశ్చయంగా, నీవు నీచులలో చేరావు!”

7:14

(ఇబ్లీస్) ఇలా వేడుకున్నాడు: “వారు తిరిగి లేపబడే (పునరుత్థాన) దినంవరకు నాకు వ్యవధినివ్వు!”

7:15

(అల్లాహ్) సెలవిచ్చాడు: “నిశ్చయంగా నీకు వ్యవధి ఇవ్వబడుతోంది!”

7:16

(దానికి ఇబ్లీస్) అన్నాడు: “నీవు నన్ను మార్గభ్రష్టత్వంలో వేసినట్లు, నేను కూడా వారి కొరకు నీ ఋజు మార్గంపై మాటువేసి కూర్చుంటాను!

7:17

“తరువాత నేను వారి ముందునుండి, వారి వెనుకనుండి, వారి కుడివైపునుండి మరియు వారి ఎడమ వైపునుండి, వారి వైపుకు వస్తూ ఉంటాను. మరియు వారిలో అనేకులను నీవు కృతజ్ఞులుగా పొందవు!”

7:18

(అల్లాహ్) జవాబిచ్చాడు: “నీవిక్కడి నుండి అవమానింపబడి, బహిష్కృతుడవై వెళ్ళిపో! వారిలో ఎవరైతే నిన్ను అనుసరిస్తారో! అలాంటి మీ వారి అందరితో నిశ్చయంగా, నేను నరకాన్ని నింపుతాను.”

7:19

మరియు: “ఓ ఆదమ్! నీవు మరియు నీ భార్య ఈ స్వర్గంలో ఉండండి. మరియు మీరిద్దరూ మీ ఇచ్ఛానుసారంగా దీనిలోని (ఫలాలను) తినండి, కాని ఈ వృక్షాన్ని సమీపించకండి! అలా చేస్తే మీరు దుర్మార్గులలో చేరిపోతారు.”

7:20

ఆ పిదప షై'తాన్ వారిద్దరి చూపులకు మరుగుగా ఉన్న వారిద్దరి మర్మాంగాలను వారికి బహిర్గతం చేయటానికి, రహస్యంగా వారి చెవులలో అన్నాడు: “మీరిద్దరూ దైవదూతలు అయిపోతారని, లేదా మీరిద్దరూ శాశ్వత జీవితాన్ని పొందుతారని మీ ప్రభువు, మీ ఇద్దరినీ ఈ వృక్షం నుండి నివారించాడు!”

7:21

మరియు (షై'తాన్) వారిద్దరితో ప్రమాణం చేస్తూ పలికాడు: “నిశ్చయంగా, నేను మీ ఇద్దరి శ్రేయోభిలాషిని!”

7:22

ఈ విధంగా వారిద్దరిని మోసపుచ్చి, తన (పన్నుగడ) వైపునకు త్రిప్పుకున్నాడు. వారిద్దరూ ఆ వృక్షమును (ఫలమును) రుచి చూడగానే వారిద్దరి మర్మాంగాలు వారికి బహిర్గత మయ్యాయి. అప్పుడు వారు తమ (శరీరాల)పై స్వర్గపు ఆకులను కప్పుకో సాగారు. మరియు వారి ప్రభువు వారిద్దరినీ పిలిచి అన్నాడు: “ఏమి? నేను మీ ఇద్దరినీ ఈ చెట్టువద్దకు పోవద్దని నివారించలేదా? మరియు నిశ్చయంగా, షై'తాన్ మీ ఇద్దరి యొక్క బహిరంగ శత్రువని చెప్పలేదా?”

7:23

వారిద్దరూ ఇలా విన్నవించు కున్నారు: “ఓ మా ప్రభూ! మాకు మేము అన్యాయం చేసుకున్నాము. మరియు నీవు మమ్మల్ని కరుణించక పోతే! మమ్మల్ని క్షమించక పోతే! నిశ్చయంగా, మేము నాశనమై పోయే వారమవుతాము.”

7:24

(అల్లాహ్) అన్నాడు: “మీరందరు దిగిపొండి! మీరు ఒకరికొకరు శత్రువులు అవుతారు. మరియు మీరందరికీ ఒక నిర్ణీతకాలం వరకు భూమిలో నివాసం మరియు జీవనోపాధి ఉంటాయి.”

7:25

ఇంకా ఇలా అన్నాడు: “మీరందరూ అందులోనే జీవిస్తారు మరియు అందులోనే మరణిస్తారు మరియు దానినుండే మరల లేపబడతారు (పునరుత్థరింపబడతారు).”

7:26

ఓ ఆదమ్ సంతానమా! వాస్తవానికి మేము మీ కొరకు వస్త్రాలను కల్పించాము, అవి మీ మర్మాంగాలను కప్పుతాయి మరియు మీకు అలంకారమిస్తాయి. మరియు దైవభీతియే అన్నిటికంటే శ్రేష్ఠమైన వస్త్రం. ఇవి అల్లాహ్ సూచనలలో కొన్ని; బహుశా గుణపాఠం నేర్చు కుంటారేమోనని, (వీటిని వినిపిస్తున్నాము).

7:27

ఓ ఆదమ్ సంతానమా! షైతాను మీ తల్లిదండ్రుల నుండి (స్వర్గ) వస్త్రాలను తొలగించి, వారి మర్మాంగాలను వారికి కనబడేటట్లు చేసి, వారిని స్వర్గంనుండి వెడలగొట్టినట్లు మిమ్మల్ని కూడా ఆపదకు (ఫిత్నకు) గురిచేయకూడదు. నిశ్చయంగా, వాడు మరియు వాని సంతతివారు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు. కాని, మీరు వారిని చూడలేరు. నిశ్చయంగా, మేము షై'తానులను, విశ్వసించని వారికి స్నేహితులుగా చేశాము.

7:28

మరియు వారు (అవిశ్వాసులు), ఏదైనా అశ్లీలమైన పని చేసినపుడు ఇలా అంటారు: “మేము మా తండ్రితాతలను ఈ పద్దతినే అవలంబిస్తూ ఉండగా చూశాము. మరియు అలా చేయమని అల్లాహ్‌యే మమ్మల్ని ఆదేశించాడు.'' వారితో అను: “నిశ్చయంగా, అల్లాహ్ అశ్లీలమైన పనులు చేయమని ఎన్నడూ ఆదేశించడు. ఏమీ? మీకు తెలియని విషయాన్ని గురించి అల్లాహ్‌పై నిందలు వేస్తున్నారా?”

7:29

(ఓ ము'హమ్మద్! వారితో) ఇలా అను: “నా ప్రభువు న్యాయాన్ని పాటించమని ఆదేశించాడు. మరియు మీరు ప్రతి మస్జిద్లో (నమా'జ్లో) మీ ముఖాలను సరిగ్గా (ఆయన వైపునకే) మరల్చుకొని నమా'జ్ను పూర్తి శ్రధ్ధతో నిర్వహించండి మరియు ధర్మాన్ని / ఆరాధనను (దీన్ను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకొని ఆయనను మాత్రమే ప్రార్థించండి.” ఆయన మిమ్మల్ని మొదట సృష్టించి నట్లు మీరు తిరిగి సృష్టించబడతారు.

7:30

మీలో కొందరికి ఆయన సన్మార్గం చూపించాడు. మరికొందరు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్‌ను వదలి షై'తానులను తమ స్నేహితులుగా చేసుకున్నారు మరియు నిశ్చయంగా, తామే సన్మార్గంపై ఉన్నామని భ్రమలో ఉన్నారు. (5/8)

7:31

ఓ ఆదమ్ సంతానమా ప్రతి మస్జిద్లో (నమా'జ్లో) మీ వస్త్రాలంకరణ పట్ల శ్రధ్ధ వహించండి. తినండి త్రాగండి, కాని మితిమీర కండి. నిశ్చయంగా, ఆయన (అల్లాహ్) మితిమీరే వారిని ప్రేమించడు.

7:32

ఇలా అను: “అల్లాహ్ తనదాసుల కొరకు సృష్టించిన వస్త్రాలంకరణను మరియు మంచి జీవనోపాధిని నిషేధించేవాడెవడు?” (ఇంకా) ఇలా అను: “ఇవి ఇహలోక జీవితంలో విశ్వాసుల కొరకే; పునరుత్థాన దినమున ప్రత్యేకంగా వారికొరకు మాత్రమే గలవు. ఈ విధంగా మేము మా సూచనలను జ్ఞానం గలవారికి స్పష్టంగా వివరిస్తున్నాము.”

7:33

ఇలా అను: “నా ప్రభువు బహిరంగంగా గానీ, లేదా రహస్యంగా గానీ, అశ్లీల (అసహ్య కరమైన) కార్యాలను, పాప కార్యాలను చేయటాన్ని మరియు దౌర్జన్యం చేయటాన్ని మరియు ఆయన (అల్లాహ్) అవతరింపజేసిన ప్రమాణం ఏదీ లేనిదే ఇతరులను అల్లాహ్‌కు సాటి (భాగస్వాములుగా) కల్పించటాన్ని మరియు మీకు జ్ఞానం లేనిదే ఏ విషయాన్ని అయినా అల్లాహ్‌పై మోపటాన్ని నిషేధించి వున్నాడు.”

7:34

మరియు ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. కావున ఆ గడువు వచ్చినపుడు, వారు ఒక ఘడియ వెనుక గానీ మరియు ముందు గానీ కాలేరు.

7:35

ఓ ఆదమ్ సంతానమా! మీలో నుంచే మీ వద్దకు నా సూచనలను వినిపించే ప్రవక్తలు వచ్చినపుడు, ఎవరైతే దైవభీతి కలిగివుండి తమను తాము సరిదిద్దు కుంటారో, అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

7:36

కాని ఎవరైతే మా సూచనలను అసత్యాలని నిరాకరించి, వాటి యెడల దురహంకారం చూపుతారో, అలాంటివారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

7:37

ఇక అల్లాహ్‌పై అసత్యాలు కల్పించే వానికంటే; లేదా ఆయన సూచనలను అసత్యాలని తిరస్కరించే వానికంటే మించిన దుర్మార్గుడెవడు? అలాంటి వారు తమ విధివ్రాత ప్రకారం తమ భాగ్యాన్ని పొందుతారు. తుదకు మేము పంపే దైవదూతలు వారి ప్రాణాలు తీయటానికి వారి వద్దకు వచ్చి: “మీరు అల్లాహ్‌ను వదలి ప్రార్థించే వారు (ఆ దైవాలు) ఇపుడు ఎక్కడున్నారు?” అని అడుగుతారు. వారిలా జవాబిస్తారు: “వారు మమ్మల్ని వదిలి పోయారు.” మరియు ఈ విధంగా వారు: “మేము నిజంగానే సత్య తిరస్కారులమై ఉండేవారము.” అని, తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిచ్చుకుంటారు.

7:38

(అల్లాహ్) అంటాడు: “మీకు పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవుల సమాజాలు పోయి చేరిన ఆ నరకాగ్నిలోకి ప్రవేశించండి.” ప్రతి సమాజం (నరకంలో) ప్రవేశించినపుడు తన పూర్వపు వారిని (సమాజాన్ని) శపిస్తుంది. తుదకు వారంతా అక్కడ చేరిన పిదప; తరువాత వచ్చిన వారు తమకంటే ముందు వచ్చిన వారిని గురించి: “ఓ మా ప్రభూ! వీరే మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసినవారు, కావున వీరికి రెట్టింపు నరకాగ్ని శిక్ష విధించు!” అని అంటారు. దానికి (అల్లాహ్): “ప్రతి వాడికి రెట్టింపు (శిక్ష) విధించ బడుతుంది, కాని మీరది తెలుసుకోలేరు!” అని అంటాడు.

7:39

మరియు అప్పుడు మొదటి వారు తరువాత వచ్చిన వారితో: “మీకు మాపై ఎలాంటి ఆధిక్యత లేదు కావున మీరు కూడా మీ కర్మలకు బదులుగా శిక్షను చవి చూడండి!” అని అంటారు.

7:40

నిశ్చయంగా, మా సూచనలను అబద్ధాలని తిరస్కరించిన వారికొరకు మరియు వాటిపట్ల దురహంకారం చూపిన వారికొరకు, ఆకాశద్వారాలు ఏ మాత్రం తెరువబడవు. మరియు ఒంటె సూదిబెజ్జంలో నుండి దూరిపో గలిగేవరకు వారు స్వర్గంలో ప్రవేశించ జాలరు. మరియు ఈ విధంగా మేము అపరాధులకు ప్రతిఫలమిస్తాము.

7:41

నరకమే వారి పాన్పు మరియు వారి దుప్పటి అవుతుంది. మరియు ఈ విధంగా మేము దుర్మార్గులకు ప్రతిఫలమిస్తాము.

7:42

కాని, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వ్యక్తికి, మేము అతని శక్తికి మించిన భారం వేయము. ఇటువంటి వారే స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

7:43

మరియు మేము వారి హృదయాల నుండి పరస్పర ద్వేషభావాలను తొలగిస్తాము. వారి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు వారు ఇలా అంటారు: “మాకు ఇక్కడికి చేరటానికి సన్మార్గం చూపిన అల్లాహ్‌యే సర్వ స్తోత్రాలకు అర్హుడు. అల్లాహ్ మాకు ఈ సన్మార్గం చూపకపోతే మేము సన్మార్గం పొంది ఉండేవారం కాదు. మా ప్రభువు పంపిన ప్రవక్తలు వాస్తవంగా సత్యాన్నే తీసుకు వచ్చారు!” అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: “మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా, మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే!”

7:44

మరియు స్వర్గవాసులు, నరక వాసులను ఉద్దేశించి ఇలా అంటారు: “మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాన్ని మేము వాస్తవంగా, సత్యమైనదిగా పొందాము. ఏమీ? మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని సత్యమైనదిగా పొందారా?” వారు జవాబిస్తారు: “అవును!” అప్పుడు ప్రకటించే వాడొకడు వారి మధ్య ఇలా ప్రకటిస్తాడు: “దుర్మార్గులపై అల్లాహ్ శాపం (బహిష్కారం) ఉంది!”

7:45

ఎవరైతే (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తారో మరియు అది తప్పు మార్గమని చూపగోరుతారో! అలాంటి వారే పరలోక జీవితాన్ని తిరస్కరించినవారు.

7:46

మరియు ఆ ఉభయవర్గాల మధ్య ఒక అడ్డుతెర ఉంటుంది. దాని ఎత్తైన ప్రదేశాలమీద కొందరుప్రజలుంటారు. వారు ప్రతి ఒక్కరినీ వారి గుర్తులనుబట్టి తెలుసు కుంటారు. వారు స్వర్గవాసులను పిలిచి: “మీకు శాంతి కలుగు గాక (సలాం)!” అని అంటారు. వారు ఇంకా స్వర్గంలో ప్రవేశించ లేదు, కాని దానిని ఆశిస్తున్నారు. (3/4)

7:47

మరియు వారి దృష్టి నరకవాసుల వైపునకు మళ్ళించబడినపుడు వారు ఇలా అంటారు: “ఓ మా ప్రభూ! మమ్మల్ని ఈ దుర్మార్గులతో చేర్చకు!”

7:48

మరియు ఎత్తైన ప్రదేశాలపై ఉన్న వారు వారిని (నరకవాసులను) వారి గుర్తుల ద్వారా గుర్తించి వారితో అంటారు: “మీరు కూడ బెట్టిన ఆస్తిపాస్తులు మరియు మీ దురహంకారాలు, మీకు ఏమైనా లాభం చేకూర్చాయా?

7:49

“ ‘వీరికి, అల్లాహ్ తన కారుణ్యాన్ని ఏమాత్రం ప్రసాదించడు.’ అని మీరు ప్రమాణాలుచేసి చెబుతూ ఉండేవారు, వీరే కదా? (చూడండి వారితో ఇలా అనబడింది): ‘మీరు స్వర్గంలో ప్రవేశించండి, మీకు ఎలాంటి భయమూ ఉండదు మరియు మీరు దుఃఖ పడరు కూడా!’ ”

7:50

మరియు నరకవాసులు స్వర్గ వాసులతో: “కొద్ది నీళ్ళో లేక అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారంలో నుండైనా కొంత మా వైపుకు విసరండి.” అని అంటారు. (దానికి స్వర్గ వాసులు): “నిశ్చయంగా అల్లాహ్! ఈ రెండింటినీ సత్యతిరస్కారులకు నిషేధించి వున్నాడు.” అని అంటారు.

7:51

వీరే, వారు; ఎవరైతే తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా చేసుకున్నారో. మరియు ఇహలోక జీవితం వారిని మోసానికి గురిచేసింది. (అల్లాహ్ ఇలా సెలవిస్తాడు): “వారు ఈ నాటి సమావేశాన్ని మరచి, మా సూచనలను తిరస్కరించినట్లు, ఈ నాడు మేమూ వారిని మరచిపోతాము!”

7:52

మరియు వాస్తవానికి మేము వారికి గ్రంథాన్ని ప్రసాదించి, దానిని జ్ఞానపూర్వ కంగా స్పష్టంగా వివరించి ఉన్నాము. అది విశ్వసించే వారికి ఒక మార్గదర్శిని, మరియు కారుణ్యం.

7:53

ఏమీ? వారు (అవిశ్వాసులు) దాని తుది ఫలితం సంభవించాలని నిరీక్షిస్తు న్నారా? దాని తుదిఫలితం సంభవించే దినమున, దానిని నిర్లక్ష్యం చేసినవారు: “వాస్తవానికి మా ప్రభువు పంపిన ప్రవక్తలు సత్యం తెచ్చారు. అయితే ఏమీ? మా కొరకు సిఫారసు చేయటానికి, సిఫారసుదారులు ఎవరైనా ఉన్నారా? లేదా మేము మళ్ళీ తిరిగి (భూలోకంలోకి) పంపబడితే మేమింతవరకు చేసిన కర్మలకు విరుధ్ధంగా చేసేవారం కదా?” అని పలుకుతారు. వాస్తవానికి వారు తమకు తాము నష్టం కలిగించుకున్నారు మరియు వారు కల్పించుకున్న (దైవాలన్నీ) వారిని త్యజించి ఉంటాయి.

7:54

నిశ్చయంగా మీ ప్రభువైన అల్లాహ్‌యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్‌లలో) సృష్టించాడు. ఆ పిదప తన సింహాసనాన్ని ('అర్ష్‌ను) అధిష్ఠించాడు. ఆయన రాత్రి పగటివెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్య చంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వలోకాలకు పోషకుడు!

7:55

మీ ప్రభువును వినయంతో మరియు రహస్యంగా (మౌనంగా) ప్రార్థించండి. నిశ్చయంగా, ఆయన హద్దులు మీరే వారిని ప్రేమించడు.

7:56

మరియు భూమిలో సంస్కరణ జరిగిన పిదప దానిలో కల్లోలాన్ని రేకెత్తించ కండి మరియు భయంతో మరియు ఆశతో ఆయనను ప్రార్థించండి. నిశ్చయంగా, అల్లాహ్ కారుణ్యం సజ్జనులకు సమీపంలోనే ఉంది.

7:57

మరియు ఆయనే తన కారుణ్యానికి ముందు శుభవార్తలు తెచ్చే వాయువులను పంపేవాడు. ఎప్పుడైతే అవి బరువైన మేఘాలను ఎత్తుకొని వస్తాయో మేము వాటిని నిర్జీవమైన నగరాల వైపునకు తీసుకొనిపోయి వాటినుండి నీటిని కురి పిస్తాము. ఆ నీటి వలన పలువిధాలైన ఫలాలను ఉత్పత్తిచేస్తాము. ఇదే విధంగా మేము మృతులను కూడా లేపుతాము; ఈ విధంగానైనా మీరు హితబోధ స్వీకరిస్తారని!

7:58

మరియు సారవంతమైన నేల తన ప్రభువు ఆదేశంతో పుష్కలంగా పంట నిస్తుంది. మరియు నిస్సారమైన దాని (నేల) నుండి నాసిరకం పంట తప్ప మరేమీ రాదు. ఈ విధంగా మేము కృతజ్ఞతలు చూపేవారికి మా సూచనలను వివరిస్తాము.

7:59

వాస్తవంగా, మేము నూ'హ్ను అతని జాతివారి వద్దకు పంపాము. అతను వారితో: “నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షను గురించి భయపడుతున్నాను.” అని అన్నాడు.

7:60

అతని జాతి నాయకులు అన్నారు: “నిశ్చయంగా, మేము నిన్ను స్పష్టమైన తప్పుదారిలో చూస్తున్నాము!”

7:61

దానికి (నూ'హ్) అన్నాడు: “నా జాతి ప్రజలారా! నాలో ఏ తప్పిదం లేదు. మరియు వాస్తవానికి నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను.

7:62

“నా ప్రభువు సందేశాలను మీకు అందజేస్తున్నాను మరియు (ధర్మ) బోధన చేస్తున్నాను. ఎందుకంటే! మీకు తెలియని విషయాలు అల్లాహ్ తరఫునుండి నాకు తెలుస్తున్నాయి.

7:63

“మీలోని ఒక పురుషుని ద్వారా – దైవభీతి కలిగిఉంటే, మీరు కరుణింప బడతారని – మిమ్మల్ని హెచ్చరించ టానికి, మీ ప్రభువు తరఫునుండి మీవద్దకు జ్ఞాపిక వచ్చిందని మీరు ఆశ్చర్యపడుతున్నారా?”

7:64

అయినా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము అతనిని మరియు అతనితో బాటు ఓడలో ఉన్నవారిని కాపాడాము. మరియు మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన వారిని ముంచివేశాము. నిశ్చయంగా, వారు గుడ్డిగా ప్రవర్తించిన జనం. (7/8)

7:65

ఇంకా మేము 'ఆద్ (జాతి) వద్దకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. అతను: “ఓ నా జాతి సోదరులారా! మీరు అల్లాహ్‌నే ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదేవుడు లేడు. ఏమీ? మీకు దైవభీతి లేదా?” అని అన్నాడు.

7:66

అతని జాతివారిలో సత్యతిర స్కారులైన నాయకులు ఇలా అన్నారు: “మేము, నిశ్చయంగా నిన్ను మూఢత్వంలో చూస్తున్నాము మరియు నిశ్చయంగా, నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాము!”

7:67

(హూద్) అన్నాడు: “నాజాతి వారలారా! నాలో ఏ మూఢత్వంలేదు. మరియు నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను!

7:68

“నేను మీకు నా ప్రభువు సందేశాలను అందజేస్తున్నాను మరియు నిశ్చయంగా, నేను మీకు నమ్మదగిన ఉపదేశకుడను.

7:69

“లేదా! మిమ్మల్ని హెచ్చరించటానికి – మీ ప్రభువు తరఫునుండి హితోపదేశం – మీలోని ఒక పురుషుని ద్వారా వచ్చిందని మీరు ఆశ్చర్యపడుతున్నారా? నూ'హ్ జాతి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి, మీకు అపార బలాధిక్యతను ఇచ్చిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఈవిధంగా అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసు కుంటే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు!”

7:70

వారన్నారు: “మేము అల్లాహ్‌ను ఒక్కణ్ణి మాత్రమే ఆరాధించి, మా తండ్రి-తాతలు ఆరాధించే వాటిని వదలిపెట్టమని (చెప్పటానికి) నీవు మా వద్దకు వచ్చావా? ఒకవేళ నీవు సత్యవంతుడవే అయితే మమ్మల్ని భయపెట్టే దానిని (శిక్షను) తీసుకొనిరా!”

7:71

(హూద్) అన్నాడు: “వాస్తవానికి మీపై మీ ప్రభువు యొక్క ఆగ్రహం మరియు శిక్ష విరుచుకుపడ్డాయి. అల్లాహ్ ఏ ప్రమాణం ఇవ్వకున్నా – మీరు మరియు మీ తండ్రి-తాతలు పెట్టుకున్న (కల్పిత) పేర్ల విషయంలో – నాతో వాదులాడుతున్నారా? సరే, అయితే మీరు నిరీక్షించండి, మీతోపాటు నేనూ నిరీక్షిస్తాను!”

7:72

కావున తుదకు మేము అతనిని (హూద్‌ను) మరియు అతని తోటివారిని మా అనుగ్రహంతో రక్షించాము. మరియు మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన వారిని నిర్మూలించాము. ఎందు కంటే వారు విశ్వసించకుండా ఉన్నారు.

7:73

ఇక స'మూద్ జాతి వారి వద్దకు వారి సోదరుడైన, 'సాలి'హ్ను పంపాము. అతను వారితో: “నా జాతి సోదరులారా! అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవానికి, మీ వద్దకు మీ ప్రభువు తరఫునుండి ఒక స్పష్టమైన సూచన వచ్చింది. ఇది అల్లాహ్ మీకు ఒక అద్భుత సూచనగా పంపిన ఆడఒంటె కావున దీనిని అల్లాహ్ భూమిపై మేయటానికి వదలిపెట్టండి. మరియు హాని కలిగించే ఉద్దేశంతో దీనిని ముట్టుకోకండి. అలాచేస్తే మిమ్మల్ని బాధా కరమైన శిక్ష పట్టుకుంటుంది.

7:74

“మరియు ఆయన, 'ఆద్ జాతి వారి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి మిమ్మల్ని భూమిపై స్థిరపరచిన విషయం జ్ఞాపకం చేసుకోండి. మీరు దాని మైదానాలలో కోటలను నిర్మించుకుంటున్నారు. మరియు కొండలను తొలచి గృహాలు నిర్మించుకుంటున్నారు. కావున అల్లాహ్అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు భూమిపై అనర్థాన్ని, కల్లోలాన్ని రేకెత్తించకండి!” అని అన్నాడు.

7:75

('సాలి'హ్) జాతి వారిలోని అహం కారులైన నాయకులు విశ్వసించిన బలహీన వర్గం వారితో అన్నారు: “సాలిహ్ తన ప్రభువు పంపిన ప్రవక్త అని మీకు నిశ్చయంగా తెలుసా?” దానికి వారు: ''మేము నిశ్చయంగా, అతని ద్వారా పంపబడిన సందేశాన్ని విశ్వసిస్తున్నాము.'' అని జవాబిచ్చారు.

7:76

ఆ అహంకారులన్నారు: “మీరు విశ్వసించిన దానిని మేము నిశ్చయంగా, తిరస్కరిస్తున్నాము!”

7:77

ఆ తరువాత వారు ఆ ఆడఒంటె వెనుక కాలి మోకాలి పెద్దనరం కోసి (చంపి), తమ ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, అతనితో అన్నారు: “ఓ 'సాలి'హ్! నీవు నిజంగానే సందేశహరుడవైతే నీవు మమ్మల్ని బెదిరించే, ఆ శిక్షను తీసుకురా!”

7:78

అప్పుడు వారిని భూకంపం పట్టు కున్నది. వారు తమ ఇండ్లలోనే బోర్లా (శవాలుగా మారి) పడిపోయారు.

7:79

పిదప అతను ('సాలి'హ్) వారి నుండి తిరిగి పోతూ అన్నాడు: “ఓ నా జాతి ప్రజలారా! వాస్తవంగా, నేను నాప్రభువు సందేశాన్ని మీకు అందజేశాను. మరియు మీకు మంచి సలహాలను ఇచ్చాను, కానీ మీరు మంచి సలహాలు ఇచ్చే వారంటే ఇష్టపడ లేదు!”

7:80

ఇక లూ'త్! అతను తన జాతి వారితో: “ఏమీ? మీరు ఇంతకు పూర్వం ప్రపంచంలో ఎవ్వరూ చేయని అసహ్యకరమైన పనులు చేస్తారా?” అని అడిగిన విషయం జ్ఞప్తికి తెచ్చుకోండి.

7:81

''వాస్తవానికి, మీరు స్త్రీలను వదలి కామంతో పురుషుల వద్దకు పోతున్నారు. వాస్తవంగా, మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు.

7:82

కాని అతని జాతి వారి జవాబు కేవలం ఇలాగే ఉండింది: “వీరిని మీ నగరం నుండి వెళ్ళ గొట్టండి. వాస్తవానికి వీరు తమను తాము మహా పవిత్రులని అనుకుంటున్నారు!”

7:83

ఆ పిదప మేము అతనినీ మరియు అతని ఇంటి వారినీ – అతని భార్యను తప్ప – రక్షించాము. ఆమె వెనుక ఉండిపోయిన వారిలో చేరిపోయింది.

7:84

మరియు మేము వారిపై (రాళ్ళ) వర్షాన్ని కురిపించాము. చూడండి! ఆ అపరాధుల ముగింపు ఏలా జరిగిందో!

7:85

మరియు మేము మద్యన్ జాతి వారి వద్దకు వారి సహోదరుడు షు'ఐబ్ను (పంపాము). అతను వారితో అన్నాడు: “నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చివున్నది. కొలిచేటప్పడు మరియు తూచేటప్పుడు పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై సంస్కరణ జరిగిన తరువాత కల్లోలాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులే అయితే, ఇదే మీకు మేలైనది.

7:86

“మరియు ఆయనను విశ్వసించిన వారిని, అల్లాహ్ మార్గం నుండి నిరోధించటానికి వారిని బెదరిస్తూ, అది వక్రమైనదని చూపగోరి ప్రతి మార్గంలో కూర్చోకండి. మీరు అల్పసంఖ్యలో ఉన్నప్పుడు ఆయన మీ సంఖ్యను అధికంచేసిన విషయాన్ని జ్ఞాపకం చేసు కోండి. మరియు కల్లోలం రేకెత్తించినవారి గతి ఏమయిందో చూడండి.

7:87

“మరియు నా ద్వారా పంపబడిన దానిని (సందేశాన్ని) మీలో ఒక వర్గం వారు విశ్వసించి, మరొకవర్గం వారు విశ్వసించక పోతే! అల్లాహ్ మన మధ్య తీర్పు చేసే వరకూ సహనం వహించండి. మరియు ఆయనే అత్యుత్తమమైన న్యాయాధిపతి!”

7:88

దురహంకారులైన అతని జాతి నాయకులన్నారు: “ఓషు'ఐబ్! మేము నిన్నూ మరియు నీతోబాటు విశ్వసించిన వారినీ, మా నగరం నుండితప్పక వెడలగొడ్తాము. లేదా మీరు తిరిగి మా ధర్మంలోకి రండి!” అతనన్నాడు: “మేము దానిని అసహ్యించు కున్నప్పటికీ (మీ ధర్మంలోకి చేరాలా)?”

7:89

(ఇంకా ఇలాఅన్నాడు): “వాస్తవంగా, అల్లాహ్ మాకు (మీ ధర్మం నుండి) విముక్తి కలిగించిన తరువాత కూడా మేము తిరిగి మీ ధర్మంలోకి చేరితే! మేము అల్లాహ్‌పై అబద్ధం కల్పించిన వారమవుతాము. మా ప్రభువైన అల్లాహ్ కోరితే తప్ప! మేము తిరిగి దానిలో చేరలేము. మా ప్రభువు జ్ఞానం ప్రతి వస్తువునూ ఆవరించి ఉంది. మేము అల్లాహ్పైననే ఆధారపడి ఉన్నాము. ‘ఓ మా ప్రభూ! మా మధ్య మరియు మా జాతివారి మధ్య న్యాయంగా తీర్పుచేయి. మరియు నీవే అత్యుత్తమమైన తీర్పు చేసేవాడవు!’ ”

7:90

మరియు అతని జాతిలోని సత్య తిర స్కారులైన నాయకులు అన్నారు: “ఒక వేళ మీరు షు'ఐబ్ను అనుసరిస్తే! నిశ్చయంగా మీరు నష్టంపొందిన వారవుతారు.”

7:91

అప్పుడు వారిని ఒక భూకంపం పట్టుకున్నది మరియు వారు తమ ఇండ్లలోనే బోర్లా (శవాలై) పడిపోయారు.

7:92

షు'ఐబ్ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించినవారు అక్కడ ఎన్నడూ నివసించి ఉండనే లేదన్నట్లుగా నశించి పోయారు. షు'ఐబ్ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించిన వారే వాస్తవానికి నష్టంపొందిన వారయ్యారు.

7:93

(షు'ఐబ్) ఇలా అంటూ వారినుండి మరలి పోయాడు: “నాజాతి ప్రజలారా! వాస్తవంగా నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేశాను మరియు మీకు హితోపదేశం చేశాను. కావున ఇపుడు సత్యతిరస్కారులైన జాతివారి కొరకు నేనెందుకు దుఃఖించాలి?”

7:94

మరియు మేము ఏ నగరానికి ప్రవక్తను పంపినా! దాని ప్రజలను ఆపదలకు మరియు దౌర్భాగ్యానికి గురిచేయకుండా ఉండలేదు, వారు ఇలాగైనా వినమ్రులు అవుతారేమోనని!

7:95

ఆ తరువాత వారి దుస్థితిని, సుస్థితిగా మార్చిన పిదప వారు హాయిగా ఉంటూ, ఇలా అన్నారు: “వాస్తవానికి కష్టసుఖాలు మా పూర్వికులకు కూడా సంభవించాయి.” కావున మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాము మరియు వారు దానిని గ్రహించలేక పోయారు.

7:96

మరియు ఒకవేళ ఆ నగరవాసులు విశ్వసించి, దైవభీతి కలిగిఉంటే – మేము వారిపై ఆకాశం నుండి మరియు భూమి నుండి – సర్వశుభాలనొసంగి ఉండేవారం. కాని వారు (ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు, కనుక వారు చేసిన కర్మలకు ఫలితంగా మేము వారిని శిక్షించాము.

7:97

ఏమీ? ఈ నగరాలవాసులు, తాము నిద్రపోయేటప్పుడు రాత్రి సమయమున వచ్చే మా శిక్షనుండి సురక్షితంగా ఉన్నారా?

7:98

లేదా ఈ నగరాలవాసులు, పట్టపగలు తాము కాలక్షేపంలో ఉన్నప్పుడు వచ్చే మా శిక్షనుండి సురక్షితంగా ఉన్నారా?

7:99

ఏమీ?వారు అల్లాహ్ యుక్తి (శిక్ష) నుండినిర్భయంగాఉన్నారా? నాశనంకాబోయే వారు తప్ప, ఇతర జాతి వారెవ్వరూ అల్లాహ్ యుక్తి గురించి నిర్భయంగా ఉండ జాలరు.

7:100

ఏమీ? పూర్వపు భూలోకవాసుల తరువాత, భూమికి వారసులయినవారికి, మేము కోరితే వారి పాపాలవలన వారికి కూడా శిక్ష విధించగలమని ఉపదేశం అంద లేదా? మరియు మేము, వారి హృదయాల మీద ముద్ర వేసిఉన్నాము, దానివల్ల వారు (మా హితోపదేశాన్ని) వినలేకున్నారు.

7:101

ఈ నగరాల వృత్తాంతాలను కొన్నింటిని మేము నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవానికి వారివద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన (నిదర్శనాలు) తీసుకొని వచ్చారు. కాని వారు ముందు తిరస్క రించిన దానిని మరల విశ్వసించలేదు. ఈ విధంగా అల్లాహ్ సత్య తిరస్కారుల హృదయాలపై ముద్రవేస్తాడు.

7:102

మరియు మేము వారిలో చాలా మందిని తమ వాగ్దానాన్ని పాటించే వారిగా చూడలేదు. మరియు వాస్తవానికి వారిలో చాలామందిని దుష్టులుగానే (ఫాసిఖీన్గానే) పొందాము (చూశాము).

7:103

ఆ తరువాత మేము మూసాను మా సూచనలతో ఫిర్'ఔన్ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. వారు, వాటి (మా సూచనల) పట్ల దుర్మార్గంతో ప్రవర్తించారు. కావున చూడండి, దౌర్జన్యపరుల గతి ఏమయిందో!

7:104

మరియు మూసా అన్నాడు: “ఓ ఫిర్'ఔన్! నేను నిశ్చయంగా, సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను!

7:105

“అల్లాహ్‌ను గురించి సత్యం తప్ప మరేవిషయాన్ని పలకని బాధ్యతగలవాడను. వాస్తవానికి, నేను మీ వద్దకు, మీ ప్రభువు తరఫునుండి స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చాను, కావున ఇస్రాయీ'ల్ సంతతివారిని నావెంట పోనివ్వు.”

7:106

(ఫిర్'ఔన్) అన్నాడు: “నీవు ఏదైనా సూచనను తీసుకొనివచ్చిఉంటే – నీవు సత్య వంతుడవే అయితే – దానిని తీసుకొనిరా!”

7:107

అప్పుడు (మూసా) తన చేతికర్రను విసిరాడు, అకస్మాత్తుగా అది ఒక స్పష్టమైన పెద్దసర్పంగా (సు''అబాన్గా) మారిపోయింది.

7:108

మరియు అతడు తన చేతిని బయటికి తీశాడు. ఇక అది చూసే వారికి తెల్లగా మెరుస్తూ కనిపించింది.

7:109

(ఇది చూసి), ఫిర్'ఔన్ జాతి నాయకులు అన్నారు: “నిశ్చయంగా, ఇతడు నేర్పుగల ఒక గొప్ప మాంత్రికుడు!”

7:110

(ఫిర్'ఔన్ అన్నాడు): “ఇతడు మిమ్మల్ని మీ భూమినుండి వెడలగొట్ట గోరు తున్నాడు. అయితే! మీ సలహా ఏమిటి?”

7:111

వారన్నారు: “అతనికి (మూసాకు) మరియు అతని సోదరునికి కొంత వ్యవధి నిచ్చి, అన్ని నగరాలకు బంటులను పంపు.

7:112

“వారు నిపుణులైన ప్రతి మాంత్రి కుణ్ణి నీవద్దకు తీసుకొనివస్తారు.”

7:113

మరియు మాంత్రికు లందరూ ఫిర్'ఔన్ వద్దకు వచ్చి: “ఒకవేళ మేము గెలిస్తే మాకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది కదా!” అని అన్నారు.

7:114

(ఫిర్'ఔన్) అన్నాడు: “అవును, నిశ్చయంగా మీరు నా సాన్నిధ్యాన్ని కూడా పొందుతారు.”

7:115

వారన్నారు: “ఓ మూసా!(ముందు) నీవు విసురుతావా? లేక మేము విసరాలా?”

7:116

(మూసా) అన్నాడు: “(ముందు) మీరే విసరండి!” వారు(తమ కర్రలను) విసిరి, ప్రజల చూపులను మంత్రముగ్ధం చేస్తూ వారికి భయం కలిగించే ఒక అద్భుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించారు. (1/8)

7:117

మేము మూసాకు: “నీ చేతి కర్రను విసురు.” అని ఆదేశమిచ్చాము. అప్పుడది వారి (మాంత్రికుల) బూటక (మాయాజాలాన్ని) మ్రింగివేసింది.

7:118

ఈ విధంగా సత్యం స్థాపిత మయ్యింది మరియు వారు (మాంత్రికులు) చేసిందంతా విఫలమయ్యింది.

7:119

ఈ విధంగా వారక్కడ అపజయం పొంది అవమానంతో కృంగిపోయారు.

7:120

మరియు మాంత్రికులు సాష్టాంగ పడ్డారు

7:121

(మాంత్రికులు) అన్నారు: “మేము సర్వలోకాల ప్రభువును విశ్వసించాము.

7:122

''మూసా మరియు హారూన్ల ప్రభువును.”

7:123

ఫిర్'ఔన్ అన్నాడు: “నేను అనుమతి ఇవ్వకముందే మీరు అతనిని విశ్వసించారా? నిశ్చయంగా, మీరందరూ కలిసి ఈ నగరం నుండి దాని వాసులను వెడలగొట్టటానికి పన్నిన పన్నాగమిది, (దీని పరిణామం) మీరిప్పుడే తెలుసుకోగలరు.

7:124

“నేను తప్పక మీఒకప్రక్కచేతులను మరొక ప్రక్క కాళ్ళను నరికిస్తాను. ఆ తరువాత మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను.”

7:125

వారు ఇలా జవాబిచ్చారు: “నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది!

7:126

“మరియు మా ప్రభువు తరఫు నుండి మావద్దకు వచ్చిన సూచనలను, మేము విశ్వసించామనే కదా! నీవు మాతో పగతీర్చుకో దలచావు.” (ఇలా ప్రార్థించారు): “ఓ మా ప్రభూ! మాకు సహనమొసంగు. మేము నీకు విధేయులముగా (ముస్లింలముగా) మృతినొందే టట్లు చేయి!”

7:127

మరియు ఫిర్'ఔన్ జాతి నాయకులు అతనితో అన్నారు: “ఏమీ? భూమిలో కల్లోలం రేకెత్తించటానికి మరియు నిన్నూ నీ దేవతలను విడిచిపోవటానికి, నీవు మూసాను మరియు అతని జాతివారిని వదలుతున్నావా?” అతడు (ఫిర్'ఔన్) జవాబిచ్చాడు: “మేము తప్పక వారి కుమారులను చంపి వారి కుమార్తెలను బ్రతకనిస్తాము. మరియు నిశ్చయంగా, మేము వారిపై ప్రాబల్యం కలిగిఉన్నాము.”

7:128

మూసా తనజాతి వారితో అన్నాడు: “అల్లాహ్ సహాయంకోరండి మరియు సహనం వహించండి. నిశ్చయంగా ఈ భూమి అల్లాహ్‌దే! ఆయన తన దాసులలో, తాను కోరిన వారిని దానికి వారసులుగాచేస్తాడు. మరియు అంతిమ (సాఫల్యం) దైవభీతి గలవారిదే!”

7:129

(మూసా జాతివారు) అన్నారు: “నీవు రాక పూర్వమూ మరియు నీవు వచ్చిన తర్వాతనూ మేము బాధించ బడ్డాము!” (మూసా) జవాబిచ్చాడు: “మీ ప్రభువు త్వర లోనే మీ శత్రువులను నాశనం చేసి మిమ్మల్ని భూమిలో 'ఖలీఫాలుగా చేసి నప్పుడు మీరు ఎలాప్రవర్తిస్తారో ఆయన చూస్తాడు?”

7:130

మరియు వాస్తవానికి, మేము ఫిర్'ఔన్ జాతివారిని – బహుశా వారికి తెలివి వస్తుందేమోనని – ఎన్నోసంవత్సరాల వరకు కరువుకు, ఫలాల నష్టానికి గురిచేశాము.

7:131

ఆ పిదప వారికి మంచికాలం వచ్చి నపుడు వారు: “మేము దీనికే అర్హులం!” అని అనేవారు. కాని వారికి కష్టకాలం దాపురించి నపుడు, వారు మూసా మరియు అతనితో పాటు ఉన్నవారిని తమకు అపశకునంగా పరిగణించే వారు. వాస్తవానికి వారి అపశకు నాలన్నీ అల్లాహ్ చేతులలోనే ఉన్నాయి, కాని వారిలో చాలా మందికి తెలియదు.

7:132

మరియు వారు (మూసాతో) అన్నారు: “నీవు మమ్మల్ని భ్రమింపజేయ టానికి ఏ సూచ నను తెచ్చినా మేము నిన్నునమ్మేవారంకాము!”

7:133

కావున మేము వారిపై జలప్రళయం ('తూఫాన్), మిడుతల దండు, పేనులు, కప్పలు మరియు రక్తం మొదలైన స్పష్టమైన సూచనలను పంపాము. అయినా వారు దురహంకారం చూపారు ఎందుకంటే వారు మహా అపరాధులై ఉండిరి.

7:134

మరియు వారిపైకి ఆపద వచ్చినపుడు వారనేవారు: “ఓ మూసా! నీ ప్రభువు నీకిచ్చిన వాగ్దానం ఆధారంగా నీవు మా కొరకు ప్రార్థించు! ఒకవేళ నీవు మా నుండి ఈ ఆపదను తొలగిస్తే మేము నిన్ను విశ్వసిస్తాము; మరియు ఇస్రాయి'ల్ సంతతి వారిని తప్పక నీవెంట పంపుతాము.”

7:135

కానీ, ఒక నిర్ణీతకాలం వరకు వారి నుండి ఆపదను తొలగించగానే – ఆ కాలానికి వారు చేరుకోవలసినవారే కాబట్టి – వారు తమ వాగ్దానాన్ని భంగపరిచేవారు!

7:136

కావున మేము వారికి ప్రతీకారం చేశాము మరియు వారిని సముద్రంలో ముంచి వేశాము; ఎందుకంటే! వాస్తవానికి వారు మా సూచనలను అసత్యాలని తిరస్కరించారు మరియు వాటిని లక్ష్యపెట్ట కుండా ఉన్నారు.

7:137

మరియు వారి స్థానంలో బలహీనులుగా ఎంచబడేవారిని మేము శుభాలతోనింపిన, ఆ దేశపు తూర్పు భాగాలకు మరియు పశ్చిమ భాగాలకు వారసులుగా చేశాము. ఈ విధంగా నీ ప్రభువు ఇస్రాయి'ల్ సంతతివారికి చేసిన ఉత్తమమైన వాగ్దానం, వారు ఓర్పు వహించి నందుకు పూర్తయింది. మరియు ఫిర్'ఔన్ మరియు అతని జాతివారు ఉత్పత్తి చేసిన వాటిని మరియు ఎత్తిన (నిర్మించిన) కట్టడాలను నాశనంచేశాము.

7:138

మరియు మేము ఇస్రాయి'ల్ సంతతి వారిని సముద్రం దాటించిన తరువాత వారు (నడుస్తూ) తమ విగ్రహాలను ఆరాధించే ఒక జాతివారి వద్దకు చేరారు. వారన్నారు: “ఓ మూసా! వీరి ఆరాధ్య దైవాలవలే మాకు కూడ ఒక ఆరాధ్యదైవాన్ని నియమించు.” (దానికి మూసా) జవాబిచ్చాడు: “నిశ్చయంగా, మీరు జ్ఞానహీనులైన జాతికి చెందినవారు.”

7:139

“నిశ్చయంగా వీరు ఆచరిస్తు న్నందుకు (విగ్రహారాధన చేస్తున్నందుకు) నాశనం చేయబడతారు. వీరు చేస్తున్నదంతా నిరర్థకమైనదే.”

7:140

(మూసా ఇంకా) ఇలా అన్నాడు: “ఏమీ? నేను అల్లాహ్‌ను వదలి మరొక ఆరాధ్యదైవాన్ని మీకొరకు అన్వేషించాలా? వాస్తవానికి ఆయనే(మీకాలపు) సర్వలోకాల వారిపై మీకు ఘనతను ప్రసాదించాడు కదా!”

7:141

మరియు మేము మిమ్మల్ని ఫిర్'ఔన్ జాతివారి నుండి విముక్తి కలిగించిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వారు మిమ్మల్ని ఘోర బాధకు గురిచేస్తూ ఉన్నారు. మీ కుమారులను చంపి, మీ స్త్రీలను సజీవులుగా వదులుతూ ఉన్నారు. మరియు ఇందు మీ ప్రభువు తరఫునుండి మీకొక గొప్ప పరీక్ష ఉండింది. (1/4)

7:142

మరియు మేము మూసా కొరకు (సినాయి కొండపై) ముప్ఫైరాత్రుల (గడువు) నిర్ణయించాము. తరువాత పది (రాత్రులు) పొడిగించాము. ఈ విధంగా అతని ప్రభువు నిర్ణయించిన నలభైరాత్రుల గడువు పూర్త య్యింది. మూసా తన సోదరుడగు హారూన్తో అన్నాడు: “నీవు నా జాతి ప్రజలలో నాకు ప్రాతినిధ్యం వహించు మరియు సంస్కరణకు పాటుపడు మరియు అరాచకాలు చేసేవారి మార్గాన్ని అనుసరించకు.”

7:143

మరియు మూసా మేము నిర్ణయించిన సమయానికి (మా నిర్ణీత చోటుకు) వచ్చినపుడు, అతని ప్రభువు అతనితో మాట్లాడాడు. (మూసా) అన్నాడు: “ఓ నా ప్రభూ! నాకు నీ దర్శన భాగ్యమివ్వు (కని పించు). నేను నిన్ను చూడదలచాను!” (అల్లాహ్) అన్నాడు: “నీవు నన్ను (ఏ మాత్రం) చూడలేవు! కాని ఈ పర్వతం వైపుకు చూడు! ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉండగలిగితే, అప్పుడు నీవు నన్ను చూడగలవనుకో!” అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేయగా అది భస్మమైపోయింది మరియు మూసా స్పృహతప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తరువాత (మూసా) అన్నాడు: “నీవు సర్వ లోపాలకు అతీతుడవు, నేను పశ్చాత్తాపంతో నీవైపుకు మరలుతున్నాను మరియు నేను విశ్వసించేవారిలో మొట్టమొదటి వాడను.”

7:144

(అల్లాహ్) అన్నాడు: “ఓ మూసా –ప్రవక్త పదవికి మరియు సంభాషించటానికి – నిశ్చయంగా, నేను ప్రజలందరిలో, నిన్ను ఎన్నుకున్నాను. కావున నేను నీకిచ్చిన దానిని తీసుకొని, కృతజ్ఞులలో చేరు.”

7:145

మరియు మేము అతనికొరకు, ఫలకాల మీద ప్రతి విధమైన ఉపదేశాన్ని ప్రతి వ్యవహా రానికి సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చి, అతనితో(మూసాతో) అన్నాము: “వీటిని గట్టిగా పట్టుకో! మరియు వీటి ఉత్తమ ఉపదేశాలను అనుసరించమని నీ జాతివారిని ఆజ్ఞాపించు. త్వరలోనే నేను అవిధేయుల (ఫాసిఖూన్ల) నివాసాన్ని మీకు చూపుతాను.”

7:146

ఏ హక్కూ లేకుండా భూమిపై దురహంకారంతో వ్యవహరించే వారిని నేను నా సూచనల (ఆయాత్ల) నుండి దూరం చేస్తాను. మరియు వారు ఏ సూచనను (ఆయత్‌ను)చూసినా దానిని విశ్వసించరు. ఒకవేళ సక్రమమైన మార్గం వారిముందుకు వచ్చినా, వారు దానిని అవలంబించరు. కాని వారు తప్పుదారిని చూస్తే దానిని అవలంబిస్తారు. ఎందుకంటే వాస్తవానికి, వారు మా సూచనలను (ఆయాత్‌లను) అబద్ధాలని తిరస్కరించారు మరియు వాటి నుండి నిర్లక్ష్యులై ఉన్నారు.

7:147

మరియు మా సూచనలను (ఆయాత్‌లను) మరియు పరలోక దర్శనాన్ని (పునరుత్థాన దినాన్ని) అబద్ధాలని తిరస్క రించిన వారుచేసినకర్మ లన్నీవ్యర్థమవుతాయి. ఏమీ? వారు కేవలం తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్పమరేమైనా పొందగలరా?

7:148

మరియు మూసా జాతివారు, అతను పోయిన పిదప తమ ఆభరణాలతో ఒక ఆవుదూడ విగ్రహాన్ని తయారుచేశారు. దానిలో నుండి (ఆవు అరుపు వంటి) ధ్వని వచ్చేది. ఏమీ? అది వారితో మాట్లాడ జాలదని మరియు వారికి ఏవిధమైన మార్గదర్శకత్వం చేయ జాలదని వారికి తెలియదా? అయినా వారు దానిని (దైవంగా) చేసుకొని పరమ దుర్మార్గులయ్యారు.

7:149

మరియు వారు మార్గం తప్పారని తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపంతో మొత్తు కుంటూ అనేవారు: “మా ప్రభువు మమ్మల్ని కరుణించి, మమ్మల్ని క్షమించక పోతే మేము తప్పక నాశనం అయ్యేవారమే!”

7:150

మరియు మూసా తన జాతివారి వద్దకు తిరిగివచ్చి క్రోధంతో విచారంతో అన్నాడు: “నేను వెళ్ళిన పిదప మీరు ఆచరించింది ఎంతచెడ్డది! ఏమీ? మీ ప్రభువు ఆజ్ఞ (రాకముందే) తొందరపడి (ఆయన ఆరాధనను వదిలారా)?” తరువాత ఫల కాలను పడవేసి, తన సోదరుని తల వెంట్రుకలను పట్టుకొని తనవైపునకు లాగాడు. (హారూన్) అన్నాడు: “నా సోదరుడా (తల్లి కుమారుడా)! వాస్తవానికి ఈ ప్రజలు బలహీనునిగా చూసి నన్ను చంపే వారే, కావున నీవు (మన) శత్రువులకు, నన్ను చూసి సంతోషించే అవకాశం ఇవ్వకు మరియు నన్ను దుర్మార్గులలో లెక్కించకు!”

7:151

(మూసా) అన్నాడు: “ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా సోదరుణ్ణి క్షమించు. మరియు మా ఇద్దరినీ నీ కారుణ్యంలోకి చేర్చుకో. మరియు నీవే కరుణించేవారిలో అందరి కంటే అధికంగా కరుణించేవాడవు!”

7:152

ఆవుదూడను (దైవంగా) చేసుకున్న వారు తప్పకుండా తమ ప్రభువు ఆగ్రహానికి గురి అవుతారు మరియు వారు ఇహలోక జీవితంలో అవమానం పాలవుతారు. మరియు అసత్యాలు కల్పించే వారిని మేము ఇదే విధంగా శిక్షిస్తాము.

7:153

మరియు ఎవరు దుష్కార్యాలు చేసిన పిదప, పశ్చాత్తాపపడతారో మరియు విశ్వసిస్తారో! అలాంటివారు నిశ్చయంగా, ఆ తరువాత నీ ప్రభువును క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొందుతారు.

7:154

మరియు మూసా కోపం చల్లారిన తరువాత ఆ ఫలకాలను ఎత్తుకున్నాడు. మరియు తమ ప్రభువుకు భయపడేవారికి, వాటి వ్రాతలలో మార్గదర్శకత్వం మరియు కారుణ్యం ఉన్నాయి.

7:155

మరియు మేము నిర్ణయించిన గడువు కొరకు, మూసా తనజాతి వారిలో నుండి డెభ్భై మందిని ఎన్నుకున్నాడు. ఆ పిదప వారిని భూకంపం ఆవరించగా (మూసా) ఇలా ప్రార్థించాడు: ''ఓ నా ప్రభూ! నీవు కోరితే, వీరిని మరియు నన్ను కూడా ఇంతకు పూర్వమే సంహరించి ఉండేవాడవు. ఏమీ? మాలో కొందరు మూఢులు చేసినపనికి నీవు మమ్మల్ని నశింపజేస్తావా? ఇదంతా నీ పరీక్షయే! దీని ద్వారా నీవు కోరిన వారిని మార్గ భ్రష్టత్వానికి గురిచేస్తావు మరియు నీవు కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తావు. మా సంరక్ష కుడవు నీవే, కావున మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. మరియు క్షమించే వారందరిలో నీవే అత్యుత్తముడవు! (3/8)

7:156

“మాకు ఇహలోకంలో మరియు పర లోకంలోకూడా మంచిస్థితినేవ్రాయి. నిశ్చయంగా మేము నీవైపునకేమరలాము.” (అల్లాహ్) సమా ధానం ఇచ్చాడు: ''నేను కోరిన వారికి నా శిక్షను విధిస్తాను. నా కారుణ్యం ప్రతి దానిని ఆవరించి ఉన్నది. కనుక నేను దానిని దైవభీతి గల వారికీ, విధిదానం('జకాత్) ఇచ్చేవారికీ మరియు నా సూచనలను విశ్వసించే వారికీ వ్రాస్తాను!

7:157

“ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్య రాస్యుడైన ఈ ప్రవక్తను అనుస రిస్తారో!ఎవరి ప్రస్తావన వారి వద్దవున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మ తంచేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్బంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందేవారు.”

7:158

(ఓ ము'హమ్మద్!) వారితో ఇలా అను: “మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరివైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను. భూమ్యాకాశాల సామ్రాజ్యా ధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు; ఆయనే జీవన్మ రణాలను ఇచ్చేవాడు. కావున అల్లాహ్‌ను మరియు ఆయన సందేశహరుడు నిరక్ష రాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్‌ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుస రించండి, అప్పుడే మీరు మార్గదర్శ కత్వం పొందుతారు!”

7:159

మరియు మూసా జాతివారిలో సత్యం ప్రకారమే మార్గదర్శకత్వం చూపుతూ మరియు దాని (సత్యం) ప్రకారమే న్యాయం చేసే ఒక వర్గం వారు ఉన్నారు.

7:160

మరియు మేము వారిని పన్నెండు తెగలుగా (వర్గాలుగా) విభజించాము. మరియు మూసా జాతివారు అతనిని నీటి కొరకు అడిగినపుడు. మేము అతనిని: “నీ చేతికర్రతో రాయిపైకొట్టు!”అని ఆజ్ఞాపించాము. అపుడు దానినుండి పన్నెండు ఊటలు ప్రవహించసాగాయి. అపుడు ప్రతి తెగవారు, తాము నీళ్ళు తీసుకునే స్థలాన్ని తెలుసు కున్నారు. మరియు మేము వారిపై మేఘాల ఛాయను కల్పించాము. మరియు వారి కొరకు మన్న మరియు సల్వాలను దింపాము: “మేము మీకు ప్రసాదించిన పరిశుధ్ధమైన పదార్థాలను తినండి.” అని అన్నాము. మరియు వారుమాకు అన్యాయం చేయలేదు, కాని తమకు తామే అన్యాయం చేసుకున్నారు.

7:161

మరియు వారికి ఇలా ఆజ్ఞ ఇవ్వ బడిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి!): “ఈ నగరంలో నివసించి, అందులో మీ ఇష్ట ప్రకారం తినండి మరియు: ‘మా పాపాలను క్షమించు ('హి'త్తతున్),’ అని అంటూ ఉండండి. మరియు సాష్టాంగ పడుతూ దాని ద్వారంలో ప్రవేశించండి, మేము మీ పాపాలను క్షమిస్తాము. మేము సజ్జనులను అధికంగా (అనుగ్రహిస్తాము).”

7:162

కాని వారిలో దుర్మార్గులైన వారు తమకు చెప్పబడిన మాటను మార్చి, మరొక మాటను ఉచ్చరించారు; కావున వారు చేస్తున్న దుర్మార్గానికి ఫలితంగా మేము వారిపై ఆకాశం నుండి ఆపదను పంపాము.

7:163

మరియు సముద్ర తీరము నందున్న ఆ నగర (వాసులను) గురించి వారిని అడుగు; వారు శనివారపు (సబ్త్) ధర్మాన్ని ఉల్లంఘించే వారు! ఆ శనివారం (సబ్త్) రోజుననే చేపలు వారి ముందుకు ఎగిరెగిరినీటిపైకివచ్చేవి. మరియు శనివారపు (సబ్త్) ధర్మం పాటించని రోజు (చేపలు) వచ్చేవి కావు. వారి అవిధేయతకు కారణంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురిచేశాము.

7:164

వారిలోని ఒకవర్గం వారు: “అల్లాహ్ ఎవరిని నశింపజేయనున్నాడో లేదా ఎవరికి కఠిన శిక్ష విధించనున్నాడో! అలాంటి వారికి, మీరెందుకు ఉపదేశం చేస్తున్నారు?” అని అంటే అతను (ఉపదేశం చేసేవ్యక్తి) అన్నాడు: “మీ ప్రభువు ముందు, (హితబోధ ఎందుకు చేయలేదని), నాపై నింద ఉండకుండా మరియు వారు దైవభీతి గలవారు అవుతారేమోనని!”

7:165

తరువాత వారికి చేయబడిన హితబోధను వారు మరచినప్పుడు! దుష్కార్యాల నుంచి వారిస్తూ ఉన్న వారిని మేము రక్షించాము. మరియు దుర్మార్గులైన ఇతరులను, అవిధేయత చూపినందుకు కఠిన శిక్షకు గురిచేశాము.

7:166

కాని నిషేధించబడిన వాటినే వారు హద్దులు మీరి చేసినప్పుడు మేము వారితో: ''మీరు నీచమైన కోతులుగా మారండి.'' అని అన్నాము.

7:167

మరియు నీ ప్రభువు వారిపై (యూదులపై) అంతిమ దినంవరకు దుఃఖ కరమైన శిక్ష విధించే వారిని పంపుతూ ఉంటానని ప్రకటించిన విషయాన్ని(జ్ఞప్తికి తెచ్చుకోండి). నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష విధించటంలో శీఘ్రుడు.మరియునిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

7:168

మరియు మేము వారిని భువిలో వేర్వేరు తెగలుగా జేసి వ్యాపింపజేశాము. వారిలో కొందరు సన్మార్గులున్నారు, మరి కొందరు దానికి దూరమైన వారున్నారు. బహుశా వారు (సన్మార్గానికి) మరలి వస్తారేమోనని, మేము వారిని మంచి-చెడు స్థితుల ద్వారా పరీక్షించాము.

7:169

ఆ పిదప వారి తరువాత దుష్టులైన వారు వారి స్థానంలో గ్రంథానికి వారసులై, తుచ్ఛమైన ప్రాపంచిక వస్తువుల లోభంలో పడుతూ: “మేము క్షమింపబడతాము.” అని పలుకుతున్నారు. అయినా ఇటువంటి సొత్తు తిరిగి వారికి లభిస్తే దానిని తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. “అల్లాహ్ విషయంలో సత్యం తప్ప మరేమీ పలుకరాదు.” అని గ్రంథంలో వారితో వాగ్దానం తీసుకోబడలేదా, ఏమిటి? అందులో (గ్రంథంలో) ఉన్నదంతా వారు చదివారు కదా! మరియు దైవభీతి గలవారి కొరకు పరలోక నివాసమే ఉత్తమమైనది. ఏమీ? మీరిది గ్రహించలేరా?

7:170

మరియు ఎవరైతే గ్రంథాన్ని స్థిరంగా అనుసరిస్తారో మరియు నమా'జ్ స్థాపిస్తారో, అలాంటిసద్వర్తనులప్రతిఫలాన్ని నిశ్చయంగా మేము వ్యర్థం చేయము. (1/2)

7:171

మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము ('తూర్) పర్వతాన్ని పైకెత్తి వారిపై కప్పుగా ఉంచితే! వాస్తవానికి, వారు అది తమపై పడుతుందేమోనని భావించినప్పుడు మేము వారితో అన్నాము: “మేము మీకు ఇచ్చిన దానిని(గ్రంథాన్ని) దృఢంగా పట్టుకోండి మరియు అందులో ఉన్న దానిని జ్ఞాపకం ఉంచుకోండి, దానితో మీరు దైవభీతి పరులు కావచ్చు!”

7:172

మరియు (జ్ఞాపకం చేసుకోండి!) నీ ప్రభువు ఆదమ్ సంతతివారి వీపులనుండి వారి సంతానాన్ని తీసి, వారికి వారినే సాక్షులుగా నిలబెట్టి: “ఏమీ? నేను మీ ప్రభువును కానా?” అని అడుగగా! వారు: “అవును! (నీవే మా ప్రభువని) మేము సాక్ష్యమిస్తున్నాము.” అని జవాబిచ్చారు. తీర్పుదినమున మీరు: “నిశ్చయంగా, మేము దీనిని ఎరుగము.” అని అనగూడదని.

7:173

లేక: “వాస్తవానికి ఇంతకు పూర్వం మా తాతముత్తాతలు అల్లాహ్‌కు సాటి (భాగ స్వాములు)కల్పించారు. మేము వారి తరు వాత వచ్చిన, వారి సంతతివారం (కాబట్టి వారిని అనుసరించాము).అయితే?ఆ అసత్య వాదులు చేసిన కర్మలకు నీవు మమ్మల్ని నశింప జేస్తావా?” అని అనగూడదని.

7:174

మరియు ఈ విధంగానైనా వారు సన్మార్గానికి మరలుతారేమోనని మేము ఈ సూచనలను స్పష్టంగా తెలుపుతున్నాము.

7:175

మరియు మేము, మా సూచనలు (ఆయాత్) ప్రసాదించిన ఆ వ్యక్తి గాథ వారికి వినిపించు. అతడు వాటినుండి విముఖుడై నందుకు షై'తాన్ అతనిని వెంబడించాడు, కావున అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు.

7:176

మరియు మేము కోరుకుంటే వాటి (ఆ సూచనల) ద్వారా అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించేవారము. కాని అతడు భూమి వైపునకు వంగాడు, మరియు తన కోరికలను అనుసరించాడు. అతని దృష్టాంతం ఆ కుక్క వలె ఉంది: నీవు దానిని బెదిరించినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది, లేక వదలిపెట్టినా అది నాలుకనుబయటికి వ్రేలాడ దీస్తుంది. మా సూచన(ఆయాత్)లను అబద్ధాలని నిరాకరించే వారి దృష్టాంతం కూడా ఇదే! నీవు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉంటే, బహుశా వారు ఆలోచించవచ్చు!

7:177

మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారి దృష్టాంతం చాలాచెడ్డది. ఎందు కంటే వారు తమకు తాము అన్యాయం చేసుకుంటున్నారు.

3:178

అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గ భ్రష్టత్వంలో పడనిచ్చినవారు! వారే నష్టపోయే వారు.

7:179

మరియు వాస్తవానికి మేము చాలా మంది జిన్నాతులనుమరియు మానవులను నరకం కొరకు సృజించాము. ఎందుకంటే! వారికి హృదయాలున్నాయి కాని వాటితో వారు అర్థంచేసుకోలేరు మరియు వారికి కళ్ళున్నాయి కాని వాటితో వారు చూడలేరు మరియు వారికి చెవులున్నాయి కానివాటితో వారువినలేరు. ఇలాంటి వారు పశువుల వంటి వారు; కాదు! వాటికంటే అధములు. ఇలాంటివారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు.

7:180

మరియు అల్లాహ్ పేర్లు! అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి. మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందగలరు.

7:181

మరియు మేముసృష్టించిన వారిలో ఒక వర్గంవారు సత్యం ప్రకారం మార్గ దర్శ కత్వం చేసేవారునూ మరియు దానిని అనుస రించియే న్యాయం చేసేవారునూ ఉన్నారు.

7:182

మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించేవారిని, మేము వారికి తెలియ కుండానే క్రమక్రమంగా (నాశనం వైపునకు) తీసుకుపోతాము.

7:183

మరియు నేను వారికి వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా వ్యూహం బలమైనది.

7:184

ఏమీ? తమ సహచరుడు పిచ్చి పట్టిన వాడు కాదని వారు గమనించలేదా? అతను కేవలం స్పష్టమైన హెచ్చరిక చేసే వాడు మాత్రమే!

7:185

ఏమీ? వారు భూమ్యాకాశాలపై గల (అల్లాహ్) ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతివస్తువును గమనించి చూసి, బహుశా తమ గడువు కూడా సమీపించిందే మోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరేవిధమైన సందేశాన్ని విశ్వసిస్తారు?

7:186

అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడ నిచ్చిన వానికి మార్గదర్శకుడెవ్వడూ లేడు! మరియు ఆయన వారిని తమ తలబిరుసు తనంలో త్రోవతప్పి తిరుగటానికి వదలిపెడు తున్నాడు.

7:187

(ఓ ప్రవక్తా!) వారు నిన్ను ఆ అంతిమఘడియను గురించి: ''అది ఎప్పుడు రానున్నది?'' అని అడుగు తున్నారు. వారితో ఇలా అను: ''నిస్సందేహంగా, దాని జ్ఞానం నా ప్రభువుకు మాత్రమేఉంది. కేవలం ఆయన స్వయంగా దానిని, దాని సమయంలో తెలియజేస్తాడు. అది భూమ్యా-కాశాలకు ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగానే వచ్చిపడుతుంది.'' దానిని గురించి నీకు బాగా తెలిసిఉన్నట్లు భావించి, వారు నిన్ను దానిని గురించి అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానం ఇవ్వు: ''నిస్సందేహంగా, దాని జ్ఞానం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. కాని చాలామంది ఇది తెలుసుకోలేరు.''

7:188

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: ''అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను, లాభం గానీ, నష్టం గానీ చేసుకునే అధికారం నాకు లేదు. నాకు అగోచర విషయ జ్ఞానం ఉండి ఉన్నట్లైతే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమ కూర్చు కునేవాడిని. మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసే వాడను మరియు శుభవార్త నిచ్చేవాడను మాత్రమే!'' (5/8)

7:189

ఆయనే, మిమ్మల్ని ఒకేవ్యక్తి నుండి సృష్టించాడు మరియు అతని నుండియే జీవితసౌఖ్యం పొందటానికి అతని భార్యను ('జౌజను) పుట్టించాడు. అతను ఆమెను కలుసుకున్నపుడు, ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించి దానిని మోస్తూ తిరుగుతూ ఉంటుంది. పిదప ఆమె గర్భ భారం అధికమైనప్పుడు, వారు ఉభయులూ కలిసి వారి ప్రభువైన అల్లాహ్‌ను ఇలా వేడుకుంటారు: “నీవు మాకు మంచి బిడ్డను ప్రసాదిస్తే మేము తప్పక నీకు కృతజ్ఞతలు తెలిపేవారమవుతాము!”

7:190

ఆయన వారికి ఒక మంచి బిడ్డను ప్రసాదించిన పిదప వారు, ఆయన ప్రసాదించిన దాని విషయంలో ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించ సాగుతారు. కాని వారు కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్ మహోన్నతుడు.

7:191

ఏమీ? దేనినీ కూడ సృష్టించలేని మరియు (స్వయంగా) తామే సృష్టించబడిన వారిని, వారు ఆయనకు సాటిగా (భాగ స్వాములుగా) కల్పిస్తారా?

7:192

మరియు వారు, వారికి ఎలాంటి సహాయం చేయలేరు. మరియు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు.

7:193

మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా, వారు మిమ్మల్ని అనుసరించలేరు. మీరు వారిని పిలిచినా, లేక మౌనం వహించినా మీకు సమానమే!

7:194

నిశ్చయంగా, మీరు అల్లాహ్‌ను విడిచి ఎవరినైతే పిలుస్తున్నారో, వారు కూడా మీలాంటి దాసులే! మీరు వారిని పిలువండి, మీరు సత్యవంతులే అయితే మీ పిలుపుకు వారు సమాధానమివ్వాలి.

7:195

ఏమీ? వారికి కాళ్ళున్నాయా, వాటితో నడవటానికి? లేదా వారికి చేతులున్నాయా, వాటితో పట్టుకోవటానికి? లేదా వారికి కళ్ళు న్నాయా, వాటితో చూడటానికి? లేదా వారికి చెవులున్నాయా, వాటితో వినటానికి? వారితో అను: “మీరు సాటి కల్పించిన వారిని (భాగ స్వాములను) పిలువండి. తరువాత మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా కుట్రలు (వ్యూహాలు) పన్నండి, నాకు గడువు కూడా ఇవ్వకండి.

7:196

“నిశ్చయంగా, ఈ గ్రంథాన్ని అవతరింప జేసిన అల్లాహ్‌యే నా సంరక్షకుడు, ఆయన సద్వర్తనులనే మిత్రులుగా చేసుకుంటాడు.

7:197

“మరియు ఆయనను విడిచి మీరు వేడుకునేవారు మీకు ఏ విధమైన సహాయం చేయలేరు. మరియు వారు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు.

7:198

“మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా వారు వినలేరు. మరియు వారు నీ వైపుకు చూస్తున్నట్లు నీవు భావిస్తావు, కాని వారు చూడలేరు.”

7:199

మన్నింపు వైఖరిని అవలంబించు, ధర్మమును బోధించు మరియు మూర్ఖుల నుండి విముఖుడవగు.

7:200

మరియు ఒకవేళ షై'తాన్ నుండి నీకు ప్రేరేపణ కలిగితే! నీవు అల్లాహ్ శరణు వేడుకో! నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

7:201

వాస్తవానికి, దైవభీతి గలవారు తమకు షై'తాన్ నుండి కలత గలిగితే! వారు (అల్లాహ్‌ను) స్మరిస్తారు, అప్పుడు వారు అంతా సరిగ్గా చూస్తారు.

7:202

మరియు వారి (షై'తాన్ల) సహోదరులు వారిని తప్పుదారివైపుకు లాక్కొని పోగోరుతారు మరియు వారు ఏ మాత్రం పట్టు వదలరు.

7:203

మరియు (ఓ ప్రవక్తా!) నీవు వారికి ఏదైనా సూచనను తేలేకపోయినప్పుడు వారు: “నీవే స్వయంగా దానిని ఎందుకు (కల్పించు కొని) తేలేదు?” అని అంటారు. వారితో ఇలా అను: “నేను కేవలం నా ప్రభువు తరఫునుండి నాకు పంపబడే సందేశాన్ని (వహీని) మాత్రమే అనుసరించేవాడను. ఇందు(ఈ ఖుర్ఆన్)లో విశ్వసించే వారి కొరకు, మీ ప్రభువు తరఫు నుండి అనేక బోధనలు, మార్గదర్శకత్వం మరియు కారుణ్యమున్నాయి.”

7:204

మరియు ఖుర్ఆన్ పారాయణం జరిగే టప్పుడు దానిని శ్రధ్ధగా వినండి మరియు నిశ్శబ్దంగా ఉండండి, అప్పుడు మీరు కరుణింప బడవచ్చు!

7:205

మరియు నీవు నీ మనస్సులో వినయంతో, భయంతో మరియు ఎక్కువ శబ్దంతో గాక (తగ్గుస్వరంతో) ఉదయం మరియు సాయంత్రం నీ ప్రభువును స్మరించు. మరియు నిర్లక్ష్యం చేసేవారిలో చేరకు.

7:206

నిశ్చయంగా, నీ ప్రభువుకు దగ్గరగా ఉన్నవారు (దైవదూతలు) తమ ప్రభువును ఆరాధించటానికి అహంభావం చూపరు. మరియు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. మరియు ఆయనకే సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు. (3/4)


**********